అబ్బాయిల్ని ఇలాగే పెంచుతున్నారా..?

అఘాయిత్యం అంటే ఒక్క భౌతిక దాడి మాత్రమే కాదు. తమ పరుష పదజాలంతో, వేధింపులతో మహిళల మనోభావాలు దెబ్బతీయడం, ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ చేయడం వంటివి కూడా ఇందులో భాగమే.

Updated : 16 Mar 2024 15:29 IST

అఘాయిత్యం అంటే ఒక్క భౌతిక దాడి మాత్రమే కాదు. తమ పరుష పదజాలంతో, వేధింపులతో మహిళల మనోభావాలు దెబ్బతీయడం, ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ చేయడం వంటివి కూడా ఇందులో భాగమే. అటు విద్యలోనూ, ఇటు ఆర్థికంగానూ అగ్రగామి అనిపించుకున్న అమెరికాలో సైతం ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారంటే నేటి సమాజంలో ఆడవారి పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మన దేశంలో పరిస్థితి గురించి చెప్పే పనే లేదు.. మరి ఇటువంటి దారుణ పరిస్థితులకు కారణం ఎక్కడుంది ? అసలు ఈ విష సంస్కృతిని అంతమొందించడం ఎలా? అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ తెలుసుకోవడం సందర్భోచితం..

అబ్బాయిలకు చెబుతున్నామా?

శరీరం దృఢంగా ఉండాలంటే కసరత్తులు ఎలా అవసరమో, మనసు సానుకూలంగా ఉండడానికి కూడా శిక్షణ అంతే అవసరం. అది తల్లిదండ్రులతో పాటు గురువుల చేతిలోనే ఉంది. ఇంట్లో, స్కూల్లో సరైన మార్గదర్శకత్వం లేనందువల్లే చాలామంది యువకులు పెద్ద చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ అమ్మాయిలపై వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు- అమ్మాయిలకు దుస్తులు సరిగా వేసుకోమని... రాత్రి వేళ త్వరగా ఇంటికి రమ్మని, అబ్బాయిలతో ఎక్కువగా చనువుగా ఉండకూడదని తెలిపే తల్లిదండ్రులు తమ అబ్బాయిలకి మాత్రం అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో చెప్పడం లేదట.

తమ పెంపకంలో అమ్మాయి అంటే సున్నితమైన, బలహీనమైన వ్యక్తిలా... అబ్బాయి అంటే బలవంతుడిలా చిత్రీకరించడం చాలామంది అబ్బాయిలకి ప్రతికూల సంకేతంలా వెళుతోంది. అంతేకాదు చాలామంది అమ్మాయిలను అభద్రతా భావానికి గురి చేస్తోంది. ఇప్పటికీ కొన్నిచోట్ల అమ్మాయి అంటే ఇలానే ఉండాలనే గిరి గీసిన సిద్ధాంతం వల్ల, అలా ఉండని; అన్యాయాన్ని ఎదిరించే, ప్రతిఘటించే అమ్మాయిలను అబ్బాయిలు వేధింపులకు గురిచేస్తున్నారట. అలా కాకుండా ప్రతి ఇంట్లో అబ్బాయి, అమ్మాయి ఒకటే అనే సమానత్వాన్ని చిన్నప్పటి నుంచే నేర్పగలిగితే ఈ సమాజంలో అమ్మాయిల పట్ల వేధింపులు, అఘాయిత్యాలను కొంతవరకు నివారించవచ్చని మానసిక నిపుణులు అంటున్నారు.

పురుషాధిక్యం.. ఇంటి నుంచే తగ్గాలి!

పిల్లలు ఏది నేర్చుకున్నా ముందు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారనేది అందరూ అంగీకరించేదే. అయితే అది తెలుసుకుని మసలుకునేది చాలా తక్కువమంది. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో పురుషులదే ఆధిక్యం. అసలు ఆధిక్యం, అధిపత్యం అన్న భావన వచ్చిందంటేనే సమానత్వం నశించినట్లు. తమ మాటే నెగ్గాలని పిల్లల ముందే తల్లిదండ్రులు తరచూ గొడవలు పెట్టుకోవడం మూలంగా పిల్లల్లో కూడా అటువంటి భావనే కలుగుతుందని గ్రహించాలి. ఇటువంటి సమయంలోనే సమస్యను పరిష్కరించుకోవడంలో.. ఆగ్రహాన్ని నిగ్రహించుకోవడంలో పిల్లలకు తాము ఒక ఉదాహరణగా నిలవాలని తల్లిదండ్రులు భావించాలి. తల్లీ, తండ్రి సమానమే అని వారు తమ ప్రవర్తన ద్వారా నిరూపించినప్పుడే అన్నా, చెల్లి దగ్గర నుంచి అన్ని బంధాల్లో ఆడమగ ఒకటే అనే సమానత్వ భావన పిల్లల్లో కలుగుతుంది.

పిల్లల ముందు అలా మాట్లాడద్దు!

ప్రస్తుతం టీవీలు, సామాజిక మాధ్యమాల వల్ల సమాజంలో చోటుచేసుకునే ప్రతి సంఘటన గురించి పిల్లలకు సైతం తెలిసిపోతోంది. ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మహిళల పైన పురుషుడు తన బలాన్ని ప్రదర్శించడం తప్పు అనే సంకేతాన్ని పిల్లలకు చేరేలా చేయాలే తప్ప జరిగిన ఘటనల్లో పురుషుడి పాత్రను తగ్గించి మహిళని మాత్రమే బాధ్యురాలిని చేయకూడదు. అలాగే అబ్బాయిలు చేసే పనిని అమ్మాయిలు చేస్తున్నప్పుడు కూడా ‘అది అబ్బాయిల పని.. నీకెందుకు ?’, ‘అమ్మాయిలెవరైనా ఇలా చేస్తారా ?’ అంటూ వేరు చేసి కించపరిచేలా మాట్లాడకూడదు.

సానుకూల పదజాలంతోనే..!

పది చేతి దెబ్బల కంటే ఒక్క మాట గుండెను పగిలేలా చేయగలదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందే పరుష పదజాలాన్ని ప్రయోగిస్తుండడం నేటి సమాజంలో భాగమైపోయింది. ఆడ, మగ మధ్య వ్యత్యాసం ఉందని అపోహపడడానికి, పురుషుడంటే బలవంతుడు అనే బీజం పిల్లల నరనరాల్లో నాటుకుపోవడానికి తల్లిదండ్రులు ఉపయోగించే పరుష పదజాలమూ కారణమవుతుంది. అందుకే ఇటువంటి విషయాల్లో ముందు తల్లిదండ్రులకు శిక్షణ అవసరం అంటున్నారు మానసిక నిపుణులు. ముందు మనం మాట్లాడే మాటలు సానుకూలంగా ఉంటే.. చేతలు కూడా సానుకూలంగా మారతాయనే సత్యాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.

ప్రతికూల ధోరణులకు దూరంగా..

పిల్లలకు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచడం ఎంత అవసరమో బయట నుంచి వారు ఎటువంటి ప్రతికూల ధోరణులను అలవర్చుకోకుండా చూడడం కూడా అంతే అవసరం. ప్రత్యేకించి సినిమాలు, కొన్ని రకాల టీవీ షోలు, స్నేహితుల ప్రభావం వల్ల పిల్లలు నెగెటివిటీకి ఎక్కువ ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రతి అంశంలోనూ మంచి, చెడుకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించేలా పిల్లలకు శిక్షణ ఇవ్వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్