ఆ అబ్బాయితో పెళ్లంటే అమ్మ భయపడుతోంది..

నేను డిగ్రీ చదువుతున్నాను. నా చిన్నతనంలోనే అమ్మానాన్నలు విడిపోవడం వల్ల మేనమామల సహాయంతో చదువుకుంటున్నాను. అమ్మ టైలరింగ్‌ చేస్తూ చాలా కష్టపడి నన్ను పెంచింది. ఈ మధ్య ఒకబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాని వెంటబడుతున్నాడు. వాళ్లు బాగా డబ్బున్నవాళ్లు. ‘మీ అమ్మకు ఏ కష్టం రాకుండా....

Published : 01 Oct 2022 12:28 IST

నేను డిగ్రీ చదువుతున్నాను. నా చిన్నతనంలోనే అమ్మానాన్నలు విడిపోవడం వల్ల మేనమామల సహాయంతో చదువుకుంటున్నాను. అమ్మ టైలరింగ్‌ చేస్తూ చాలా కష్టపడి నన్ను పెంచింది. ఈ మధ్య ఒకబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాని వెంటబడుతున్నాడు. వాళ్లు బాగా డబ్బున్నవాళ్లు. ‘మీ అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకుందాం. ఆమె కోసమైనా ఒప్పుకో’ అంటున్నాడు. అమ్మకు ఈ విషయం చెబితే చాలా భయపడిపోయింది. అతన్ని మర్చిపోమని తన మీద ఒట్టేయించుకుంది. కానీ, అతను వినడం లేదు. కావాలంటే, వాళ్ల పేరెంట్స్‌ని తీసుకొచ్చి మా అమ్మతో మాట్లాడిస్తానంటున్నాడు. నాకు అతను మంచివాడే అనిపిస్తోంది. కానీ, ఎంత చెప్పినా అమ్మ నా మాట వినడం లేదు. ఈ విషయంలో అమ్మని ఎలా ఒప్పించాలి? సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. ఆ అబ్బాయికి మీరు నచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అడిగి ఉండచ్చు. అయితే ‘మన స్థాయికి తగిన సంబంధం కాదు. ఉన్నత కుటుంబాల్లోని వ్యక్తుల ప్రవర్తనలు వేరుగా ఉంటాయి. వాళ్ల ఆచారవ్యవహారాలు ఎలా ఉంటాయో తెలియదు. పెళ్లైన తర్వాత మా అమ్మాయి వాళ్ల మధ్య ఇమడగలుగుతుందా?’ అన్న సందేహం మీ అమ్మగారికి ఉందేమో? అలాగే పెళ్లైన తర్వాత మిమ్మల్ని ఎలా చూసుకుంటారోనన్న భయం కూడా ఉండి ఉండచ్చు. కాబట్టి, స్థాయికి తగిన సంబంధం చేసుకోవడమే మంచిదని ఆవిడ ఆలోచిస్తున్నట్లున్నారు.

ఈ క్రమంలో మీరు ఆమె వైపు నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, పెళ్లి తర్వాత వంచన చేసేవాళ్లు ఎందరో. కాబట్టి, మీ అమ్మగారు వీటి గురించి ఆలోచించి భయపడుతున్నట్లున్నారు. ఒక కన్నతల్లిగా ఆమెలో ఆ భయం ఉండడం సహజం.

అయితే ఆ అబ్బాయి తన తల్లిదండ్రులను మీ అమ్మగారితో మాట్లాడిస్తానని చెప్పాడంటున్నారు. అది నిజమైతే మీ పెళ్లి విషయంలో వాళ్ల అభిప్రాయాలతో పాటు, మీ పట్ల ఆ అబ్బాయి నిబద్ధత కూడా కొంతవరకు తెలిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ విషయంలో ఏం చేయాలనే దానిపైన మీకు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అన్నిటికన్నా ముఖ్యం.. ఇంకా మీరు డిగ్రీ చదువుతున్నానని చెప్పారు. ముందు అది పూర్తి చేసి, మీ కాళ్ల పైన మీరు నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించడం మంచిది. అప్పటివరకు ఆ అబ్బాయి నిజంగానే మీకోసం వెయిట్ చేసేటట్లయితే, అప్పుడే పెళ్లి గురించి తగిన నిర్ణయం తీసుకోవచ్చు. ఈ క్రమంలో జీవితంలో అసలు మీ లక్ష్యం ఏమిటి అనేది ఆలోచించుకుని, దానిని సాధించడానికి కృషి చేయడం అన్నిటికన్నా ప్రధానమైనది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్