Published : 16/04/2022 21:17 IST

మీది ప్రేమా? ఆకర్షణా??

తెలిసీ, తెలియని వయసులో కొందరు మనసులో పుట్టే భావాలకు, ఆకర్షణకు ప్రేమ పేరు పెట్టి తప్పుదోవ పడుతుంటారు. ఎందుకంటే ప్రేమకు, ఆకర్షణకు చాలా దగ్గర సంబంధం ఉంది. వారి మనసులో ఉన్నది ఏ ఫీలింగో తెలుసుకోలేక తప్పటడుగులు వేస్తుంటారు. అలా జరగకూడదంటే ప్రేమకు, ఆకర్షణకు మధ్య తేడా తెలియాలంటున్నారు నిపుణులు. అందుకు ఈ విషయాలు దోహదపడతాయంటున్నారు.

ప్రేమ శాశ్వతమైనది..!

ప్రేమ ఫలానా సమయానికి పుడుతుందన్న గ్యారంటీ లేదు. మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడగానే గుండెలో ప్రేమ గంటలు మోగుతాయి. అలా మనస్ఫూర్తిగా ఇష్టపడిన, ప్రేమించిన వ్యక్తి కోసం ఎంత కాలమైనా వేచి చూస్తారు. చూసిన వెంటనే ప్రేమించినా లేక కొద్ది రోజుల స్నేహం ప్రేమగా మారినా ఆ మార్పు శాశ్వతంగా ఉండిపోతుంది. కానీ ఆకర్షణ అనేది క్షణికం.. అవతలి వ్యక్తి గురించి ఏమీ తెలుసుకోకుండానే గుడ్డిగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇష్టపడే వ్యక్తుల అవసరాలు, ఆపదలు.. ఇవన్నీ వాళ్లకు అనవసరం. నిజంగా ప్రేమించేవాళ్లు మనల్ని ఇబ్బంది పెట్టకుండానే ఏదోరకంగా వాళ్ల ప్రేమని వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కేవలం ఆకర్షణ అయితే మాత్రం ఎక్కువగా శారీరకంగా ఎలా దగ్గరవ్వాలన్న కోణంలోనే ఆలోచిస్తూ ఉంటారు.

ప్రవర్తన ఇలా..

ఒక వ్యక్తి ప్రవర్తనను బట్టి కూడా వాళ్లది ప్రేమా, ఆకర్షణా అనేది చెప్పచ్చు. అదెలాగంటే.. నిజమైన ప్రేమ అయితే ఎదుటి వ్యక్తి ఇష్టపడే వరకూ ఎదురు చూసే ఓర్పు, సహనం ఉంటుంది. అలాగే వాళ్లకు ఆ వ్యక్తిపై ఇష్టం పెరిగేలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కానీ ఆకర్షణలో ఇదంతా ఉండదు. ఒకవేళ బ్రేకప్‌ అయినా.. ఒకటి లేదా రెండు రోజులకు మొత్తం మరిచిపోయి మళ్లీ వేరే వ్యక్తిని ఇష్టపడటం ప్రారంభిస్తారు.

వారిని ఒప్పిస్తున్నారా? లేదా?

ఆకర్షణ అనేది ఎదుటివ్యక్తిని ఎలాగైనా పడేయాలన్న పన్నాగం. ఉదాహరణకు.. టీనేజ్‌లో ఉన్న అమ్మాయిని ఎవరైనా ఓ అబ్బాయి తదేకంగా చూస్తున్నాడనుకోండి.. ముందు పెద్దగా పట్టించుకోకపోయినా క్రమంగా ఆ అమ్మాయి మనసులో 'ఎందుకు నన్ను అలా తీక్షణంగా చూస్తున్నాడు?' అన్న ఆలోచన తప్పకుండా కలుగుతుంది. పదే పదే అదే ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల వాళ్లకు తెలియకుండానే ఎదుటి వ్యక్తి పన్నిన వలలో చిక్కుకుంటారు. కాబట్టి ఆకర్షణ అనేది ఎప్పుడూ ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తుంది. ఒకవేళ నిజంగా ఇద్దరూ పరస్పరం ప్రేమించుకుంటున్నట్త్లెతే.. ఇరువైపులా కుటుంబ సభ్యులతో మాట్లాడి తమ ప్రేమని పెళ్లి పీటలెక్కించడానికి ప్రయత్నిస్తారు.

ఆ ప్రోత్సాహం ఉందా?

నిజంగా ప్రేమించుకున్న వ్యక్తులు ప్రతి విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూనే ఉంటారు. కష్టసుఖాలు, లాభనష్టాలు.. అన్నీ కలిసే భరించడానికి సిద్ధమవుతారు. అదే ఆకర్షణలో అయితే ఇవేవీ ఉండవు. కేవలం లైంగిక వాంఛ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అవతలి వ్యక్తి పట్టించుకోరు. పైగా స్నేహితుల ముందు మీ గురించి హేళనగా మాట్లాడటం, మిమ్మల్ని ఏడిపించడానికి ప్రయత్నించడం.. లాంటి చీప్ ట్రిక్స్ కూడా ప్లే చేస్తుంటారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని