ఆయన పక్కనే ఉన్నా.. ఒంటరినయ్యా!

మాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురూ విదేశాల్లో స్థిరపడ్డారు. పిల్లలు జీవితంలో పైకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ, ఇప్పుడు ఒంటరిదాన్ననే భావన కలుగుతోంది. ఇదివరకు తీరిక లేకుండా గడిపిన నేను ఇప్పుడు సమయానికి వంట కూడా చేయలేకపోతున్నాను....

Published : 24 Feb 2024 14:04 IST

మాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురూ విదేశాల్లో స్థిరపడ్డారు. పిల్లలు జీవితంలో పైకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ, ఇప్పుడు ఒంటరిదాన్ననే భావన కలుగుతోంది. ఇదివరకు తీరిక లేకుండా గడిపిన నేను ఇప్పుడు సమయానికి వంట కూడా చేయలేకపోతున్నాను. ఎప్పుడూ నిరాశగా, నిరుత్సాహంగా ఉంటోంది. నా భర్త నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా కోప్పడుతున్నాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు కూడా పెరుగుతున్నాయి. నేను ఇంతకుముందులా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. పిల్లలు పెద్దవారై దూరంగా వెళ్లినప్పుడు ఇలాంటి సమస్య చాలామందిలో కనిపిస్తుంటుంది. దీనిని ‘Empty Nest Syndrome’ అంటారు. చాలామంది మహిళలు.. భర్త, పిల్లల బాగోగులు చూసుకునే క్రమంలో తీరిక లేకుండా గడుపుతుంటారు. ఒక్కసారిగా వాళ్లందరూ దూరంగా వెళ్లిపోయినప్పుడు ఏం చేయాలో తోచదు. కొంతమంది ముందుగానే ఈ పరిస్థితిని ఊహించి ప్రణాళికలు వేసుకుంటారు. కానీ, మరికొంతమంది ఏం చేయాలో తోచక పిల్లల గురించి ఆలోచిస్తూ దిగాలుగా ఉంటారు. ఈక్రమంలో తమ పనులు కూడా చేసుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. మీలో రెండో కోవకు చెందిన వారి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి, మీ జీవనశైలిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో పొద్దున్నే యోగా చేయడం, అప్పుడప్పుడూ బంధువుల ఇంటికి వెళ్లడం, మొక్కలు పెంచడం.. వంటివి మీ జీవనశైలిలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఈ వయసులో అనారోగ్యాల వల్ల కూడా మానసికంగా పలు సమస్యలు వస్తుంటాయి. కాబట్టి, ఒకసారి డాక్టర్‌ వద్దకు వెళ్లి మీ సమస్యలను వివరించండి. దానికి సంబంధించిన పరీక్షలు చేసి అవసరమైన చికిత్స అందిస్తారు. పిల్లలందరూ దూరంగా ఉన్నారు కాబట్టి, ఈ సమయంలో భార్యాభర్తలిద్దరికీ ఒకరి సహకారం మరొకరికి ఎంతో అవసరం. కాబట్టి, ఒకసారి మీ భర్తతో కలిసి సైకాలజిస్టును సంప్రదించండి. మీ పరిస్థితి తెలుసుకుని ఇద్దరికీ తగిన సూచనలు ఇస్తారు. తద్వారా మీరిద్దరూ దగ్గరయ్యే అవకాశం ఉంటుంది.. మీరూ ఒంటరితనం నుంచి బయటపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్