Geeta Madhuri: అబ్బాయి పుట్టాడు.. ఆనందం నింపాడు!

మాతృత్వం ఓ వరం. దాన్ని రెండోసారి పొందితే ఆ ఆనందం వర్ణనాతీతం! ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతున్నారు గాయని గీతామాధురి - నటుడు నందు దంపతులు.

Published : 20 Feb 2024 13:26 IST

(Photos: Instagram)

మాతృత్వం ఓ వరం. దాన్ని రెండోసారి పొందితే ఆ ఆనందం వర్ణనాతీతం! ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతున్నారు గాయని గీతామాధురి - నటుడు నందు దంపతులు. ఐదేళ్ల క్రితం కూతురికి జన్మనిచ్చిన వీరు.. ఇప్పుడు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ఇటీవలే గీత పండంటి బాబుకు జన్మనిచ్చినట్లు నందు ఓ సందర్భంలో పంచుకున్నాడు. దీంతో ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.. ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సందడిగా ‘సీమంతం’!

టాలీవుడ్‌ సింగర్‌ గీతామాధురి, నటుడు నందు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే! కెరీర్‌లో రాణించే క్రమంలోనే 2014లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2019లో దాక్షాయణి ప్రకృతి అనే పాపకు జన్మనిచ్చారు. అయితే తామిద్దరం మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిందీ జంట. ‘దాక్షాయణి ప్రకృతి త్వరలోనే అక్క కాబోతోంది.. ఫిబ్రవరిలో మా రెండో చిన్నారి రాబోతోంది..’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిందీ అందాల జంట. ఈ క్రమంలోనే గీతామాధురికి ఇటీవలే సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ వేడుకలో ఆమె పూర్తి సంప్రదాయబద్ధంగా మెరిసిపోయింది. భర్త, కూతురితో ఫొటోలకు పోజిస్తూ సందడి చేసింది. ఇలా తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంటూ మురిసిపోయింది. అప్పుడే కాదు.. వివిధ సందర్భాల్లో తన బేబీబంప్‌ ఫొటోల్ని, మెటర్నిటీ పిక్స్‌ని ఇన్‌స్టాలో పంచుకుందీ బ్యూటిఫుల్‌ మామ్.

బాబుతో.. మా జీవితాలు పరిపూర్ణం!

అయితే రెండో బిడ్డ కోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురుచూస్తోన్న ఈ జంటకు ఇటీవలే పండంటి బాబు పుట్టాడు. ‘ఫిబ్రవరి 10న మాకు కొడుకు పుట్టాడు.. మా జీవితాల్లోకి ఆనందం తెచ్చాడు..’ అంటూ నందు తాజాగా ఓ సందర్భంలో పంచుకుంటూ మురిసిపోయాడు. పనిలో పనిగా గీతతో తన పదేళ్ల వైవాహిక బంధంలోని పలు మధుర జ్ఞాపకాల్నీ నెమరువేసుకున్నాడు.

‘మా పదేళ్ల వైవాహిక బంధంలో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. నా బుజ్జి (గీతా మాధురి)ని పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పిల్లలతో మా జీవితాలు పరిపూర్ణమవడం అత్యంత అందమైన అనుభూతులు. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను..’ అంటూ నవ్వేస్తాడు నందు.

అలాగే- ‘ప్రతిసారీ సినిమాలే మమ్మల్ని మరింత దగ్గర చేశాయి. మొదటిసారి ఇద్దరం కలిసి గబ్బర్‌ సింగ్‌ సినిమాకు వెళ్లిన జ్ఞాపకాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత కూడా ఇద్దరం కలిసి చాలా సినిమాలు చూశాం. ఇలా సినిమాలపై మాకున్న ఉమ్మడి ఆసక్తే మా రిలేషన్‌షిప్‌ సీక్రెట్స్‌లో ఒకటని చెప్తా..’ అని ఓ సందర్భంలో పంచుకుంది గీత!
మొత్తానికి ఇలా పాప, బాబుతో తమ జీవితాల్ని సంపూర్ణం చేసుకున్న గీత-నందు దంపతులకు పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కంగ్రాట్స్‌ క్యూట్‌ కపుల్!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్