పిల్లలకీ పరీక్షా సమయమే
close
Published : 22/01/2022 01:42 IST

పిల్లలకీ పరీక్షా సమయమే!

అంతా మామూలు స్థితికి వచ్చేస్తోందనుకోగానే.. ఒమిక్రాన్‌ మొదలైంది. స్కూలు, కొత్త స్నేహాలతో సర్దుకుపోతున్న పిల్లలు మళ్లీ ఆన్‌లైన్‌ బాట పట్టాల్సి వచ్చింది. ఇది ఆ చిన్ని మనసులపై కాస్త ప్రతికూల ప్రభావం చూపేదే. కాబట్టి, వాళ్లనీ గమనించుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

* అన్ని పనుల్లో వాళ్లనీ భాగస్వాములను చేయండి. ఇంటి, వంట పనుల్లో వస్తువులు అందించమనో, కూరగాయల్ని గుర్తుపట్టమనో అడగండి. ఉత్సాహంగా చేస్తారు. వార్తాపత్రిక చదువుతున్నా చిన్న చిన్న విషయాలను చెప్పండి. లేదూ.. ప్రముఖుల చిత్రాలను చూపి గుర్తించమనండి. వ్యాపకమూ అవుతుంది, జనరల్‌ నాలెడ్జ్‌నీ పెంచిన వారవుతారు.
* వాళ్ల ఆసక్తులను గమనించి, వాటిల్లో రాణించేలా ప్రోత్సహించండి. బొమ్మలు గీయడం ఇష్టమా.. వాళ్లతోపాటు మీరూ మీ సృజనాత్మకతకు పని చెప్పండి. వాళ్లు గీసిన వాటిని రంగులు వేయించి గోడకు అంటించడమో, భద్రంగా దాయడమో చేయండి. వాళ్లకీ ఆనందం, గొప్ప జ్ఞాపకమూ అవుతుంది. నృత్యం అంటే ఇష్టముంటే మీరూ సరదాగా కాలు కదపొచ్చు.
* ఏం తోయడం లేదు, విసుగేస్తోంది అంటున్నారు కదా అని టీవీనో, మొబైల్‌నో అప్పగించేయకండి. అసలు ఇవ్వకూడదని కాదు.. కానీ సమయ పరిమితులు విధించడం మరచిపోవద్దు. కొద్దిసేపు చిన్న చిన్న వ్యాయామాలు, యోగా వంటివి చేయించొచ్చు. శ్వాస సంబంధిత వ్యాయామాలు, ప్రాణాయామం చేయడం నేర్పండి. ఊపిరితిత్తుల సామర్థ్యమే కాదు ఏకాగ్రతా పెరుగుతుంది. సాయంత్రాలు సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కొంత దూరం నడవండి. వాళ్లతో అనుబంధమూ పెరుగుతుంది.
* తరగతులకు భయంతోనో, అయిష్టంగానో కాకుండా ఇష్టంగా హాజరయ్యేలా చూడండి. వాళ్ల హోంవర్క్‌ సమయంలో మీరూ పక్కనే కూర్చొని పని చేసుకుంటుంటే వాళ్లకీ అనాసక్తి ఉండదు. సాయంత్రం కాసేపు వాళ్లతో కలిసి ఆటలాడండి. ఉత్సాహంగా మరుసటి రోజు కోసం ఎదురు చూస్తారు.


Advertisement

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి