మీ బంధానికి సంబంధించి అలాంటి కలలొస్తున్నాయా?

చాలామందికి రాత్రి పూట నిద్రలో కలలు రావడం సహజం. ఈ క్రమంలో కొంతమందికి తమ భాగస్వామితో గొడవ జరిగినట్లు, వారితో విడిపోయినట్లు.. ఇలాంటి కలలు కూడా వస్తుంటాయి. అయితే ‘కలే కదా.. ఇందులో భయపడాల్సిందేముంది’ అని కొట్టిపారేస్తుంటారు కొందరు. కానీ మన ఆలోచనలకు, కలలకు చాలా దగ్గరి సంబంధం ఉందంటున్నారు నిపుణులు.

Published : 08 Apr 2024 21:37 IST

చాలామందికి రాత్రి పూట నిద్రలో కలలు రావడం సహజం. ఈ క్రమంలో కొంతమందికి తమ భాగస్వామితో గొడవ జరిగినట్లు, వారితో విడిపోయినట్లు.. ఇలాంటి కలలు కూడా వస్తుంటాయి. అయితే ‘కలే కదా.. ఇందులో భయపడాల్సిందేముంది’ అని కొట్టిపారేస్తుంటారు కొందరు. కానీ మన ఆలోచనలకు, కలలకు చాలా దగ్గరి సంబంధం ఉందంటున్నారు నిపుణులు. ఒక్కోసారి అనుబంధంలో ఇద్దరి మధ్య సఖ్యత లేక.. మన మనసులో మెదిలే ప్రతికూల ఆలోచనలే ఇలా కలలుగా ప్రతిబింబించే అవకాశమూ లేకపోలేదంటున్నారు. కాబట్టి ‘కలే కదా’ అన్న నిర్లక్ష్యం వీడి.. తమ అనుబంధంలో అభిప్రాయభేదాలేమైనా ఉన్నాయేమో తరచి చూడమంటున్నారు.

ఆ లోపాన్ని సరిదిద్దుకోగలిగితే..!

ఈ సృష్టిలో ఏ ఒక్కరూ వంద శాతం పర్‌ఫెక్ట్‌ కానట్లే.. దాంపత్య బంధంలోనూ కొన్ని లోపాలుంటాయి. అది భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ కావచ్చు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విఫలం కావచ్చు.. ఎవరో ఒకరిలో మానసిక పరిపక్వత లోపించచ్చు.. లైంగిక జీవితంలో అసంతృప్తి కావచ్చు.. ఇలా ఒక్కో జంటలో ఒక్కో సమస్య ఉంటుంది. అనుబంధంలో ఏవైతే లోపాలు, సమస్యలుగా భావిస్తామో.. వాటి గురించిన ఆలోచనలే పదే పదే మన మనసులోకొస్తాయి. వీటి గురించి ఆలోచిస్తూ పడుకుంటే.. అనుబంధంలో కలతలొచ్చినట్లు, ఇద్దరూ విడిపోయినట్లు.. ఇలా కలలూ నెగెటివ్‌గానే వస్తాయి. కాబట్టి ఇలాంటి కలలొచ్చాయంటే మీ అనుబంధంలో ఏవో లోపాలున్నట్లుగా భావించి.. వాటిని గుర్తించమంటున్నారు నిపుణులు. ఆపై ఇద్దరూ కలిసి కూర్చొని వాటిని పరిష్కరించుకోగలిగితే.. అటు అనుబంధమూ దృఢమవుతుంది.. ప్రతికూల ఆలోచనలు-తద్వారా వచ్చే కలలకూ చెక్‌ పెట్టచ్చు.

దాపరికాలొద్దు!

దాంపత్య బంధం దృఢంగా ఉండాలంటే.. ప్రతి విషయంలోనూ ఇద్దరూ పారదర్శకంగా వ్యవహరించాలి. కానీ కొంతమంది తమ పాత ప్రేమలు-బ్రేకప్‌లు, తమకున్న ఇతర సమస్యల గురించి.. భాగస్వామి వద్ద దాచిపెడుతుంటారు. ఒకవేళ చెబితే వాళ్లు ఎలా తీసుకుంటారోనన్న భయమే ఇందుకు కారణం! అయితే ఇది క్రమంగా అపరాధ భావనను, అభద్రతా భావాన్ని పెంచుతుంది. ఈ ఆలోచనలతో గడపడం వల్ల.. దాచిన విషయాలన్నీ మూడో వ్యక్తి ద్వారా భాగస్వామికి తెలిసినట్లు.. ఇద్దరి మధ్య గొడవలొచ్చి అది విడాకులకు దారితీసినట్లు.. ఇలా రకరకాల కలలొస్తుంటాయి. కాబట్టి కల నిజమయ్యే దాకా తెచ్చుకోకుండా.. అలాగని కలే కదా అని కొట్టిపారేయకుండా.. ప్రతి విషయాన్నీ భాగస్వామితో పంచుకోవడం మంచిది. ఈ క్రమంలో మీ పొరపాటేదైనా ఉంటే క్షమాపణ కోరడంలోనూ తప్పు లేదంటున్నారు నిపుణులు.

ఆ ‘యాంగ్జైటీ’ వద్దు!

కొంతమంది మనసులో ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలే తిరుగుతుంటాయి. భవిష్యత్తులో తమ భాగస్వామి తమతో విడిపోతారేమోనని, ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోతుందేమోనని, వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారేమోనని.. ఇలా లేనిపోనివి ఊహించుకొని భయపడుతుంటారు. దీన్నే ‘రిలేషన్‌షిప్‌ యాంగ్జైటీ’గా పేర్కొంటున్నారు నిపుణులు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలతో తాము మానసిక ఒత్తిడికి గురికావడమే కాదు.. తమ మాటలు, చేతలతో భాగస్వామినీ ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనల వల్ల కలలూ నెగెటివ్‌గానే వచ్చే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి ముందు మీలోని అభద్రతా భావాన్ని, ప్రతికూల ఆలోచనల్ని తొలగించమంటున్నారు నిపుణులు. నిజంగానే మీ భాగస్వామి విషయంలో ఏవైనా సందేహాలున్నా, భయాలు నెలకొన్నా.. నేరుగా వారినే అడిగితే సరిపోతుంది. తద్వారా మీ అనుబంధం గురించి మీకూ ఓ స్పష్టత వస్తుంది. అలాగే ఇద్దరూ ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవడం కూడా ముఖ్యమే!

‘థెరపీ’ అవసరమేమో!

అనుబంధంలో ఎలాంటి కలతల్లేకపోయినా, భార్యాభర్తలిద్దరూ సఖ్యతతోనే ఉన్నా.. కొంతమందిలో ఇలాంటి ప్రతికూల కలలొస్తుంటాయి. అయితే అందుకు వారి మానసిక సమస్యలు కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు. ‘కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు’.. అయితే కొంతమంది ప్రతి విషయంలోనూ ఈ సూత్రాన్ని వర్తింపజేస్తుంటారు. ప్రతి విషయంలోనూ తొలుత నెగెటివ్‌ ఆలోచనలే చేస్తుంటారు. ఇలా ఆలోచించే వారు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆపై ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. వంటివి దరిచేరతాయి. ఇవి కూడా అనుబంధంలో కలతల్లేకపోయినా సృష్టిస్తాయి. కాబట్టి ఇలాంటి మనసుకు చికిత్స అవసరం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ పరిస్థితిని బట్టి మానసిక వైద్యుల వద్ద థెరపీ తీసుకోవడం మేలంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్