చందమామ లోకం... చిన్నారుల కోసం!

ఆంగ్లమాధ్యమంలో చదువులు... స్క్రీన్‌లతో కుస్తీలు... ఇక ఈ తరాలకు తెలుగు పరిచయం అయ్యేదెలా? పుస్తకాలతో దోస్తీ కుదిరేదెలా? ఇదే ఆలోచించారు విశాలి కొప్పర్తి. స్నేహితురాలు శిల్పతో కలిసి ‘నమస్తే గ్యాంగ్‌’ ప్రారంభించి, ఈ రెండూ సాధ్యమయ్యేలా చేస్తున్నారు.

Updated : 06 Jun 2024 07:03 IST

ఆంగ్లమాధ్యమంలో చదువులు... స్క్రీన్‌లతో కుస్తీలు... ఇక ఈ తరాలకు తెలుగు పరిచయం అయ్యేదెలా? పుస్తకాలతో దోస్తీ కుదిరేదెలా? ఇదే ఆలోచించారు విశాలి కొప్పర్తి. స్నేహితురాలు శిల్పతో కలిసి ‘నమస్తే గ్యాంగ్‌’ ప్రారంభించి, ఈ రెండూ సాధ్యమయ్యేలా చేస్తున్నారు. అదెలాగో వసుంధరతో చెప్పుకొచ్చారిలా...

మా స్వస్థలం ఏలూరు దగ్గర కామవరపుకోట. నాన్న రాంబాబు బ్యాంకు ఉద్యోగి. ఆయన ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగా. నాన్నకి తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఎక్కువ. ఇతర రాష్ట్రాల్లో పెరుగుతూ నేను తెలుగుకి ఎక్కడ దూరమవుతానో అని ఆయన భయం. అందుకే చందమామ, బాలమిత్ర వంటి పుస్తకాలు చదివించేవారు. కాలేజీకి వచ్చాకే ఇంగ్లిష్‌ సాహిత్యం అలవాటైందంటే ఆయన తెలుగుతో ఎలా సావాసం చేయించారో అర్థం చేసుకోవచ్చు. ‘లా’ పూర్తిచేశా. మావారూ లాయరే. హైదరాబాద్‌ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు. మాకిద్దరు పిల్లలు. వాళ్లకీ తెలుగు అలవాటు చేయాలనుకున్నా. పెద్దవాడికి కథలు చదివి వినిపించేదాన్ని. వాడికి అర్థమయ్యే బాలల సాహిత్యం కోసం చాలా కష్టపడ్డా. ఇంగ్లిష్‌లో దొరికినన్ని తెలుగులో దొరికేవి కాదు. పబ్లిషింగ్‌ హౌజ్‌లకు వెళ్లిన రోజులూ బోలెడు. ఇంత శ్రమపడితే వాడికి కొన్ని నచ్చేవి కాదు. ఎలాగైతేనేం ఐదేళ్లు వచ్చేసరికి చిన్నగా చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడికి తొమ్మిదేళ్లు. ఇక మా చిన్నవాడికి పుస్తకాలే నచ్చేవి కాదు. ఇల్లు, ఆఫీసు బాధ్యతల్లో పడి నేనూ పెద్దగా పట్టించుకోలేదు అనిపించింది. వీడికీ అలవాటు చేద్దామని ఒళ్లో కూర్చోబెట్టుకొని చదివేదాన్ని. నెమ్మదిగా వాడూ అలవాటుపడ్డాడు. అంటే... మనం చేయట్లేదు కానీ... చేస్తే పిల్లల చేత పుస్తకం పట్టించడం అంత కష్టమేమీ కాదని అర్థమైంది. ఇప్పుడు ఏదో ఒకటి చదవందే నిద్రపోడు.

ఇక్కడా మరో సమస్య. దుస్తులు, బొమ్మలు ఇచ్చినట్టే... చిన్నవాడికి పెద్దవాడు వాడిన పుస్తకాలూ ఇచ్చా. అవేమో చిన్నోడికి నచ్చలేదు. వాడికి సీరియస్‌గా ఉండే నీతికథలు నచ్చవు. హాస్యంతో ఉన్నవి కావాలి. వాటిని వెతకడం ఇంకా కష్టమైంది. నా పరిస్థితే స్నేహితురాలు శిల్పది కూడా. తనకి ఇద్దరమ్మాయిలు. ఈ విషయంగా ఏదైనా చేద్దామనుకుని రిసెర్చ్‌ చేశాం. తమిళం, కన్నడంలో దొరికినట్టు తెలుగులో పుస్తకాలు లేవు. ఇలాగైతే మన సంస్కృతీ సంప్రదాయాలు పిల్లలకి అర్థమయ్యేదెలా? అందుకే వాటిని మేం అందివ్వాలనుకుని 2020లో ‘నమస్తే గ్యాంగ్‌’ ప్రారంభించాం. రూ.4.5లక్షలు పెట్టుబడి పెట్టాం. కొన్ని ఇతర పబ్లిషింగ్‌ హౌజ్‌లవి రీప్రింట్‌ చేయిస్తే, మరికొన్ని మేమే సొంతంగా ప్రింట్‌ చేస్తున్నాం. ఏడాది వయసు నుంచి పెద్దపిల్లల వరకు సాయపడేలా తీసుకొస్తున్నాం. చిన్నవాళ్లకి త్వరగా చినగని, తక్కువ లైన్లతో ఉండే బోర్డు బుక్స్‌ తీసుకొచ్చాం. ఘటోత్కచుడు- శశిరేఖ, ఏడు చేపల కథ... ఇలా సొంతంగా రాసినవి కొన్ని, ట్రాన్స్‌లేట్‌ చేయిస్తున్నవి మరికొన్ని. వర్ణమాలనీ ఇప్పటితరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దాం. వాటికి బొమ్మలు దగ్గరుండి వేయించుకున్నాం. ఇది తెలుగు పండితుల దగ్గర పాస్‌ అవ్వదేమో కానీ... చిన్నారులకు కచ్చితంగా నచ్చుతుంది. ప్రతి పుస్తకాన్నీ కొందరు పిల్లలతో చదివిస్తా. వాళ్లకు నచ్చుతుందా అన్నది గమనించుకున్నాకే మార్కెట్‌లోకి తీసుకొస్తాం. 

ఒకప్పుడు అమ్మమ్మ, నానమ్మలు తమదైన శైలిలో కథలు చెబుతూ ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేవారు. ఇప్పుడంత ఓపిక ఎవరికీ ఉండట్లేదు. అలాంటివారికి సాయపడేలా తేలికపదాల్లో... చదివేవాళ్లు కూడా అర్థం చెప్పడానికి తడుముకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. శిల్ప షిప్పింగ్, ఆర్డర్లు చూసుకుంటే... నేను ఇన్‌స్టా హ్యాండిల్, మార్కెటింగ్‌ చూసుకుంటా. మా తొమ్మిదేళ్ల కష్టాన్ని ఇందులో పెట్టాం. షాపు వరకూ వెళ్లి చదివి, పిల్లాడికి అర్థమవుతుందా అని సమయం వెచ్చించాల్సిన అవసరం లేకుండా ఏ వయసువారికి ఏవి తగినవో వెబ్‌సైట్‌లో మేమే సూచిస్తాం. 3 వేలమంది తెలుగు కస్టమర్లకు చేరువయ్యాం. తమిళ, కన్నడ పుస్తకాలనీ అందిస్తున్నాం. బోర్‌ అంటూ పిల్లలు స్క్రీన్‌లకు అతుక్కుపోవద్దు. తెలుగు భాషకీ, సంస్కృతికీ దూరమవొద్దు. మా తాపత్రయమిదే! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్