ఐఐటీ చదివి.. ఫిట్‌నెస్ రంగంలోకి అడుగుపెట్టి..!

నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా పనిలోనే నిమగ్నమవుతాం.. ఇక వృత్తిఉద్యోగాలు చేసే మహిళలకైతే విశ్రాంతి తీసుకునే సమయం కూడా మిగలదు. అలాంటప్పుడు ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరికెక్కడిది!

Published : 12 Jun 2024 14:41 IST

(Photos: Instagram)

నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా పనిలోనే నిమగ్నమవుతాం.. ఇక వృత్తిఉద్యోగాలు చేసే మహిళలకైతే విశ్రాంతి తీసుకునే సమయం కూడా మిగలదు. అలాంటప్పుడు ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరికెక్కడిది! దాంతో శారీరక నొప్పులు, వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. సరిగ్గా పదేళ్ల క్రితం ప్రియాంక గుప్తాదీ ఇదే పరిస్థితి! ఈ క్రమంలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో రియలైజ్‌ అయిన ఆమె.. చక్కటి ఆహార నియమాలు, ఫిట్‌నెస్‌ రొటీన్‌తో తన అనారోగ్యాలన్నీ దూరం చేసుకుంది. ఈ ప్రయాణమే ఆమెను ఫిట్‌నెస్‌ కోచ్‌గా సరికొత్త అవతారమెత్తేందుకు పురికొల్పింది. కార్పొరేట్‌ కెరీర్‌ వదిలి.. ప్రస్తుతం వృత్తిఉద్యోగ నిపుణులకు ఫిట్‌నెస్‌ టీచర్‌గా మారిన ప్రియాంక.. ‘ఫిట్‌నెస్‌ అంటే లక్ష్యం కాదు.. అదో జీవనశైలి!’ అంటూ ఎంతోమందిలో ఆరోగ్య స్పృహ పెంచుతోంది.

ప్రియాంకది బెంగళూరు. చిన్నప్పట్నుంచి ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఆమెను వెంటాడేది. ఐఐటీ కాన్పూర్‌లో ‘మెటీరియల్‌ సైన్స్‌-మెటలర్జీ’లో బీటెక్‌ పూర్తిచేశాక.. కార్పొరేట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిందామె. పలు ప్రముఖ సంస్థల్లో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా పనిచేసింది ప్రియాంక. ఇలా దాదాపు పదేళ్ల పాటు కెరీర్‌తో పరిగెత్తిందామె. ఈ సమయంలో ఉద్యోగం తప్ప వేరే ధ్యాస లేదామెకు. మధ్యలో ఒకట్రెండు వ్యాపారాలు ప్రారంభించినా సక్సెస్‌ కాలేకపోయింది.

అప్పుడు రియలైజయ్యా!

‘మంచి చదువు, కార్పొరేట్‌ రంగంలో సౌకర్యవంతమైన ఉద్యోగం.. ఒక మహిళకు ఇంతకుమించి ఇంకేం కావాలి? కానీ నాకు మాత్రం కొన్నాళ్లు జాబ్‌ చేశాక బోర్ కొట్టేసింది. ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. అప్పుడే ‘Vivilio.com’ పేరుతో ఓ సోషల్‌ బుక్‌ డిస్కవరీ వేదికను ప్రారంభించా. కానీ అందులో అనుకున్నంత సక్సెస్‌ సాధించలేకపోయా. ఆపై ‘ఇంటి ఆహారాన్ని డెలివరీ చేసే వ్యాపారం’ ప్రారంభించాలనుకున్నా. కానీ తొలి వ్యాపారంలో విఫలమయ్యేసరికి.. ఇదీ వర్కవుట్‌ కాదేమోనన్న అభద్రతా భావం నన్ను వెంటాడింది. దాంతో ఉద్యోగంలోనే కొనసాగాను. ఇలా ఉద్యోగం, వ్యాపారం, కెరీర్‌ ధ్యాసలో పడి ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించా. దాంతో కొన్నాళ్లకు నడుం నొప్పి, కాళ్ల నొప్పులు వేధించాయి. మన జీవితంలో కెరీర్‌కే కాదు.. ఆరోగ్యానికీ సమ ప్రాధాన్యమివ్వాలన్న విషయం అప్పుడు నాకు అర్థమైంది. ఈ క్రమంలోనే పోషకాహారం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. నిపుణుల సలహా మేరకు చక్కటి ఆహార నియమాలు పాటించా.. మరోవైపు కెరీర్‌నూ బ్యాలన్స్‌ చేస్తూ ముందుకు సాగాను. ఇలా నాలో పెరిగిన ఆరోగ్య స్పృహతోనే ‘పోషకాహారం-ఫిట్‌నెస్‌’ వంటి అంశాల్లో కోర్సులు పూర్తిచేసి సర్టిఫికేషన్‌ సాధించా..’ అంటోంది ప్రియాంక.

ఫిట్‌నెస్‌.. ఓ జీవనశైలి!

ఇలా ఉద్యోగం చేసే మహిళలకు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ వంటివి ఎంత ముఖ్యమో స్వీయానుభవంతో గుర్తించిన ప్రియాంక.. ప్రత్యేకించి మహిళలందరిలోనూ వీటిపై అవగాహన పెంచాలనుకుంది. ఈ ఆలోచనలతోనే కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి.. 2021లో ‘Veg Fit’ పేరుతో ఫిట్‌నెస్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ వేదికగా వృత్తి ఉద్యోగాల్లో కొనసాగే వారికి ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతోంది.. డైట్‌ టిప్స్‌ సూచిస్తోంది. ప్రత్యేక సెషన్స్‌ నిర్వహిస్తూ.. ఆహారం/ఫిట్‌నెస్‌కు సంబంధించిన కోర్సుల్ని వారికి పరిచయం చేస్తోంది. ఇలా ఆహార నియమాలకు సంబంధించిన డైట్‌ ప్లాన్స్‌ అందిస్తూనే.. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్ పైనా అవగాహన పెంచుతోంది ప్రియాంక.

‘కెరీర్‌తో పాటు ఆరోగ్యాన్నీ బ్యాలన్స్‌ చేసుకున్నప్పుడే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాం. ఈ క్రమంలో పనిలో ఉత్పాదకత మెరుగుపరచుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌ స్థాయుల్ని పెంపొందించుకోవడం, మనసుకు నచ్చిన వారితో/కుటుంబ సభ్యులతో సమయం గడపడమూ ముఖ్యమే! ఇవే జీవనశైలి సమస్యలు మన దరిచేరకుండా కాపాడతాయి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాల్ని చేరుకోగలుగుతాం. చాలామంది ఫిట్‌నెస్‌ అంటే ఓ లక్ష్యంగానే చూస్తారు. కానీ దీన్నో జీవనశైలిగా నేను నమ్ముతా. అందుకే ఇటు ఇంటిని, అటు కెరీర్‌ను, మరోవైపు ఆరోగ్యాన్ని.. ఇలా అన్నింటినీ బ్యాలన్స్‌ చేసుకోగలుగుతున్నా.. నా క్లైంట్స్‌కూ ఇదే చెబుతుంటా..’ అంటోందీ ఫిట్‌నెస్‌ లవర్.

ప్రస్తుతం 40 ఏళ్ల వయసులోనూ.. ఎంతో ఉత్సాహంగా, ఫిట్‌గా ఉండే ప్రియాంక.. ఇదంతా ఫిట్నెస్‌ మహిమే అంటోంది. తన వద్ద శిక్షణ పొందిన వారి ఫిట్‌నెస్‌ జర్నీని తన వెబ్‌సైట్‌ వేదికగా పంచుకునే అవకాశమిస్తూ.. ఎంతోమందిలో స్ఫూర్తి రగిలిస్తోందామె. మరోవైపు సోషల్‌ మీడియా వేదికగానూ ఆహార, వ్యాయామాలకు సంబంధించిన చిట్కాలు, సలహాలూ అందిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్