పెళ్లికి ముందే ప్రణాళికలు

నవ్య, సురేష్‌లకు వివాహం నిశ్చయం చేయాలనుకుంటున్నారు పెద్దలు. అవతలి వ్యక్తి మనస్తత్వం ఎటువంటిదో తెలుసుకోవాలని ఉంది నవ్యకు. దానికి పెద్ధవాళ్లేమంటారో అని సంశయిస్తోంది. దాంపత్యజీవితంలోకి అడుగుపెడుతున్న ఇద్దరూ ముందుగానే ఎదుటివారి

Published : 16 May 2022 01:49 IST

నవ్య, సురేష్‌లకు వివాహం నిశ్చయం చేయాలనుకుంటున్నారు పెద్దలు. అవతలి వ్యక్తి మనస్తత్వం ఎటువంటిదో తెలుసుకోవాలని ఉంది నవ్యకు. దానికి పెద్ధవాళ్లేమంటారో అని సంశయిస్తోంది. దాంపత్యజీవితంలోకి అడుగుపెడుతున్న ఇద్దరూ ముందుగానే ఎదుటివారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు. అప్పుడే అవతలివారి బలం, బలహీనత, అభిరుచులు వంటి అంశాలపై అవగాహన కలుగుతుందని సూచిస్తున్నారు.

వివాహమైన తర్వాత జీవితంలో ముఖ్యమైన  పిల్లల విషయాన్ని మాట్లాడుకోవాలి. కెరీర్‌లో స్థిరపడిన తర్వాత కొందరు పిల్లలు కావాలనుకుంటే, మరికొందరు వెంటనే కోరుకుంటారు. ముందుగానే ఇద్దరూ తమ అభిప్రాయాలను తెలుసుకోగలిగితే ఆ తర్వాత సమస్య ఉండదు.

పొదుపు.. కాబోయే దంపతులిద్దరూ ఉద్యోగులైతే పెళ్లైన తర్వాత ప్రణాళికాబద్ధంగా అడుగేస్తే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులుండవు. ఇంట్లో ఒకరిదే సంపాదనైతే.. సర్దుకొంటూ కొంతైనా పొదుపు వైపు అడుగులేయడంపై చర్చించుకోవచ్చు. ముందు నుంచే వృథా ఖర్చులకు దూరంగా ఉండొచ్చు.   

ఇంటి పనులు.. ‘మగపిల్లాడినని అమ్మ నాకేం పనులు నేర్పలేదు’ అని తప్పించుకోకుండా ‘ఇంటి పనుల్లో నీకు నేను సాయంగా ఉంటా’ అనే భర్తను ఏ భార్య అయినా మరింత ప్రేమిస్తుంది.  ఏయే పనులు ఎవరు చేయగలరో ముందుగానే చర్చించుకోవచ్చు. ప్రస్తుతం ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కాపురాల్లో ఈ విధానం దంపతులమధ్య అనుబంధాన్ని పెంచుతుంది. 

సొంతిల్లు.. ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. ఇది నెరవేరాలంటే భాగస్వామి చేయూత అవసరం. ఏడడుగులు వేసే ముందు ఈ కలను సాకారం చేసుకుందాం అనే ఆలోచన మొదలుపెడితే చాలు. తొందర్లోనే సొంతింటిలో అడుగు పెట్టొచ్చు.

అలవాట్లు.. కొందరు త్వరగా నిద్రపోరు. మరికొందరికి లేవగానే కాఫీ తాగందే రోజు మొదలవదు. ఒకరికి సినిమాలంటే ఇష్టముంటే, మరొకరికి పుస్తకం లేనిదే నిద్రపట్టదు... ఈ అభిరుచులు, అలవాట్లు రేపు మీ నడుమ సమస్యగా మారొచ్చు. ముందుగానే తెలుసుకుంటే వాటికి తగినట్లు ప్రోత్సహించుకోవచ్చు. కలిసి పంచుకుంటే ఆనందమే వేరు. జీవితభాగస్వామి వద్ద కూడా కొన్ని హద్దులుండాలి. అప్పుడే ఒకరిపై మరొకరికి మర్యాద పెరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్