మా సమ్మర్ వెకేషన్.. ఇలా!

వేసవి అంటేనే విహార యాత్రలు. సెలవుల్లో ఆనందంగా గడపడానికని కొందరు.. వేడిని తట్టుకోలేక చల్లటి ప్రదేశాల్లో సేదదీరాలని మరికొందరు ఈ సీజన్లో పర్యటనల్ని ఎంచుకుంటుంటారు. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఇందుకు మినహాయింపు కాదు....

Updated : 29 May 2024 16:47 IST

వేసవి అంటేనే విహార యాత్రలు. సెలవుల్లో ఆనందంగా గడపడానికని కొందరు.. వేడిని తట్టుకోలేక చల్లటి ప్రదేశాల్లో సేదదీరాలని మరికొందరు ఈ సీజన్లో పర్యటనల్ని ఎంచుకుంటుంటారు. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఇందుకు మినహాయింపు కాదు. షూటింగ్స్‌ నుంచి కాస్త విరామం దొరికినా, లేదంటే విరామం తీసుకొని మరీ మెచ్చిన వారితో నచ్చిన చోటికి చెక్కేస్తుంటారు. ఈ క్రమంలోనే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాన్వీ కపూర్‌, కియారా అడ్వానీ.. వంటి ముద్దుగుమ్మలు ఇటీవలే సమ్మర్‌ వెకేషన్‌ పూర్తిచేసుకొని తిరిగొచ్చారు. మరి, ఇంతకీ మన అందాల తారల ఫేవరెట్‌ సమ్మర్‌ వెకేషన్‌ స్పాట్స్‌ ఏంటి? వాళ్లు పంచుకున్న అనుభవాలేంటి? తెలుసుకుందాం రండి..

రకుల్‌ ‘ఫిజీ’ డైరీస్‌!

కెరీర్‌కు, వ్యక్తిగత జీవితానికి సమ ప్రాధాన్యమిస్తుంది టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ క్రమంలోనే షూటింగ్స్‌ నుంచి కాస్త విరామం దొరికితే చాలు.. నచ్చిన పర్యటక ప్రదేశాలకు చెక్కేస్తుంటుంది. అలా ఇటీవలే తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఫిజీలో వాలిపోయిందీ అందాల తార. ఎక్కువగా బీచ్‌లను ఇష్టపడే ఈ పంజాబీ బ్యూటీ.. ఫిజీ ద్వీప అందాలకు మైమరచిపోయింది. అక్కడి సముద్రాల్లో ఈత కొడుతూ, సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ, భిన్న సంస్కృతుల్ని ఎంజాయ్‌ చేశానంటూ.. తన ఫిజీ డైరీస్‌ని ఫొటోలు, వీడియోల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిందీ భామ.
‘ఫిజీ ప్రకృతి రమణీయత, ఇక్కడి సంస్కృతి, రుచులు నన్ను మరో లోకంలోకి తీసుకెళ్లాయి. మామూలుగానే నేను బీచ్‌లంటే ఇష్టపడతా. ఫిజీలో ఆ ఆనందాన్ని తనివి తీరా ఆస్వాదించా. నాది ఆర్మీ నేపథ్యమున్న కుటుంబం కావడంతో చిన్న వయసు నుంచే వివిధ ప్రాంతాల్లో నివసించడం, అక్కడి వాతావరణానికి ఎడ్జస్ట్ కావడం నాకు అలవాటైంది. అలాగే పెరిగి పెద్దయ్యే క్రమంలోనూ వెకేషన్లకు ఎక్కువగా వెళ్లేదాన్ని. అక్కడి కొత్త వ్యక్తులతో పరిచయాలు నా స్నేహ పరిధిని మరింత విస్తరించాయి. ఇక పర్యటనల్లోనూ ఫిట్‌నెస్‌ రొటీన్‌ను మిస్సవను. ఎందుకంటే వ్యాయామాలే నాకు ప్రశాంతతను అందిస్తాయి. అలాగే బీచ్‌ వెకేషన్లకు వెళ్లినప్పుడు.. స్నార్‌కెల్లింగ్‌, డైవింగ్‌, కయాకింగ్‌.. వంటి సాహస క్రీడల్లో పాల్గొనడానికి ఇష్టపడతా..’ అంటూ తన వెకేషన్‌ మెమరీస్‌ని పంచుకుంది రకుల్‌.


‘ఇటలీ’ జ్ఞాపకాలు మర్చిపోను!

దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్ని ఎక్కువగా సందర్శిస్తుంటుంది బాలీవుడ్‌ అందాల తార జాన్వీ కపూర్‌. తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఆమె.. తన తల్లి వల్లే తనకు ఆధ్యాత్మికత అలవడిందంటూ తాజాగా ఓ సందర్భంలో పంచుకుంది. ప్రస్తుతం ముంబయిలో స్థిరపడ్డా చెన్నైని ఇష్టపడే జాన్వీ.. ఇటీవలే అక్కడి ‘Muppathamman Temple’ను సందర్శించి.. ‘ఇది మా అమ్మకెంతో ఇష్టమైన దేవాలయం, పర్యటక ప్రదేశం..’ అంటూ చెప్పుకొచ్చింది.
‘అమ్మ కొన్ని విషయాల్ని బాగా నమ్మేది. ముఖ్యంగా అమ్మకు ఆధ్యాత్మికత ఎక్కువ. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారంటే అమ్మకు ఎనలేని భక్తి. తన ప్రతి పుట్టినరోజున స్వామి వారిని దర్శించుకునేది. అమ్మ పోయాక నేను తన కోరికను పూర్తి చేయడం ప్రారంభించా. నిజానికి తిరుమల వెళ్లిన ప్రతిసారీ ఎనలేని మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచూ వెళ్తుంటా. అంతేకాదు.. షూటింగ్స్‌ నుంచి విరామం దొరికినప్పుడల్లా నచ్చిన ప్రదేశాలకు చెక్కేస్తుంటా. ఎక్కువగా తీర ప్రాంతాల్ని ఇష్టపడుతుంటా. సముద్రం పక్కనే కూర్చొని సీఫుడ్‌ తినడం మర్చిపోలేని అనుభూతిని పంచుతుంటుంది. ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తొంగి చూస్తే.. ఎన్నో మధురానుభూతులు మదిలో మెదులుతాయి. అమ్మానాన్నలు, ఖుషీతో కలిసి వెళ్లిన వెకేషన్‌ స్పాట్స్‌ని ఎప్పుడూ మర్చిపోను. అందులోనూ ఓసారి నాన్న మమ్మల్ని ఇటలీ తీసుకెళ్లారు. అక్కడ బోట్‌ని అద్దెకు తీసుకోవడం, సముద్రాల్లో ఈత కొట్టడం, రోడ్‌ ట్రిప్‌.. ఇవన్నీ స్వీట్‌ మెమరీసే! అంటోంది జాన్వీ.
అంతేకాదు.. చెన్నైలో బీచ్‌ను ఆనుకొని ఉన్న తన విలాసవంతమైన విల్లాను ఇటీవలే Airbnb అనే ఆతిథ్య సంస్థ అద్దెకు తీసుకుంది. ఆకట్టుకునే ఇంటీరియర్స్‌తో పాటు ఆరుబయట పచ్చదనం, బీచ్‌ సౌందర్యంతో కూడుకొని ఉన్న ఈ విల్లాలో దిగిన ఫొటోల్నీ అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుందీ చక్కనమ్మ.


బీచ్‌ ప్లీజ్‌.. ఇది యాడ్‌ కాదు!

వేసవికి, బీచ్‌లకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఈ కాలంలో వేడిని తట్టుకోలేక చాలామంది బీచ్‌లకు వెళ్లడం, అక్కడి సముద్రపు నీటిలో ఈత కొడుతూ సేదదీరడం కామనే! ఇటీవలే కియారా అడ్వానీ కూడా తన భర్త సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ఇలాంటి ఓ బీచ్‌ వెకేషన్‌నే ఎంచుకుంది. అక్కడి సముద్రపు అందాల్ని తన స్టేట్‌మెంట్‌ కళ్లద్దాల్లో బంధిస్తూ.. ఫ్రూట్‌ సలాడ్‌ను ఎంజాయ్‌ చేసి ఫుల్‌ జోష్‌తో తిరిగొచ్చిందీ భామ. ‘బీచ్‌ ప్లీజ్‌.. ఇది యాడ్‌ కాదు!’ అంటూ తన బీచ్‌ మెమరీస్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది కియారా. అయితే ఎక్కడికి వెళ్లిందో మాత్రం బయటపెట్టలేదీ చక్కనమ్మ.
‘కెరీర్‌ మధ్యమధ్యలో మనం ఎంచుకునే వెకేషన్లు ఎంతో సరదాను, మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. ప్రయాణాల్ని నేనెంతో ఇష్టపడతా. అందులోనూ బీచ్‌లంటే ఎంతో మక్కువ. ఆఫ్రికా, టోక్యో, ఆస్ట్రేలియా.. వంటి దేశాల్ని నా ట్రావెల్‌ బకెట్‌ లిస్టులో చేర్చుకున్నా. ఎక్కడికెళ్లినా ప్రత్యేక వంటకాల్ని రుచి చూడడం, షాపింగ్‌ చేయడం మాత్రం మిస్సవ్వను. ఇక పచ్చటి ప్రకృతి, జలపాతాల మధ్యకు వెళ్తే మాత్రం యోగా చేయాల్సిందే!’ అంటోందీ షేర్షా బ్యూటీ.

మరి మీరూ మీ ట్రావెలింగ్ ముచ్చట్లు పంచుకోండి!

మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్