మీ మాట లెక్కచేయడం లేదా..

కళ కూతురికి అయిదేళ్లు. ఏది చెప్పినా గట్టిగా అరుస్తూ పారిపోతుంది. మాట వినదు. ఇంటికెవరైనా వస్తే తన అల్లరి రెట్టింపు అవుతుంది. క్రమశిక్షణతో పెంచడంలేదంటూ బంధువులు, స్నేహితులు అంటుంటే కళకు బాధేస్తుంటుంది.

Published : 31 May 2022 00:53 IST

కళ కూతురికి అయిదేళ్లు. ఏది చెప్పినా గట్టిగా అరుస్తూ పారిపోతుంది. మాట వినదు. ఇంటికెవరైనా వస్తే తన అల్లరి రెట్టింపు అవుతుంది. క్రమశిక్షణతో పెంచడంలేదంటూ బంధువులు, స్నేహితులు అంటుంటే కళకు బాధేస్తుంటుంది. ఇలాంటి పిల్లల్లో మార్పు తెచ్చేందుకు నిపుణులు ఏం చెబుతున్నారంటే...

పిల్లలు ఎదిగేకొద్ది వారి ప్రవర్తనలో మార్పులొస్తాయి. కొందరిలో తక్కువ, మరికొందరిలో ఎక్కువగా ఈ మార్పు కనిపిస్తుంది. ఈ వయసులో పిల్లలకు తప్పొప్పుల తేడా తెలీదు. అది అమ్మానాన్నలే ఓపిగ్గా నేర్పించాలి. ఇల్లంతా పరుగులు పెడుతూ గట్టిగా అరుస్తూ అల్లరి చేస్తూ పిల్లలు ఉత్సాహంగా తిరుగుతుంటారు. సామాన్లు కింద పడేయడం, తోటి పిల్లలను కొట్టడం, మధ్యలో వచ్చిన వారిని తోసేయడం వంటివి చేస్తుంటారు. వీటికి ఫలానా కారణమంటూ ఉండదు. వారికిష్టమైనవి తిరిగి మళ్లీ మళ్లీ చేస్తారు. ఈ పరిస్థితి పెద్దవాళ్లకు ఓ ఛాలెంజ్‌లాంటిది. ఇటువంటి పరిస్థితుల్లో కోప్పడటం కన్నా, మెల్లగా మార్చడానికి ప్రయత్నించడమే మేలు. క్రమేపీ వారి ఏకాగ్రతను మరలించడానికి రకరకాల ఆటలు ఆడించడం, బొమ్మలు వేయించడం, కథలు చెప్పడం వంటివి చేస్తే వారి దిశ మారుతుంది.

వినేలా.. అమ్మానాన్న చెప్పేది వినేలా వాళ్లకు అలవాటు చేయాలంటే వారిని అప్పుడప్పుడు ఒకచోట స్థిరంగా కూర్చోబెట్టి మాటల్లో పెట్టాలి. మృదువుగా, ప్రేమగా వారిని దగ్గరకు తీసుకొని చిన్నచిన్న పిట్టకథలు చెప్పాలి. వారికి తమ చిన్నప్పటి విశేషాలను వివరించాలి. నీలా ఉన్నప్పుడు నేను అమ్మ చెప్పిన మాట వినేదాన్ని అంటూ చెప్పే మాటలు వారి మనసులోకి వెళతాయి. చెప్పేది కూర్చొని వినే అలవాటు క్రమేపీ వస్తుంది. వారు చెప్పేది వినడంలేదంటే ఆ లోపం పెద్దవాళ్లదే. నిత్యం బిజీగా ఉండే వాళ్లతో వారు మానసికంగా స్నేహం చేయడానికి ఇష్టపడరు. వారిని పట్టించుకోవడం, ఎక్కువగా మాట్లాడటం, భోజనం కలిసి చేయడం, వారితో కలిసి ఆడుకోవడం వంటివే తల్లిదండ్రులను పిల్లలకు మరింత దగ్గర చేస్తాయి. అప్పుడే ప్రతి చిన్న విషయాన్నీ వారు వినడానికి సిద్ధపడతారు.

వారి స్థాయికి.. మాట వినని పిల్లలతో వారి స్థాయికి తల్లిదండ్రులు దిగాలి. పిల్లల్లా మారి వారితో కలిసి అల్లరి చేయడానికి సిద్ధమవ్వాలి. అంతే వారికి స్నేహితులు దొరికినట్లు భావిస్తారు. అదే స్నేహంతో వారికి దగ్గరై ప్రతి విషయాన్నీ మెల్లగా వారికి చేరవేయాలి. మాట్లాడేటప్పుడు ఎదుటివారి కళ్లవైపు చూసేలా అలవరచాలి. ఇది వారికి ఎదుటివారితో ఎలా మాట్లాడాలో నేర్పుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపట్ల కోపాన్ని ప్రదర్శించకపోవడం మంచిది. సున్నితంగా, ప్రేమగానే పిల్లల ప్రవర్తనలో మార్పు తేవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్