రాధిక-అనంత్‌ల కల్యాణం.. కనులకు వైభోగమే!

పెళ్లంటే పది కాలాల పాటు గుర్తుంచుకునేలా ఘనంగా జరిపించాలంటారు పెద్దలు. పది కాలాలు కాదు.. అనంత కాలాల పాటు గుర్తుంచుకునేలా అనంత్‌-రాధికల పెళ్లి జరిపిస్తున్నారు అంబానీ కుటుంబ సభ్యులు. ముందస్తు పెళ్లి వేడుకల్లో భాగంగా మూడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.

Published : 04 Mar 2024 13:13 IST

(Photos: Instagram)

పెళ్లంటే పది కాలాల పాటు గుర్తుంచుకునేలా ఘనంగా జరిపించాలంటారు పెద్దలు. పది కాలాలు కాదు.. అనంత కాలాల పాటు గుర్తుంచుకునేలా అనంత్‌-రాధికల పెళ్లి జరిపిస్తున్నారు అంబానీ కుటుంబ సభ్యులు. ముందస్తు పెళ్లి వేడుకల్లో భాగంగా మూడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. భూలోక స్వర్గాన్ని తలపించేలా అతిథులకు విందు, వినోద సత్కారాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు తరలి రావడంతో అందరి దృష్టి గుజరాత్‌లోని జామ్‌నగర్ పైనే ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ల పెళ్లి వేడుకల్లోని కొన్ని కీలకమైన ఘట్టాలేంటో చూద్దాం..!

‘ప్రి-వెడ్డింగ్‌ వేడుకలే ఇంత అట్టహాసంగా జరుగుతున్నాయంటే.. పెళ్లి ఇంకెంత గ్రాండ్‌గా చేయనున్నారో..!’ అనంత్‌-రాధికల ముందస్తు పెళ్లి వేడుకలు చూసిన వాళ్లంతా ఇలాగే అనుకుంటున్నారు. మూడు రోజుల పాటు నిర్వహిస్తోన్న ఈ వేడుకలకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వేదికైంది. దేశంలోని అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు పాప్‌ గాయని రిహాన్నా, మెటా వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌, ప్రముఖ వ్యాపారవేత్త బిల్‌గేట్స్‌, ఇతర దేశాల ప్రధానులు-అధ్యక్షుల రాకతో జామ్‌నగర్‌ జామ్‌ జామ్‌ అంటూ వెలిగిపోతోంది. ఇక ఈ మూడు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల కోసం అతిథులకు ప్రత్యేకమైన డ్రస్‌కోడ్‌నూ ఏర్పాటు చేశాయి అంబానీ-మర్చంట్‌ కుటుంబాలు.


‘అన్న సేవ’తో షురూ!

తమ కుటుంబంలో ఏ అకేషన్‌ అయినా ‘అన్న సేవ’తో ప్రారంభించడం అంబానీ కుటుంబ సంప్రదాయం. ఈషా, ఆకాశ్‌ పెళ్లిలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఇప్పుడు అనంత్‌-రాధికల ముందస్తు పెళ్లి వేడుకలూ ఇదే ఈవెంట్‌తో మొదలయ్యాయి. కొన్ని రోజుల పాటు జరగనున్న ఈ అన్న సేవలో భాగంగా జామ్‌నగర్‌, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని స్థానికులకు గుజరాతీ సంప్రదాయ వంటకాల్ని రుచి చూపిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో కాబోయే వధూవరులు స్వయంగా వడ్డిస్తూ.. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ వేడుకలో అనంత్‌-రాధికలు సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెరిసిపోయారు. రాధిక రాణి పింక్‌ సల్వార్‌ కమీజ్‌లో మెరిసిపోగా.. అనంత్‌ ఎరుపు రంగు కుర్తా-ప్యాంట్‌-నెహ్రూ జాకెట్‌లో ముస్తాబయ్యాడు. ఇలా తమ సేవతోనే కాదు.. ట్రెడిషనల్‌ లుక్స్‌తోనూ అందరినీ ఆకట్టుకుందీ జంట. భోజనం తర్వాత ఆహ్వానితుల కోసం ప్రత్యేకంగా జానపద సంగీత కచేరీని ఏర్పాటుచేశారు. ఇలా పెళ్లి వేడుకల్లోనే కాదు.. కరోనా సమయంలోనూ నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఫౌండేషన్‌ భారీ ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి తమ సేవా భావాన్ని చాటుకుంది.

అంతర్జాతీయ అతిథులు

సెలబ్రిటీ పెళ్లిళ్లలో దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన అతిరథ మహారథుల్ని ఆహ్వానించడం తెలిసిందే! గతంలో జరిగిన ఈషా, ఆకాశ్‌ల పెళ్లిళ్లకు దేశంలోని ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే ఈసారి అనంత్‌ పెళ్లికి దేశీయ సెలబ్రిటీలతో పాటు ఇంటర్నేషనల్‌ సెలబ్రిటీ టచ్ ఇవ్వాలనుకుంది అంబానీ కుటుంబం. ఈ క్రమంలోనే విదేశాలకు చెందిన ప్రముఖుల్నీ తమ కొడుకు పెళ్లికి ఆహ్వానించింది. ఇందులో భాగంగానే పాప్‌ సింగర్‌ రిహాన్నా, మెటా వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌ బర్గ్‌-ప్రిసిల్లా చాన్‌ దంపతులు, బిల్‌ గేట్స్‌, ఇవాంకా ట్రప్‌ దంపతులు, ఇతర దేశాల అధ్యక్షులు/ప్రధానులు ఈ పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరుగుతోన్న ఈ ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లో ఒక్కో రోజు ఒక్కో డ్రస్‌ కోడ్‌ను ఏర్పాటుచేశారు. దాని ప్రకారమే అతిథులంతా విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరించి మెరిసిపోతున్నారు. ఆట పాటలతో వేదికను షేక్‌ చేస్తున్నారు. ఇక రిహాన్నా సంగీత ప్రదర్శన, అంబానీ-మర్చంట్‌ కుటుంబ సభ్యుల డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో ముందస్తు పెళ్లి వేడుకలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయని చెప్పచ్చు.

2,500 వంటకాలతో..!

అనంత్‌-రాధిక ప్రి-వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో అదిరిపోయే వంటకాలతో అతిథులకు విందు చేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తంగా దాదాపు 2,500 వంటకాల్ని అతిథులకు వడ్డిస్తున్నారు. అతిథుల కోసం ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. ఈ వంటకాలన్నీ తయారుచేయడానికి మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ నుంచి 21 మంది అనుభవజ్ఞులైన చెఫ్‌లను పిలిపించారట! వీరు కచోరీ, పోహా, జిలేబీ.. వంటి భారతీయ వంటకాలతో పాటు జపనీస్‌, మెక్సికన్‌, థాయ్‌, పార్సీ.. మొదలైన విదేశీ సంప్రదాయ వంటకాల్నీ తయారుచేసి అతిథి సత్కారాలు చేయనున్నారు. అంతేకాదు.. ఈ క్రమంలో ఒకసారి వడ్డించిన వంటకాన్ని రిపీట్‌ చేయకుండా తగిన జాగ్రత్తలూ తీసుకుంటున్నారట! మొత్తానికి ఈ బిగ్‌ ఫ్యాట్‌ వెడ్డింగ్‌లో అతిథులకు కనుల విందే కాదు.. నోటి విందూ దక్కనుంది!


అభిరుచులే కలిపాయి!

మనసులు కలవాలంటే ముందు వారి అభిరుచులు కలవాలి.. అలా తామిద్దరికీ ఉన్న ఓ ఉమ్మడి అభిరుచే తమను కలిపిందని చెబుతున్నారు ఈ కాబోయే దంపతులు. మూగజీవాల్ని ప్రేమించే ఈ జంట.. జంతు సంరక్షణ కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ‘వంతారా ప్రోగ్రామ్‌’ కింద జంతు సంరక్షణ, పునరావాసం కోసం అనంత్‌ కృషి చేస్తున్నారు.
‘రాధిక నా జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం. ఆమె నా కలల రాణి. ఎప్పుడూ మూగజీవాల సంరక్షణ గురించి ఆలోచించే నేను.. ఓ అమ్మాయి ప్రేమలో పడతానని, వివాహ బంధంలోకి అడుగుపెడతానని ఊహించలేదు. రాధికను కలిశాక నా జీవితం మారిపోయింది. తనకూ మూగజీవాలంటే ఇష్టం. ఈ అభిరుచే మమ్మల్ని కలిపింది. నేను ఆరోగ్యపరంగా పలు సమస్యలు ఎదుర్కొనే సమయంలోనూ తను నా వెన్నంటే నిలిచింది..’ అంటూ తన ఇష్టసఖిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు అనంత్. అది విని ముసిముసిగా నవ్వేస్తుంది రాధిక!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్