UPSC Results : సంకల్ప బలంతో సాధించారు!

సమస్యలెన్ని ఎదురైనా సంకల్పబలం ఉంటే అనుకున్నది సాధించచ్చు.. ఇదే విషయం నిరూపించారు కొందరమ్మాయిలు. ప్రత్యేక అవసరాలతో జీవితం మోడువారుతుందనుకున్న తరుణంలో సివిల్స్‌ ఆలోచన చేశారు. అలాగని ఇది అందని ద్రాక్షేమో అనుకోలేదు.

Published : 18 Apr 2024 13:22 IST

సమస్యలెన్ని ఎదురైనా సంకల్పబలం ఉంటే అనుకున్నది సాధించచ్చు.. ఇదే విషయం నిరూపించారు కొందరమ్మాయిలు. ప్రత్యేక అవసరాలతో జీవితం మోడువారుతుందనుకున్న తరుణంలో సివిల్స్‌ ఆలోచన చేశారు. అలాగని ఇది అందని ద్రాక్షేమో అనుకోలేదు. ప్రయత్నిస్తే సాధించలేనిదేదీ లేదన్న ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లారు. ఇందుకు ప్రతిఫలంగానే తాజా సివిల్స్‌ ఫలితాల్లో మేటి ర్యాంకులు సాధించారు. వివిధ రకాల శారీరక లోపాలున్నా వాటిని అధిగమించి సివిల్స్‌ సాధించిన  కొందరమ్మాయిల స్ఫూర్తి గాథలివి!

ఒంటి చేత్తో సాధించింది!

మన జీవితంలో కొన్ని అరుదైన సంఘటనలు జరుగుతుంటాయి. ఇవి జీవిత గమ్యాన్నే మార్చేస్తుంటాయి. అయితే ఇలాంటి సవాళ్లను స్వీకరించి.. తారుమారైన పరిస్థితులకు అలవాటు పడ్డప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. ఇదే విషయాన్ని తన విజయంతో నిరూపించింది కేరళలోని అలప్పుజకు చెందిన పార్వతీ గోపకుమార్‌. 12 ఏళ్ల వయసులో ఓ రోడ్డు ప్రమాదంలో తన కుడిచేతిని పోగొట్టుకున్న ఆమె.. ఎడమ చేతినే ఆయుధంగా మలచుకుంది. మూడు నెలల్లోనే ఎడమ చేత్తో రాయడం నేర్చుకొని వార్షిక పరీక్షలూ రాసిందామె. జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా వాటిని ఎదుర్కొనేలా మనల్ని మనం దృఢంగా మలచుకున్నప్పుడే ఏదైనా సాధించగలమంటోన్న పార్వతి.. తాజా సివిల్స్‌ ఫలితాల్లో 282వ ర్యాంకు సొంతం చేసుకుంది.

‘నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదం నా జీవితాన్నే మార్చేసింది. ఈ ప్రమాదంలో కుడి చేతిని కోల్పోవడంతో జీవితాన్నే కోల్పోయిన ఫీలింగ్‌ కలిగింది. కానీ త్వరలోనే ఈ బాధ నుంచి తేరుకున్నా. ఎడమ చేత్తో రాయడం, ఇతర పనులు చేయడం నేర్చుకున్నా. బెంగళూరులోని ‘నేషనల్‌ లా స్కూల్‌’లో న్యాయ విద్య పూర్తిచేశాక.. సివిల్స్‌పై దృష్టి పెట్టా. 2022లో ప్రిలిమ్స్‌ కూడా పాస్‌ కాలేదు. కానీ రెండో ప్రయత్నంలో దశలన్నీ దాటి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. కలెక్టర్‌ కావాలన్నది నా లక్ష్యం. ఇందుకోసం మరో ప్రయత్నం చేస్తా..’ అంటోన్న పార్వతి తల్లిదండ్రులు తన కూతురి విజయాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు.


నాలుగ్గంటల్లోనే జీవితం తలకిందులైంది!

ఒక ప్రయత్నంతోనే అలసిపోయే వారు కొందరుంటారు.. అనుకున్నది సాధించేదాకా అలుపులేకుండా ప్రయత్నిస్తుంటారు మరికొందరు. విశాఖపట్నానికి చెందిన వేములపాటి హనిత రెండో కోవకు చెందుతుంది. మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ దగ్గరే ఆగిపోయిన ఆమె.. నాలుగో ప్రయత్నంలో మెయిన్స్‌, ఇంటర్వ్యూ దశలు కూడా దాటి సివిల్స్‌లో 887వ ర్యాంకు సాధించింది. అరుదైన వ్యాధి కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమైనా తన కలను సాకారం చేసుకుంది.

‘సివిల్స్‌ లక్ష్య సాధనలో నాకు ముందు నుంచీ సరైన గైడెన్స్‌ లేదు. కానీ ప్రతి ప్రయత్నంలో నన్ను నేను మెరుగుపరచుకున్నా. చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాను. ఆ పట్టుదలే ర్యాంకు తెచ్చిపెట్టింది. మన జీవితానికంటూ ఓ సార్థకత ఉండాలని పదే పదే మా గురువు గారు చెబుతుండేవారు. సివిల్స్‌ అందుకు చక్కని మార్గమంటూ దిశానిర్దేశం చేశారు. ఆయన మాటలే నన్ను సివిల్స్‌ వైపు అడుగులు వేయించాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటొచ్చినప్పుడు ‘Transverse Myelitis’ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డా. దీంతో ఒక్కసారిగా నడుస్తూనే సడెన్‌గా కింద పడిపోయా. నాలుగ్గంటల్లోనే పక్షవాతం రావడంతో నడుం కింది భాగం చచ్చుబడిపోయింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. వెన్నెముకలో ఇన్ఫెక్షన్‌ వల్ల ఈ సమస్య వచ్చినట్లు, ఇక జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమవ్వాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు. ఆ క్షణం మానసికంగా ఎంతో క్షోభను అనుభవించా. ఆ తర్వాత కోలుకొని డిగ్రీ పూర్తిచేశా.. నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌ కలనూ సాకారం చేసుకున్నా. నా ఈ జర్నీలో అమ్మానాన్నల ప్రోత్సాహం ఎంతో ఉంది. సాధారణ వ్యక్తుల్లాగే ప్రత్యేక అవసరాలున్న వారినీ ఈ సమాజం సమాన దృష్టితో చూడాలనేది నా కోరిక. ఓ సివిల్‌ సర్వెంట్‌గా నేనూ ఇదే చేయాలనుకుంటున్నా. చీకటి వెనుక వెలుతురు ఉంటుందని నేను నమ్మిన సిద్ధాంతమే నన్ను ఈ రోజు మీ అందరి ముందు నిలబెట్టింది..’ అంటూ తన జర్నీని పంచుకుంది హనిత.


ఎడమ చెయ్యే ఆయుధం!

‘జీవితంలో కచ్చితంగా ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. దాన్ని చేరుకునేందుకు ఈ ప్రపంచం నీకు ఏదో ఒకలా సహాయ పడుతుంది..’ అన్న ఆల్కెమిస్ట్‌ పౌల్‌ కోయెల్హో మాటల్నే స్ఫూర్తిగా తీసుకుంది కేరళకు చెందిన సారిక. సెరెబ్రల్‌ పాల్సీ కారణంగా చిన్న వయసు నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె.. ఈ శారీరక లోపాన్ని అధిమించి తానేంటో నిరూపించుకోవాలనుకుంది. ఈ సంకల్పంతోనే సివిల్స్‌ సాధన చేసిన సారిక.. తాజా ఫలితాల్లో 922 ర్యాంకు సాధించింది. తద్వారా శారీరక లోపాలు విజయానికి ఏ మాత్రం అడ్డు కావని నిరూపించింది.

‘సెరెబ్రల్‌ పాల్సీ కారణంగా నా కుడి చేయి పనిచేయదు. వీల్‌ ఛెయిర్‌ను కదిలించడం, రాయడం, తినడం, ఇతర పనులన్నీ ఎడమ చేత్తోనే చేస్తుంటా. అమెరికాకు చెందిన జెస్సికా కాక్స్‌ నా జీవితానికి అతిపెద్ద స్ఫూర్తి ప్రదాత. రెండు చేతులు లేకపోయినా కాళ్లతో విమానం నడిపి.. పైలట్‌ లైసెన్స్‌ సాధించిందామె. డిగ్రీ పూర్తయ్యాక సివిల్స్‌ సాధన మొదలుపెట్టా. ఇక నా సివిల్స్‌ జర్నీలో అమ్మానాన్నలూ ఎంతగానో సపోర్ట్‌ చేశారు. రెండో ప్రయత్నంలో నాకు ర్యాంకొచ్చింది. నాన్న ఖతార్‌లో పనిచేస్తున్నప్పటికీ.. నా సివిల్స్‌ పరీక్షల కోసం ఇండియాకొచ్చారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో అమ్మానాన్నలు నాతోనే ఉన్నారు. ఎన్ని సవాళ్లెదురైనా నాలో ధైర్యం నింపారు. ఏదేమైనా నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది..’ అంటోందీ సివిల్స్‌ ర్యాంకర్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్