మీ మధ్య వాళ్లెందుకు?

ప్రేమలు-ఆప్యాయతలు, కోపతాపాలు, కష్టసుఖాలు, గెలుపోటములు.. ప్రతి అనుబంధంలో ఇవన్నీ సహజం. అయితే ఒక్కోసారి ఇద్దరి మధ్య వచ్చే సమస్యలు ఒకరికొకరు దూరమయ్యేలా చేస్తాయి. అలాగని నిర్లక్ష్యం చేయకుండా ఈ దూరాన్ని దగ్గర చేసుకున్నప్పుడే బంధం నిలబడుతుంది.

Published : 21 Mar 2024 12:21 IST

ప్రేమలు-ఆప్యాయతలు, కోపతాపాలు, కష్టసుఖాలు, గెలుపోటములు.. ప్రతి అనుబంధంలో ఇవన్నీ సహజం. అయితే ఒక్కోసారి ఇద్దరి మధ్య వచ్చే సమస్యలు ఒకరికొకరు దూరమయ్యేలా చేస్తాయి. అలాగని నిర్లక్ష్యం చేయకుండా ఈ దూరాన్ని దగ్గర చేసుకున్నప్పుడే బంధం నిలబడుతుంది. ఈ క్రమంలో ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో జంటలు గుర్తు పెట్టుకోవడం ముఖ్యమంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఇలా తిరిగి ఒక్కటయ్యే క్రమంలో భార్యాభర్తలు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

అతి అనర్థమే!

దాంపత్య బంధంలో ప్రతిదీ బ్యాలన్స్‌డ్‌గా ఉన్నప్పుడే ఆ దంపతుల మధ్య ఆరోగ్యకరమైన అనుబంధం ఏర్పడుతుంది. అయితే కొంతమంది తమ భాగస్వామిని అతిగా కంట్రోల్‌ చేయాలని చూస్తుంటారు. మరికొందరు అతి స్వేచ్ఛనిస్తుంటారు. అనుబంధంలో ఈ రెండూ ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు. అతిగా హద్దుల్లో పెట్టుకోవడం వల్ల ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోయే అవకాశం ఎక్కువ. అదే అతిగా స్వేచ్ఛనివ్వడం వల్ల ఒకానొక దశలో భాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి ఈ రెండింటినీ సమతుల్యం చేయడం ముఖ్యం. ఈ క్రమంలో ప్రతి విషయంలో ఇద్దరి మధ్య పారదర్శకత ఉండడం, భాగస్వామికీ తమకంటూ వ్యక్తిగత సమయం కేటాయించుకునే అవకాశం ఇవ్వడం మంచిది. అలాగే మీకు నచ్చకపోయినా ఒక్కోసారి భాగస్వామి ఇష్టాన్ని వ్యతిరేకించకుండా.. సర్దుకుపోవాల్సి రావచ్చు. అందుకూ సిద్ధపడ్డప్పుడే భార్యాభర్తల మధ్య ఏర్పడిన దూరం దగ్గరవుతుంది.. అనుబంధం శాశ్వతమవుతుంది.

‘డీటాక్స్‌’ తప్పదు!

కొన్ని చెడు అలవాట్లు, వ్యసనాలు కూడా భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సోషల్‌మీడియా, అంతర్జాలం.. వంటి సాంకేతిక అంశాలు ఈ కాలపు జంటలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయంటున్నారు. వీటి ధ్యాసలో పడిపోయి ఒకరినొకరు నిర్లక్ష్యం చేయడం, ప్రతి విషయంలో ఇతర జంటలతో పోల్చుకోవడం, నిరంతర సోషల్‌ మీడియా ఉపయోగం వల్ల కలిగే మానసిక ఒత్తిళ్లను భాగస్వామిపై ప్రదర్శించడం.. వంటివి అందులో కొన్ని. అయితే ఇలాంటప్పుడే అనుబంధంలో డీటాక్స్‌ అవసరమంటున్నారు నిపుణులు. తిరిగి ఇద్దరూ దగ్గరవడానికి ఈ అలవాటును త్యజించడం, కలిసి సమయం గడపడానికి ఆసక్తి చూపడం, భాగస్వామికి నచ్చే పనులు చేయడం.. ఇవన్నీ ఆలుమగల్ని దగ్గర చేసే మార్గాలే! అలాగే ఇలాంటి అలవాట్లకు దూరమవడం వల్ల మానసిక ప్రశాంతతను కూడా సొంతం చేసుకోవచ్చు.

వినడం నేర్చుకోండి!

పెళ్లంటేనే కమిట్‌మెంట్‌.. ప్రతి విషయంలోనూ ఒకరికొకరు తోడుగా ఉంటామన్న భరోసా ఇవ్వడం. అయితే పెళ్లిలో అందరూ ఈ ప్రమాణాలు చేసినప్పటికీ.. ఆపై రోజులు గడిచే కొద్దీ కొంతమంది వీటిని విస్మరిస్తుంటారు. ‘వాళ్ల మాట వినే అవసరం నాకేముంది? మంచేదో, చెడేదో నాకు తెలియదా?’ అన్న అహంకారంతో వ్యవహరిస్తుంటారు. ఇది కూడా ఆలుమగల అనుబంధంలో చిచ్చుపెడుతుంది. కాబట్టి కలకాలం కలిసుండాలనుకునే జంటలు ఇలాంటి ప్రవర్తనను పక్కన పెట్టి.. సర్దుకుపోయే తత్వం అలవాటు చేసుకోవాలి. అలాగే అహంకారాన్ని పక్కన పెట్టి భాగస్వామి ఏం చెబుతున్నారో ముందు వినడం నేర్చుకోవాలి. ఆపై వారి మాటలు, చేతల్ని మీరు సమ్మతించకపోతే మీ మనసులోని అభిప్రాయాన్ని వెల్లడించచ్చు. ఒకవేళ మీ అభిప్రాయాల్లో/నిర్ణయాల్లో పొరపాట్లుంటే.. అంగీకరించి సరిదిద్దుకోవడమూ తప్పు కాదు. ఇలా ప్రతి విషయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు వారి దాంపత్య బంధానికి దృఢమైన బాటలు వేస్తాయి.. వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగానూ ఇద్దరూ ఎదిగేందుకు దోహదం చేస్తాయి.

వాళ్ల ప్రమేయం ఎందుకు?!

భార్యాభర్తల మధ్య సవాలక్ష విషయాలుంటాయి. అందులో ఇద్దరి మధ్య గొడవలకు కారణమైన అంశాలుండచ్చు.. ఇద్దరికి మాత్రమే పరిమితమైన తీపి గుర్తులుండచ్చు.. అలాగని అన్నీ అందరితో పంచుకోలేం.. కానీ కొంతమంది మాత్రం తనకు, తన భాగస్వామికి మధ్య జరిగిన ప్రతి విషయాన్నీ.. తమ తల్లిదండ్రులు/అత్తింటి వారితో చెబుతుంటారు. ఏ చిన్న భేదాభిప్రాయమొచ్చినా వారిని ఇన్వాల్వ్‌ చేస్తుంటారు. నిజానికి భార్యాభర్తల మధ్య వచ్చే ఇలాంటి పొరపచ్ఛాలు వారిద్దరే పరిష్కరించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు నిపుణులు. అలాకాకుండా మూడో వ్యక్తి ఇందులో కల్పించుకుంటే ఆ గొడవ మరింత పెద్దదవుతుంది. వారిచ్చే సలహాలు మీకు నచ్చచ్చు.. నచ్చకపోవచ్చు. కాబట్టి తప్పో ఒప్పో.. ఓ మెట్టు దిగైనా తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోవాలని ఈ కాలపు జంటలకు సూచిస్తున్నారు నిపుణులు. దీనివల్ల దూరం దగ్గరవడమే కాదు.. ఇద్దరి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్