ఈ యాప్‌తో కంటి సమస్యలను పసిగట్టేయచ్చట!

టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ కాలపు పిల్లలు. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వినూత్న ప్రయోగాలు చేస్తున్న వారు కొందరైతే.. ఇదే సాంకేతికతతో పలు ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతున్నారు మరికొందరు. దుబాయ్‌లో స్థిరపడ్డ 11 ఏళ్ల మలయాళీ అమ్మాయి లీనా...

Updated : 28 Mar 2023 21:20 IST

(Photo: LinkedIn)

టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ కాలపు పిల్లలు. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వినూత్న ప్రయోగాలు చేస్తున్న వారు కొందరైతే.. ఇదే సాంకేతికతతో పలు ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతున్నారు మరికొందరు. దుబాయ్‌లో స్థిరపడ్డ 11 ఏళ్ల మలయాళీ అమ్మాయి లీనా రఫీక్‌ ఇదే కోవకు చెందుతుంది. బాలమేధావిగా పేరు గాంచిన ఈ ట్యాలెంటెడ్‌ గర్ల్‌.. ఆరేళ్ల వయసులోనే కోడింగ్‌పై పట్టు సాధించింది. ఇలా తనకున్న ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలకు కృత్రిమ మేధను జోడించి.. గతేడాది ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించిందామె. టెస్టింగ్‌, మార్పులు-చేర్పుల అనంతరం తుది యాప్‌ను ఇటీవలే ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌కు సమర్పించిన ఆమె.. ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలను, యాప్‌ పనితీరును ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో తాజాగా లింక్డిన్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. చాలామంది ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

దుబాయ్‌లో పుట్టి పెరిగింది లీనా రఫీక్‌. ఆమె కుటుంబ సభ్యులు కేరళకు చెందిన వారు. చిన్న వయసులోనే ఆమె ప్రతిభా పాటవాలు, ఏకాగ్రత, గ్రాహక శక్తి, విషయ పరిజ్ఞానం.. వంటివన్నీ గ్రహించిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆసక్తి ఉన్న కోడింగ్‌లో ప్రోత్సహించారు. ఈ ప్రేరణతోనే ఆరేళ్ల వయసులోనే ‘స్క్రాచ్‌’ అనే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ని ఉపయోగించి ఓ వెబ్‌సైట్‌ను రూపొందించి.. తన పాఠశాల ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించింది లీనా.

స్కాన్‌ చేస్తే సమస్యేంటో తెలుస్తుంది!

ఇలా చిన్న వయసులోనే తన కోడింగ్‌ నైపుణ్యాలతో బాలమేధావిగా పేరు తెచ్చుకున్న లీనా.. ఏటికేడు తన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే కృత్రిమ మేధను ఉపయోగించి ‘ఓల్గర్‌ ఐస్కాన్‌’ పేరుతో గతేడాది ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించిందీ ట్యాలెంటెడ్‌ గర్ల్‌. ఒక్క స్కాన్‌తో పలు కంటి సమస్యల్ని పసిగట్టే సామర్థ్యం ఉన్న ఈ యాప్‌ను గతేడాదే రూపొందించినా.. టెస్టింగ్‌, ఇతర మార్పులు-చేర్పులు చేసి ఇటీవలే ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌కు సమర్పించిందామె. అయితే ఈ విషయాన్ని తాజాగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో లింక్డిన్‌లో పంచుకుంది లీనా.

‘కృత్రిమ మేధతో నేను రూపొందించిన ‘ఓల్గర్‌ ఐస్కాన్‌’ అనే మొబైల్‌ యాప్‌ను ఇటీవలే యాప్‌ స్టోర్‌కు సమర్పించా. ఈ విషయం పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. గతేడాదే ఈ యాప్‌కు రూపకల్పన చేశా. ఇందులో భాగంగా ప్రత్యేకమైన కంటి స్కానింగ్‌ పద్ధతి ద్వారా పలు కంటి సమస్యల్ని గుర్తించడంలో సమర్థంగా పనిచేస్తుందీ యాప్‌. అధునాతన కంప్యూటర్‌ విజన్‌, మెషీన్‌ లెర్నింగ్ అల్గరిథమ్స్‌ ఉపయోగించి రూపొందించిన ఈ యాప్.. కాంతి-రంగు తీవ్రతను కళ్లు ఎంతవరకు గుర్తిస్తున్నాయి? దూర దృష్టి ఎలా ఉంది?.. వంటి వాటిని విశ్లేషించడంతో పాటు కంటిలో లైట్‌ సెన్సిటివ్‌ లైనింగ్‌లో ఏమైనా సమస్యలున్నాయా అన్నది కూడా గుర్తిస్తుంది.

అక్కే కాదు.. చెల్లీ బాలమేధావే!

స్కాన్‌ నాణ్యతను బట్టి అందులోని ట్రైన్‌డ్‌ మోడల్స్.. వివిధ కంటి సమస్యల్ని దాదాపు 70 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తాయి. ఆరు నెలలు పరిశోధనలు చేసి మరీ ఈ యాప్‌ను అభివృద్ధి చేశా. ఈ క్రమంలో విభిన్న కంటి సమస్యలు, టెక్నాలజీకి సంబంధించిన నైపుణ్యాలపై మరింత పట్టు పెరిగింది..’ అంటూ తన యాప్‌, దాని పనితీరు గురించి చెప్పుకొచ్చింది లీనా. ప్రస్తుతం ఐఓఎస్‌ 16+ వెర్షన్, ఆపైన ఉన్న ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ఐఫోన్‌ 10కు తన యాప్‌ సపోర్ట్‌ చేస్తుందని చెబుతోందామె. ఇటీవలే దీన్ని యాప్‌ స్టోర్‌కు సమర్పించగా.. ప్రస్తుతం ఇది యాప్‌ స్టోర్‌ రివ్యూలో ఉంది. త్వరలోనే ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుందని చెబుతోందీ యంగ్‌ టెకీ. ఇలా లీనా పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఆమెలో ఉన్న సాంకేతిక నైపుణ్యాల్ని, ప్రతిభా పాటవాల్ని ‘శెభాష్‌’ అంటూ ఎంతోమంది నెటిజన్లు కొనియాడుతున్నారు.. ‘కీప్‌ ఇట్‌ అప్‌’ అంటూ వెన్నుతడుతున్నారు. అయితే లీనానే కాదు.. ఆమె చెల్లెలు హనా రఫీక్‌ కూడా బాలమేధావే. గతేడాది ‘హనాస్‌’ అనే కథలు చెప్పే యాప్‌ను రూపొందించి.. ‘అతిపిన్న ఐఓఎస్‌ డెవలపర్‌’గా గుర్తింపు తెచ్చుకుంది.. అంతేకాదు.. యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ ప్రశంసలూ అందుకుందీ రఫీక్‌ సిస్టర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్