Published : 24/02/2022 01:01 IST

అపురూప బంధానికి ఆరు సూత్రాలు

భార్యాభర్తల మీద ఎన్ని జోకులు! ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటే పెళ్లయినట్లు.. నవ్వుతూ కనిపిస్తే కానట్లు అనడం కొత్త కాదు. కానీ ఎందుకలా? ఆలుమగలు సరదాగా, సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు ముచ్చటేస్తుంది. అదెలా సాధ్యమో ఫ్యామిలీ కౌన్సిలర్లు సూచిస్తున్నారు..

మన భావాలన్నీ చెప్పాలని ఉంటుంది. ఉద్వేగాలన్నీ ప్రదర్శించాలని ఉంటుంది. నిజమే, అదంతా చేయాల్సిందే. కానీ కేవలం మన ఆలోచనలు వ్యక్తం చేయడమే కాదు, అవతలి వ్యక్తికి కూడా చెప్పే అవకాశం ఇవ్వాలి. శ్రద్ధగా వినడం అలవాటు చేసుకుంటే మీ విలువ, గౌరవం మరింత పెరుగుతాయి.  

ఎవరి పనులు వారు చేసుకుంటూ ఎవరి మానాన వాళ్లుంటే జీవితం యాంత్రికంగా తయారవుతుంది. టీ తాగుతున్నప్పుడో, స్నాక్స్‌ తింటున్నప్పుడో ఇద్దరూ కబుర్లు చెప్పుకోండి. అవి ‘చిట్టీ డబ్బు కట్టావా లేదా? ఉప్మారవ్వ అయిపోయినట్లుంది’ లాంటివయితే అందులో దైనందిన అవసరాలే తప్ప మానసిక ఆనందాలు ఏమీ ఉండవు. అందుకే ఆ కాసేపూ సరదాగా ఊసులు కలబోసుకోండి. ఆ ఊసులు మీ ప్రేమను వ్యక్తం చేసేవైతే మరీ మంచిది.

ఇంటా బయటా ఎక్కడైనా నిజాయతీతో విలువ పెరుగుతుంది. ఇక భాగస్వామి గురించి చెప్పాల్సిందేముంది? అతి ముఖ్యమైన బంధమది. అందుకే అబద్ధం అనేది చెప్పొద్దు. నిష్టూరం కలిగించేదైనా సరే. అలాంటప్పుడు తాత్కాలికంగా కోపతాపాలు వచ్చినా మీపట్ల నమ్మకం పోదు. అలాగే దాపరికాలు లేకుండా అన్ని విషయాలూ పంచుకోండి. కపటం లేనప్పుడు ఇష్టం పెరుగుతుంది.

భాగస్వామి ఇష్టాలూ అయిష్టాలూ గుర్తించి.. ఆ ప్రకారం నడుచుకోండి. సహచరుల పట్ల ప్రేమ, గౌరవం చాటడమే ఇది.

ఒకరి పట్ల ఒకరు ఆధిక్యత చూపక, స్నేహంగా ఉండండి. మిత్రుల మధ్య ఆత్మీయత, గౌరవం మాత్రమే ఉంటాయి తప్ప చులకన భావం ఉండదు కదా! మరి భార్యాభర్తల కన్నా ఆప్తమిత్రులు ఎవరు?

సాధారణంగా కోపం వచ్చినప్పుడు మనకు తెలీకుండానే స్వరం హెచ్చుతుంది. కానీ అందువల్ల నలుగురికీ తెలియడమే తప్ప ఒరిగేదేమీ ఉండదు. కనుక అరిచి చెప్పాలనుకోవద్దు. కానీ స్థిరత్వం ధ్వనించేలా చెప్పండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని