Published : 05/04/2022 01:26 IST

సంసారంలో సరిగమలు

స్త్రీలకు ఇల్లు, సంసారం.. అతి పెద్ద బాధ్యత. ఆ పనుల నిర్వహణలో ఒక్కోసారి అలసటకు గురై భర్త మీద విసుగులూ అసహనాలూ చూపడం మామూలే. కానీ అది దైనందిన చర్యలా మారితే ఆలుమగల ఆత్మీయతకు బీటలువారే ప్రమాదముంది. ఇంతకూ ఇల్లాలు అంతలా విసిగిపోవడానికి కారణమేంటి? ప్రసన్నంగా ఉండటం కుదరదా? ఈ విషయమై ఫ్యామిలీ కౌన్సిలర్లు కొన్ని సలహాలూ సూచనలూ ఇస్తున్నారు.. వాటిని పాటించేసి శాంతంగా, సంతోష సరాగాలతో జీవించేద్దామా...

* అనేక బాధ్యతలు నిర్వహించే ఇల్లాలు భర్త నుంచి ప్రేమనూ ఓదార్పునూ కోరుకుంటుంది. అవి దొరకనప్పుడు అసహనం కలిగి, కోపం రూపంలో వ్యక్తంచేయడం సహజం. భాగస్వామి ఓదార్చితే మంచిదే. లేదంటే అతనికి తీరుబడి లేక పట్టించుకోలేదో, మరేదైనా ఒత్తిడిలో ఉన్నాడో ఆలోచించండి. ఒకవేళ అతని స్వభావమే అంతయితే అర్థం చేసుకోండి. ‘నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను, అందుకు ప్రశంసలు లేకున్నా పరవాలేదు’ అని మీకు మీరు సర్దిచెప్పుకోండి. అప్పుడు మనసు తేలికపడి కోపానికి తావుండదు.

* నెలసరి సమయంలో త్వరగా అలసిపోయి ఆ చిరాకును భాగస్వామి మీద చూపుతున్నారా?! విషయం చెప్పకుండా విసుక్కుని వాతావరణాన్ని గందరగోళం చేసుకునేకంటే ఆ సమయంలో విశ్రాంతి అవసరమని చెప్పండి. కష్టమైన వంటకాలకు బదులు తేలిగ్గా అయ్యేవాటితో సరిపెట్టుకోండి. లేదా అన్నం మాత్రం వండుకుని కూరలు తెప్పించుకోండి. తలనొప్పి, ఒళ్లునొప్పుల లాంటి ఇతర అనారోగ్యాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.

* ఉద్యోగ భద్రత లేకనో, పిల్లలు మాట వినకో, కుటుంబసభ్యుల అనారోగ్యం వల్లనో ఆందోళన చెందుతూ, ఆ బరువు తీర్చుకోవడానికి భర్త మీద కోపగించుకుంటున్నారా? ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి.. అందువల్ల సమస్య తీరకపోగా అలజడి కలుగుతుంది. కనుక మీ దిగులేమిటో దాపరికం లేకుండా చర్చిండండి. ఇద్దరూ కలిసి ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది.  

* పనులు ఎక్కువై చేయలేక సతమతమవుతూ బాధపడుతున్నారా? విసుగూ అలసటే కాకుండా ఒకరకమైన విరక్తి కూడా కలుగుతోందా? ఇలాంటి నిరాశా నిస్పృహలు డిప్రెషన్‌కు దారి తీసే ప్రమాదముంది. కనుక కోపం, ఉక్రోషం ప్రదర్శించే బదులు మీ బాధను పంచుకోండి. పనుల్లో సాయం అవసరమని, లేదంటే మరింత నీరసించిపోతానని సామరస్యంగా చెప్పండి. ఫలితం తప్పకుండా బాగుంటుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని