ఐదుగురు అక్కచెల్లెళ్లు.. ఆ ఊరికి పేరు తెచ్చారు!

తరాలు మారుతున్న కొద్దీ పల్లెటూళ్లను వదిలి పట్నంలో స్థిరపడుతున్నారు చాలామంది. రెక్కలు కట్టుకొని విదేశాల్లో వాలిపోతున్నారు. ఇలా పుట్టిన ఊరిని, పెరిగిన ఇంటిని వదిలిపెట్టడమే కాదు.. ఊరికి, తమకు ఎలాంటి సంబంధం ఉండకూడదని పూర్వీకుల ఆస్తిపాస్తుల్ని అమ్ముకునేవారూ కనిపిస్తుంటారు.

Updated : 18 Oct 2023 20:21 IST

(Photos: Facebook)

తరాలు మారుతున్న కొద్దీ పల్లెటూళ్లను వదిలి పట్నంలో స్థిరపడుతున్నారు చాలామంది. రెక్కలు కట్టుకొని విదేశాల్లో వాలిపోతున్నారు. ఇలా పుట్టిన ఊరిని, పెరిగిన ఇంటిని వదిలిపెట్టడమే కాదు.. ఊరికి, తమకు ఎలాంటి సంబంధం ఉండకూడదని పూర్వీకుల ఆస్తిపాస్తుల్ని అమ్ముకునేవారూ కనిపిస్తుంటారు. ఇలాంటి వాళ్లందరూ ‘సంఘా సిస్టర్స్‌’ కథ వింటే మనసు మార్చుకోవాల్సిందే! పంజాబ్‌ గుర్దాస్‌పూర్‌ జిల్లాలోని నవన్‌పిండ్‌ సర్దారన్‌ గ్రామం వీళ్ల సొంతూరు. అక్కడ తమ పూర్వీకులకు సంబంధించిన రెండు ఇళ్లున్నాయి. ప్రస్తుతం వివాహం, వృత్తిఉద్యోగాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో స్థిరపడ్డా.. ఈ రెండిళ్లనూ విస్మరించలేదు వారు. అప్పటివరకు సాధారణ ఇళ్లుగా ఉన్న వీటిని చిన్నపాటి పర్యటక ప్రదేశాలుగా మార్చేశారు. ఇలా వీళ్ల చొరవతో ఇటీవలే ‘దేశంలోనే ఉత్తమ పర్యటక గ్రామం-2023’గా ఈ ఊరికి అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో గ్రామాభివృద్ధిలో ఈ ఐదుగురు అక్కచెల్లెళ్లు చేసిన కృషి ఏంటో తెలుసుకుందాం రండి..

ఏటా ‘ప్రపంచ పర్యటక దినోత్సవం’ సందర్భంగా కేంద్ర పర్యటక శాఖ ‘దేశంలోనే ఉత్తమ పర్యటక గ్రామాన్ని’ ఎంపిక చేసి అవార్డు అందిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాల నుంచి 750 గ్రామాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. ఈ అవార్డు కోసం పోటీ పడ్డాయి. కాగా తుది పోటీ కోసం 35 గ్రామాల్ని ఎంపిక చేసిన ప్రభుత్వం.. పంజాబ్‌ రాష్ట్రంలోని గుర్దాస్‌పూర్‌ జిల్లా నవన్‌పిండ్‌ సర్దారన్‌ గ్రామాన్ని ఈ ఏటి ‘ఉత్తమ పర్యటక గ్రామం’గా ప్రకటించింది. ఇక ఈ గ్రామాన్ని పర్యటక ప్రదేశంగా అభివృద్ధి చేసిన ఐదుగురు అక్కచెల్లెళ్లు ఇటీవలే ఈ అవార్డును అందుకున్నారు.

ఎవరీ సంఘా సిస్టర్స్?

అమృత్‌సర్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళ్లే మార్గ మధ్యంలో ఉంటుంది గుర్దాస్‌పూర్‌ జిల్లా. జాతీయ రహదారికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఇక్కడి నవన్‌పిండ్‌ సర్దారన్‌ గ్రామానికి దగ్గర్లో అమృత్‌సర్‌, మాతా వైష్ణోదేవి ఆలయం, ధర్మశాల, కంగ్రా, డల్హౌసీ.. తదితర పర్యటక ప్రదేశాలున్నాయి. స్వదేశీ, విదేశీ పర్యటకులతో నిత్యం కిటకిటలాడే ఈ ప్రాంతాలు ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే సాధారణంగా గ్రామాల్లో పర్యటకుల కోసం హోటల్స్‌, ఇతర సదుపాయాలు ఉండడం చాలా అరుదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే నవన్‌పిండ్‌ గ్రామంలో టూరిస్టులు స్టే చేసేలా పలు సదుపాయాలు కల్పించాలనుకున్నారు ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు అక్కచెల్లెళ్లు. వాళ్లే గుర్‌సిమ్రన్‌ కౌర్‌ సంఘా, గుర్‌మీత్‌ రాయ్‌ సంఘా, మన్‌ప్రీత్‌ కౌర్‌ సంఘా, గీతా సంఘా, నూర్‌ సంఘా. ‘సంఘా సిస్టర్స్‌’గా పేరుగాంచిన వీరు.. తమ పూర్వీకులకు సంబంధించిన ‘కొథి’, ‘పిపల్‌ హవేలీ’ అనే రెండు ఇళ్లను పర్యటకుల కోసం అనువైన నివాస స్థలాలుగా మార్చాలనుకున్నారు.

ప్రాచీన ఇళ్లకు.. అధునాతన హంగులు!

దాదాపు 140 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ విశాల గృహాల్ని.. వింటేజ్‌ హోటల్స్‌గా మార్చాలనుకున్నారీ అక్కచెల్లెళ్లు. ఈ ఆలోచనతోనే ఇందులో కొన్ని మరమ్మతులు చేసి.. సకల సదుపాయాలతో హోటల్స్‌గా తీర్చిదిద్దారు. స్వదేశీయులైనా, విదేశీయులైనా.. వారికి తమ ఇంటి అనుభూతిని పంచేలా ఈ గృహాల్ని తీర్చిదిద్దారీ అక్కచెల్లెళ్లు. అధునాతన పడకగదులు, డైనింగ్‌ రూమ్‌, టూరిస్టుల కోసం ఆటస్థలాలు, వ్యాయామశాలలు.. తదితర సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇళ్ల చుట్టూ మొక్కలు నాటడం, గార్డెనింగ్‌తో పచ్చదనాన్ని పెంచారు. ఇలా టూరిస్టులు బస చేయడానికి హోటల్‌లా, చూడ్డానికి పర్యటక ప్రదేశంగా.. ఇలా రెండు రకాలుగా ఈ ఇళ్లకు హంగులద్దారీ అక్కచెల్లెళ్లు. ప్రస్తుతం వివాహమై, వృత్తిఉద్యోగాల రీత్యా వీరంతా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడ్డా.. ఈ రెండిళ్ల బాగోగులు చూసుకుంటున్నారీ సంఘా సిస్టర్స్‌. వీరితో పాటు వీరి తల్లి సత్వంత్‌ కౌర్ సంఘా కూడా వీటి నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు.

ఒక్కొక్కరం.. ఒక్కో బాధ్యత!

అధునాతన హంగులతో కూడిన వింటేజ్‌ హోటల్స్‌ని తలపించే ఈ రెండిళ్లలో ఉండడానికి పర్యటకులు పోటీపడుతుంటారని చెబుతున్నారు ఈ ఐదుగురు అక్కచెల్లెళ్లలో ఒకరైన సిమ్రన్.
‘ప్రస్తుతం నేను దిల్లీలో ఉంటున్నాను. వారానికోసారి గ్రామానికి వస్తుంటా. కావాల్సిన సదుపాయాల్ని సమకూర్చుతుంటా. గుర్‌మీత్‌ దిల్లీలోనే ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. మా ఇళ్లను అధునాతనంగా తీర్చిదిద్దడంలో తనది కీలక పాత్ర. అలాగే మన్‌ప్రీత్‌ ప్రస్తుతం యూఎస్‌లో ఉంటోంది. అక్కడ్నుంచే సోషల్‌ మీడియా ప్రమోషన్‌, హోటల్‌ బుకింగ్స్‌.. వంటి బాధ్యతలు చూసుకుంటోంది. గీత చాలావరకు ఈ గ్రామంలోనే ఉంటోంది. హోటల్‌కు సంబంధించిన పలు బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇక్కడి స్వయం సహాయక బృందాలతో కలిసి పనిచేస్తోంది. ఇక మా అందరి ముద్దుల చెల్లెలైన నూర్‌ ముంబయిలో లాయర్‌గా పని చేస్తోంది. తనూ ఈ గ్రామ పర్యటక అభివృద్ధిలో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇలా ఈ ఇళ్లకు సంబంధించిన బాధ్యతల్ని మేం ఐదుగురం మా అమ్మతో కలిసి పంచుకుంటున్నాం. మేమంతా అప్పుడప్పుడూ వీలు కుదుర్చుకొని గ్రామానికొచ్చి ఎంజాయ్‌ చేస్తాం. ఇలా సకల సదుపాయాలతో కూడిన ఈ వింటేజ్‌ హోటల్స్‌లో ఉండడానికి చాలామంది పర్యటకులు ఆసక్తి చూపుతుంటారు. వారం, పది రోజులైనా ఇంట్లో ఉన్నంత ఫ్రీగా, సౌకర్యవంతంగా ఉండగలుగుతున్నామని చెబుతుంటారు..’ అంటారామె.

ప్రజలకు ఉపాధి కల్పిస్తూ..

ఇలా తమ పూర్వీకుల ఇళ్లను పర్యటకుల కోసం నివాస స్థలాలుగా తీర్చిదిద్దిన ఈ అక్కచెల్లెళ్లు.. వీటి ద్వారా తమ గ్రామ ప్రజలకు ఉపాధి కల్పించడంలోనూ సక్సెసయ్యారు. ఈ క్రమంలో.. పర్యటకుల కోసం వంట చేయడం, హోటల్‌ని పరిశుభ్రంగా ఉంచడం, అతిథి సత్కారాలు.. వంటి పనుల్ని అక్కడి ప్రజలకు నేర్పించి.. ఆపై వారికి అప్పగించి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాదు.. ఆసక్తి ఉన్న మహిళలకు పలు కళల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వారితోనే బ్యాగ్స్‌, స్వెటర్స్‌, ల్యాంప్‌ షేడ్స్‌, టేబుల్‌ లినెన్‌, కుషన్‌ కవర్స్‌, బెడ్‌షీట్స్‌.. వంటి ఉత్పత్తులు తయారుచేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇక ఈ ఉత్పత్తుల్ని తమ హోటల్స్‌లోనే స్టాల్స్‌గా ఏర్పాటుచేసి.. పర్యటకులు కొనుక్కునేలా అవకాశం కల్పిస్తున్నారు. ఇలా కూడా అక్కడి ప్రజలకు జీవనోపాధి చూపిస్తున్నారీ అక్కచెల్లెళ్లు. ఇలా నవన్‌పిండ్‌ గ్రామాన్ని అటు పర్యటకంగా అభివృద్ధి చేస్తూనే.. ఇటు ప్రజలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంలో సఫలీకృతులైనందుకే సంఘా సిస్టర్స్‌కు ఇటీవలే కేంద్ర పర్యటక శాఖ ఈ అవార్డును అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్