ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉంటే..!

ఆరోగ్యానికి, ఆనందానికి, అనుబంధానికి.. శృంగార జీవితం కీలకం! అయితే ప్రతి ఐదుగురు మహిళల్లో నలుగురు కలయిక పట్ల నిరాసక్తత చూపుతున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భం ధరించడం, ప్రసవానంతర ఒత్తిళ్లు, మెనోపాజ్‌....

Published : 11 Jun 2023 11:21 IST

ఆరోగ్యానికి, ఆనందానికి, అనుబంధానికి.. శృంగార జీవితం కీలకం! అయితే ప్రతి ఐదుగురు మహిళల్లో నలుగురు కలయిక పట్ల నిరాసక్తత చూపుతున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భం ధరించడం, ప్రసవానంతర ఒత్తిళ్లు, మెనోపాజ్‌.. వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయంటున్నారు నిపుణులు. వీటివల్ల రోజులు, నెలలు కాదు.. ఏకంగా ఏళ్ల పాటు లైంగిక కోరికల జాడ కానరావట్లేదని కొంతమంది మహిళలు తమ వద్దకొస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి శృంగారమే కదా అని మనం తేలిగ్గా తీసుకుంటాం.. కానీ దీన్ని తరచూ ఆస్వాదించడం వల్ల ఎంతటి సత్ఫలితాలుంటాయో.. నెలల తరబడి వాయిదా వేయడం వల్ల అంతే ఎక్కువగా దుష్ప్రభావాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఇంతకీ, అవేంటో తెలుసుకుందాం రండి..

ఆ నొప్పులు తీవ్రమవుతాయి!

చాలామంది మహిళలు నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అయితే తరచూ శృంగారంలో పాల్గొనే మహిళలతో పోల్చితే.. లైంగిక కోరికలు తగ్గిన వారిలో, రోజుల పాటు శృంగారానికి దూరంగా ఉన్న వారిలో ఈ నొప్పి మరింత తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అదెలాగంటే.. గర్భాశయం ఒక కండరంలా పనిచేస్తుంది. లైంగిక కోరికలు కలిగినప్పుడు అది సంకోచించి రక్తాన్ని సులభంగా బయటికి పంపిస్తుంది. తద్వారా నొప్పి తీవ్రత కూడా తగ్గుతుందట! సాధారణ సమయంలో దీనికి విరుద్ధంగా ఉంటుంది.. కాబట్టి బ్లీడింగ్‌ అయ్యే క్రమంలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. అలాగే శృంగారంలో పాల్గొన్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. వీటిని నొప్పి నివారిణులు అని కూడా అంటారు. తద్వారా నెలసరి నొప్పులే కాదు.. ఇతర శారీరక నొప్పుల తీవ్రత కూడా తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల తగ్గుతుందంటున్నారు నిపుణులు.

పొడిబారితే మరింత ప్రమాదం!

మహిళల్లో వెజైనా పొడిబారడం వల్ల లైంగిక కోరికలు తగ్గడం సహజమే! కానీ కొన్ని కేసుల్లో.. శృంగారాన్ని వాయిదా వేయడం, భాగస్వామిలో ఉండే ఇతర లైంగిక సమస్యల ద్వారా కూడా వెజైనా పొడిబారే సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జననేంద్రియాల్లోని కండరాలు బిగుతుగా మారతాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ అక్కడి కణజాలాలు కూడా పలుచబడతాయి. ఇలాంటప్పుడు బలవంతంగా కలయికలో పాల్గొన్నప్పుడు బ్లీడింగ్‌ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటప్పుడు లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు.. వంటివి ఉపయోగించడం మంచిదంటున్నారు. అలాగే తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల జననేంద్రియాలకు రక్తప్రసరణ మెరుగుపడి.. వివిధ రకాల వెజైనల్‌ సమస్యలకు చెక్‌ పెట్టచ్చంటున్నారు నిపుణులు.

‘స్కిన్‌ హంగర్‌’ తెలుసా?

శృంగారం చేసే క్రమంలో శరీరాలు స్పృశించుకోవడం వల్ల ఒక రకమైన భావోద్వేగాలు కలుగుతాయి. దీనివల్ల శరీరంలో సెరటోనిన్‌ అనే హ్యాపీ హార్మోన్‌ స్థాయులు పెరుగుతాయి. తద్వారా ఒత్తిడి, ఆందోళనలు తగ్గడమే కాదు.. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అదే కలయికతో పాటు శరీరాల మధ్య దూరం పెరిగినట్లయితే.. శరీరం ప్రతిస్పందించే విధానం వేరుగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ పరిస్థితినే ‘స్కిన్‌ హంగర్‌’గా పేర్కొంటున్నారు. అంతేకాదు.. మానసిక సమస్యలు, యాంగ్జైటీ, ఇద్దరూ ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోవడం.. ఇలా అనుబంధానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఎక్కువంటున్నారు.

నిద్రలేమి.. అందుకే!

నిద్రలేమికి మన జీవనశైలిలో ఎన్నో అంశాలు కారణమవుతుంటాయి. అందులో శృంగార జీవితానికి దూరంగా ఉండడం కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. కలయికలో పాల్గొనే క్రమంలో ఆక్సిటోసిన్‌.. వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి శరీరంలోని ఒత్తిడిని తగ్గించి.. త్వరగా సుఖనిద్రలోకి జారుకునేందుకు ప్రేరేపిస్తాయి. తద్వారా నిద్రలేమితో పాటు ఇతర నిద్ర సమస్యలకు కూడా చెక్‌ పెట్టచ్చంటున్నారు నిపుణులు.

ఇవే కాదు.. ఎక్కువ కాలం పాటు శృంగార జీవితానికి దూరంగా ఉంటే బీపీ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, గుండె ఆరోగ్యం క్షీణించడం.. వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు.

కాబట్టి లైంగిక కోరికలు తగ్గిపోయినా, అసలు లేకపోయినా.. ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి సరైన చికిత్సలు, కౌన్సెలింగ్‌ తీసుకోవడం మంచిది. అంతేకానీ.. ‘వయసు పెరుగుతోంది కదా.. ఈ వయసులో ఇదేం పని!’ అని సిగ్గుపడకుండా నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం. ఎందుకంటే ‘వయసుకు, శృంగారానికి అసలు సంబంధమే లేదం’టున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్