ఈ చిట్కాలతో.. ఆన్‌లైన్ మోసాలకు దూరంగా..!

ఒకప్పుడు ఫోన్‌ని దూరంగా ఉండేవారితో మాట్లాడడానికి మాత్రమే ఉపయోగించేవారు. అందుకు బ్యాలన్స్ ఉంటే సరిపోయేది. కానీ, నేటి టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ను వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇందుకు ఇంటర్నెట్‌ తప్పనిసరిగా మారింది. అయితే ఇంటర్నెట్‌ని ఉపయోగించే క్రమంలో....

Published : 08 Feb 2023 16:02 IST

ఒకప్పుడు ఫోన్‌ని దూరంగా ఉండేవారితో మాట్లాడడానికి మాత్రమే ఉపయోగించేవారు. అందుకు బ్యాలన్స్ ఉంటే సరిపోయేది. కానీ, నేటి టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ను వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇందుకు ఇంటర్నెట్‌ తప్పనిసరిగా మారింది. అయితే ఇంటర్నెట్‌ని ఉపయోగించే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆన్‌లైన్‌ నేరగాళ్ల వలలో చిక్కుకునే ప్రమాదం ఉంది. అత్యాశతోనో, అవగాహన రాహిత్యంతోనో ఎంతోమంది ఆన్‌లైన్‌ మోసాలకు బాధితులుగా మారుతున్నారు. వీరిలో ఎక్కువ భాగం మహిళలు, పిల్లలు ఉంటున్నారు. అందుకే ఇలాంటి మోసాల గురించి నెటిజన్లకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న ‘సురక్షిత అంతర్జాల దినోత్సవం’గా జరుపుకొంటున్నారు. ఈ క్రమంలో ఇంటర్నెట్‌ వినియోగంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుని, పాటించడం ఎంతో అవసరం.

పాస్‌వర్డ్‌ భద్రంగా..

ఈ డిజిటల్‌ యుగంలో తమకు సంబంధించిన విలువైన సమాచారమంతా ఆన్‌లైన్‌తోనే అనుసంధానమై ఉంటోంది. బ్యాంక్‌ లావాదేవీలు, పర్సనల్‌ ఈ-మెయిల్‌ల దగ్గర నుంచి సోషల్ మీడియా ఖాతాలు, మొబైల్‌ వ్యాలెట్ల వరకు రోజూ మనం ఇంటర్నెట్‌ని ఎన్నో అవసరాల కోసం వాడుతుంటాం. అయితే ఆన్‌లైన్‌ ఖాతాలను ఓపెన్‌ చేయాలంటే యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ తప్పనిసరిగా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సులువుగా గుర్తుంచుకునేందుకు కొంతమంది తమ పేరు, పుట్టిన తేదీ, అంకెలను పాస్‌వర్డ్‌గా పెడుతుంటారు. దీంతో వాటిని బ్రేక్ చేయడం సైబర్‌ నేరగాళ్లకు మరింత సులువుగా మారుతోంది. కాబట్టి అక్షరాలు, అంకెలు, స్పెషల్‌ క్యారెక్టర్ల కలయికగా పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

అపరిచితులతో జాగ్రత్త...

ఆన్‌లైన్‌లో అపరిచితులకు కొదవ లేదు. ఆన్‌లైన్‌ ద్వారా పరిచయమైన అబ్బాయిలతో ప్రేమలో పడి మోసపోయిన అమ్మాయిల వార్తలు మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. కాబట్టి, సామాజిక మాధ్యమాల్లో అపరిచితులకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ అలాంటివారితో మాట్లాడాల్సి వస్తే వ్యక్తిగత సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపేటప్పుడు కానీ, యాక్సెప్ట్‌ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి.

ప్రైవసీ విషయంలో..

ఆన్‌లైన్‌లో ప్రైవసీ చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజుల్లో జరిగే అనేక నేరాలకు ఆన్‌లైన్‌ కేంద్రంగా ఉంటోంది. కాబట్టి, మీ సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. మీ లొకేషన్‌, మొబైల్‌ నంబర్‌ వంటి వ్యక్తిగత సమాచారాన్ని సాధ్యమైనంత వరకు ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది. అలాగే తప్పుదోవ పట్టించే వెబ్‌సైట్లకు దూరంగా ఉండాలి. ఆన్‌లైన్‌ నేరాలకు ఇలాంటి వెబ్‌సైట్లే అడ్డాగా మారుతున్నాయి.

ఆఫర్ల విషయంలో..

‘ఈ లింక్ క్లిక్ చేయండి, ఆఫర్ అందుకోండి’.. ‘వీల్ తిప్పండి, బహుమతిని గెలుచుకోండి’ వంటి మెసేజ్‌లను సామాజిక మాధ్యమాల్లో మనం నిత్యం చూస్తుంటాం. వీటిని క్లిక్‌ చేస్తే వ్యక్తిగత వివరాలను పొందుపరచమని అడుగుతుంటారు. అలా అయితేనే ఆఫర్‌ వస్తుందని ఆశ పెడుతుంటారు. ఒకవేళ మన వివరాలను వారికి అందిస్తే మనం మోసపోవడానికి ఎంతో సమయం పట్టదంటున్నారు నిపుణులు. కాబట్టి, ఏదైనా సంస్థ ఆఫర్‌ ప్రకటిస్తే సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే అధికారిక సామాజిక మాధ్యమాలను పరిశీలించాలంటున్నారు.

రిపోర్ట్‌ చేయాలి...

కొంతమంది ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఏదో ఒక సందర్భంలో ఆన్‌లైన్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటారు. ఈ క్రమంలో డబ్బును కూడా కోల్పోతుంటారు. అయితే బయటకు తెలిస్తే పరువు పోతుందనో, కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏమంటారనో చాలామంది తమకు జరిగిన మోసాన్ని తమలోనే దాచుకుని బాధపడుతుంటారు. ఆన్‌లైన్‌ నేరగాళ్లకు ఇదే వరమని అంటున్నారు నిపుణులు. కాబట్టి, మీకు ఇలాంటి సందర్భం ఏదైనా ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయమని సూచిస్తున్నారు.


పిల్లల విషయంలో...

ఇంటర్నెట్‌కు సంబంధించి కొన్ని అప్లికేషన్లు, వెబ్‌సైట్లను యాక్సెస్‌ చేసుకోవాలంటే వ్యక్తిగత సమాచారం కావాలని అడుగుతుంటాయి. పిల్లలను అలాంటి వెబ్‌సైట్లకు దూరంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం అందులో పొందుపరచవద్దని పిల్లలకు సూచించాలి.

ఇంటర్నెట్‌ వాడుతున్నప్పుడు సాధారణంగా రకరకాల వెబ్‌సైట్స్‌ లింక్స్‌ ప్రత్యక్షమవుతుంటాయి. అందులో కొన్ని అభ్యంతరకరమైనవి కూడా ఉండచ్చు. ఇలాంటి సైట్లను పిల్లలు ఓపెన్‌ చేయకుండా తల్లిదండ్రులు తగిన సూచనలివ్వాలి. వీలైతే వారికి ఉపయోగకరమైన కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే ఓపెనయ్యేలా సెట్టింగ్స్‌ మార్చాలి.

ఇక ఇంటర్నెట్‌లో కనిపించే పాపప్స్‌, స్పామ్‌ మెసెజ్‌లు, మాల్‌వేర్లకు స్పందించవద్దని పిల్లలకు చెప్పాలి. యాంటీ వైరస్‌ను ఇన్‌స్టాల్‌ చేసి తరచుగా కనిపించే ఇలాంటి మెసేజ్‌లను, అప్లికేషన్లను బ్లాక్‌ చేయండి.

మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుండాలి. అధికారిక యాప్‌ స్టోర్‌ నుంచే యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

అవసరం లేని, ఉపయోగించని అప్లికేషన్లను అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలి.

కొన్ని అప్లికేషన్లు పాస్‌వర్డ్స్‌ సేవ్‌ చేసుకోవాలని కోరుతుంటాయి. అలా చేయడం సురక్షితం కాదని పిల్లలకు చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్