అమ్మాయితో మాట్లాడుతున్నారా...

భార్గవి కూతురికి పదేళ్లు నిండుతున్నాయి. తన ప్రవర్తనలో ఇప్పుడు మార్పులు కనిపిస్తున్నాయి. యుక్తవయసులోకి అడుగు పెడుతున్న ఈ సమయంలో వారితో మాట్లాడాల్సింది చాలా ఉందని చెబుతున్నారు మానసిక నిపుణులు. అవేంటో కూడా సూచిస్తున్నారు. 

Published : 27 May 2022 00:40 IST

భార్గవి కూతురికి పదేళ్లు నిండుతున్నాయి. తన ప్రవర్తనలో ఇప్పుడు మార్పులు కనిపిస్తున్నాయి. యుక్తవయసులోకి అడుగు పెడుతున్న ఈ సమయంలో వారితో మాట్లాడాల్సింది చాలా ఉందని చెబుతున్నారు మానసిక నిపుణులు. అవేంటో కూడా సూచిస్తున్నారు. 

ఈ వయసులో కొందరు ఆడపిల్లలు అమ్మా నాన్నలతో మాట్లాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపరు. స్నేహితులు లేదా ఫోన్‌లో ఎక్కువ సమయం వెచ్చిస్తారు. శారీరక మార్పులు, నెలసరి మొదలవక ముందు కలిగే హార్మోన్ల మార్పులు వంటివన్నీ వారిని పెద్దవాళ్ల వద్దకు చనువుగా రానివ్వవు. అలాగని మనమూ దూరంగా ఉండకూడదు. వారి వయసు వారితో కలిసేలా, బడి తర్వాత క్రీడా మైదానంలో ఉండేలా చూడటం మంచిది. స్నేహితులతో ఆడటం లేదా పాఠ్యాంశాలపై చర్చలు వంటివన్నీ ఆసక్తిని కలిగిస్తాయి. స్వీయ సామర్థ్యాల్నీ పెంచుకుంటారు.

తోబుట్టువులు.. వీరితో సన్నిహితంగా ఉండేలా చేయాలి. అది వారిని అంతర్ముఖులుగా కాకుండా కాపాడుతుంది. దుస్తుల ఎంపికలో కొంత స్వేచ్ఛనివ్వాలి. ముఖ్యంగా మనసులోని ఏ విషయాన్నైనా  అమ్మతో పంచుకునేలా స్నేహభావాన్ని పెంపొందించుకోవాలి. అమ్మ మొదటి స్నేహితురాలైతే ప్రతి అంశాన్నీ తనతోనే పంచుకోవడానికి అమ్మాయి ఆసక్తి చూపుతుంది. ఎక్కువ సందేహాలొచ్చే వయసు కాబట్టి, వారి ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా, సున్నితంగా సమాధానం చెప్పాలి. వారితో ఎంత ఎక్కువగా మాట్లాడితే తల్లితో అంత అనుబంధం ఏర్పడుతుంది. 

నెలసరి గురించి.. యుక్తవయసులో ప్రతి అమ్మాయీ ఎదుర్కొనే విషయం ఇది. కొత్తలో కొంత ఆందోళన, ఒత్తిడికి గురిచేసే ఈ విషయాన్ని  అమ్మ పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడాలి. దాని గురించి అవగాహన కలిగించాలి. ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత వంటివన్నీ ఇంటిలోనే తెలుసుకుంటే మరీ మంచిది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ వినియోగాన్ని ఓ కంట కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ప్రత్యేక గదుల సంప్రదాయం వచ్చినప్పటి నుంచి పిల్లలు తెలియకుండానే ప్రమాదపుటంచుల్లోకి జారిపోతున్నారు. వారితో ఎక్కువగా కలిసి ఉంటూ ఆన్‌లైన్‌లో ఏది ప్రమాదకరమైందో అవగాహన కలిగించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్