పాపతో..ప్రపంచ యాత్ర!

ఇంట్లో అందరి మధ్య ఉంటూ.. పసిగుడ్డుని సాకడమే మొదటిసారి తల్లైన అమ్మాయికి కష్టం. అలాంటిది నెలల పసిపాపని వెంటేసుకొని ఒంటరిగా దేశాలు చుట్టేసి వచ్చింది పుణె యువతి దీనాజ్‌ రైసింఘానియా. ఆ అనుభవాల్ని

Published : 31 Jan 2022 00:58 IST

ఇంట్లో అందరి మధ్య ఉంటూ.. పసిగుడ్డుని సాకడమే మొదటిసారి తల్లైన అమ్మాయికి కష్టం. అలాంటిది నెలల పసిపాపని వెంటేసుకొని ఒంటరిగా దేశాలు చుట్టేసి వచ్చింది పుణె యువతి దీనాజ్‌ రైసింఘానియా. ఆ అనుభవాల్ని అక్షరీకరించి ఒంటరి తల్లుల సాహస యాత్రలకు మార్గదర్శకురాలిగా నిలిచింది. ఔత్సాహిక మహిళా యాత్రికులకు సూచనలిస్తూ ప్రముఖ ట్రావెల్‌ బ్లాగర్‌గా, ‘బ్యాక్‌ప్యాకింగ్‌ ఇండియన్‌ మమ్మా’గా సుపరిచితమైంది. ఆ స్ఫూర్తికెరటం.. ప్రయాణమిది.

కొత్త ప్రదేశాలు అన్వేషించడం.. భిన్న సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవడం దీనాజ్‌కి చాలా ఆసక్తి. చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి గుళ్లు, చారిత్రక ప్రదేశాలకు వెళ్లేది. పెద్దయ్యాక స్నేహితులతో తరచూ సాహస యాత్రలు చేసేది. పదేళ్ల కిందట ఆమెకి ఆశిష్‌తో పెళ్లైంది. సైన్యాధికారి అయిన తనూ ప్రకృతి ప్రేమికుడే. ఇద్దరూ కలిసి సియాచిన్‌ బేస్‌క్యాంప్‌, లద్దాఖ్‌, పాండిచ్చేరి, ఈశాన్య భారతం, కెనడా చుట్టొచ్చారు. తర్వాత దీనాజ్‌ 2015లో పాప ఆరియానాకి జన్మనిచ్చింది. ప్రయాణాలకు విరామం. ఇలా ఎక్కువరోజులు ఇంట్లోనే ఉండిపోవడం నచ్చలేదామెకి. ‘మొదటిసారి అమ్మయ్యాక నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇతరులపై ఆధారపడకుండా నా జీవితంలోకి వచ్చిన ఈ చిన్ని ప్రాణితోనే ఎందుకు ప్రపంచయాత్ర చేయకూడదు? అనిపించింది’ అంటూ తనలో సరికొత్తగా పురుడుపోసుకున్న ఆలోచనని వివరిస్తోంది. అయితే దీనాజ్‌ నిర్ణయం విని చాలామంది ఆశ్చర్యపోయారు. ‘చిన్నపాపతో ఒంటరి ప్రయాణం అన్నిరకాలుగా చాలా కష్టం. ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి’ అని హితవు చెప్పారు. వీటన్నింటికీ ముందే సిద్ధమైన దీనాజ్‌ వెనక్కి తగ్గలేదు. భర్త ఆశిష్‌ ఆమె గుండెధైర్యాన్ని మెచ్చుకొని ప్రోత్సహించాడు. ఆరునెలల కూతురు ఆరియానాని వీపున వేసుకొని ముందు పుణె నుంచి బెంగళూరుకి ఒంటరి రోడ్డు ప్రయాణం చేసింది. ఆ పదిరోజుల్లో తనపై తనకి నమ్మకం కలిగాక 2016లో జర్మనీ యాత్ర ప్రారంభించింది. ఈ సమయంలో తన దగ్గర ఉన్నవి ఒక పెద్ద బ్యాక్‌ప్యాక్‌, పిల్లల్ని నెట్టుకుంటూ తీసుకెళ్లే స్ట్రాలర్‌ మాత్రమే. హాస్టళ్లలో ఉంటూ, స్థానికంగా దొరికే ఆహారం తింటూ జర్మనీలోని పలు నగరాలు చుట్టేసింది. పాపకి పాలు పట్టిస్తూ.. స్థానికంగా దొరికే ఆహరం కొద్దికొద్దిగా తినిపించడం నేర్పించింది. అప్పుడప్పుడు వీడియోకాల్స్‌ మాట్లాడుతూ ఇంట్లోవాళ్ల భయం, బెంగ పోగొట్టేది. ఈ యాత్రలో జీవితానికి సరిపడా అనుభవాలు మూటగట్టుకొని భారత్‌ తిరిగొచ్చింది దీనాజ్‌.

బ్లాగర్‌గా.. దీనాజ్‌ ఇండియాకొచ్చాక తన అనుభవాలన్నీ గుదిగుచ్చి ఒక డాక్యుమెంటరీ తీసింది. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. చాలామంది మేమూ మా పిల్లలతో కలిసి ఒంటరి యాత్రలకు వెళ్తాం టిప్స్‌ చెప్పమంటూ దీనాజ్‌ని కోరారు. దాంతో ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకొని ‘బ్యాక్‌ప్యాకింగ్‌ ఇండియన్‌ మమ్మా’ బ్లాగ్‌ రాయడం మొదలుపెట్టింది. అందులో ఒంటరి తల్లులు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బస ఏర్పాట్లు, ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించుకోవాల్సిన విధానం, దేశంలో తప్పకుండా పర్యటించాల్సిన ప్రదేశాల వివరాలు, పలు ప్రాంతాల్లో ఉండే భిన్నమైన ఆచార వ్యవహారాలు.. ఇలా అన్ని విషయాలూ ప్రస్తావిస్తోంది. తర్వాత కూతురుతో కలిసి మేఘాలయా, రాజస్థాన్‌, గోవాలతోపాటు కంబోడియా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌లనూ సందర్శించి ఆ వివరాలూ బ్లాగ్‌లో రాసింది. వెలకట్టలేని ఆమె అనుభవాలు తెలుసుకున్న తర్వాత 2021లో మేఘాలయా రాష్ట్రంలోని ఒక టూర్‌ ఆపరేటర్‌ ఆమెను సంప్రదించాడు. ఆమెతో కలిసి ఒక స్టార్టప్‌లాంటి ప్రాజెక్టు ప్రారంభించాడు. దీనికి దేశం నలుమూలల నుంచి ఒంటరి తల్లులు ఆసక్తి చూపించారు. వాళ్లని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రకృతి అందాలను పరిచయం చేసింది. ఇంకా చేస్తోంది. కేవలం తనకున్న ఆసక్తితోనే సాహస యాత్రికురాలిగా, ట్రెండ్‌సెట్టర్‌గా, పేరున్న బ్లాగర్‌గా, సంపాదనపరురాలిగా.. భిన్న పాత్రల్లో రాణిస్తోంది దీనాజ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్