అత్యాశలు వద్దట!

ప్రపంచవ్యాప్తంగా విడాకులు తీసుకునే జంటలు నానాటికీ ఎక్కువవుతున్నట్టుగా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.. విడిపోకున్నా గంటకో పోట్లాట రోజుకో యుద్ధంగా గడిపేవారూ తక్కువేమీ కాదు. ఎందుకిలా అంటే అలవాట్లు కలవక పోవడం, వ్యసనాలు లాంటి అనేక అంశాలున్నా ముఖ్యమైన

Updated : 26 Jun 2022 04:51 IST

ప్రపంచవ్యాప్తంగా విడాకులు తీసుకునే జంటలు నానాటికీ ఎక్కువవుతున్నట్టుగా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.. విడిపోకున్నా గంటకో పోట్లాట రోజుకో యుద్ధంగా గడిపేవారూ తక్కువేమీ కాదు. ఎందుకిలా అంటే అలవాట్లు కలవక పోవడం, వ్యసనాలు లాంటి అనేక అంశాలున్నా ముఖ్యమైన కారణం అవతలి వ్యక్తి నుంచి ఎక్కువగా ఆశించడం అంటున్నారు మానసిక విశ్లేషకులు. ఈ నేపథ్యంలో దంపతులు అన్యోన్యంగా ఉండేందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు.

* భాగస్వామి ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ కొన్ని ఊహలు చేయడం తప్పేం కాదు. కానీ పిండి కొద్దీ రొట్టె, చెట్టు కొద్దీ గాలి అన్న నానుడి మర్చిపోకూడదు. ఇతరులతో పోల్చి వాళ్ల శక్తికి మించి ఆశించి, అవి సాధ్యం కాలేదని బాధపడటం లేదా గొడవకు దిగడం సమంజసం కాదు. వారి వల్ల కానివాటి గురించి ఆలోచించడమే మానేయాలి. అప్పుడే ఇద్దరికీ సుఖ శాంతులుంటాయి.

* భాగస్వామి తన శక్తికి మించినవీ లేదా అసాధ్యమైనవి కోరుతున్నప్పుడు అవతలి వ్యక్తిలో నిస్సహాయత చోటుచేసుకుంటుంది. అలాంటప్పుడు నిజం చెబితే గొడవలు వస్తాయని అబద్ధాలు అలవాటవుతాయి. ఇక నిజాయతీ కాస్తా అటకెక్కేస్తుంది.

* తనకు వజ్రపు ఉంగరం ఇవ్వలేదని భార్య అలగడమో కోపం తెచ్చుకోవడమో కంటే ‘నీ చేతిలో చెయ్యేసి కబుర్లు చెప్పుకోవడం కంటే ఏదీ విలువైంది కాదు’ అంటే ఎంత రొమాంటిగ్గా ఉంటుంది! పంచభక్ష్య పరమాన్నాలు చేయలేక పోయిందని భర్త సణిగే బదులు ‘నీతో కలిసి పెరుగన్నం తిన్నా పరవశంగానే ఉంటుంది’ అంటే లైలా మజ్నూల ప్రేమను తలపించదూ?!

* లోకంలో ఏ ఒక్కరూ నూటికి నూరు శాతం నిర్దుష్టంగా ఉండరు. మనలోనూ అనేక లోపాలుంటాయి. ఆ సంగతి గ్రహించి గుర్తుంచుకుంటే భాగస్వామిలో లోపాలు లేదా బలహీనతలను అర్థం చేసుకుని ఆత్మీయంగా మెలగొచ్చు. అలా కాదని మాటిమాటికీ ఎత్తిచూపుతూ అవమానిస్తుంటే కలహాల కాపురంగా మారుతుంది.

* మీరు ఒకటి చెబితే భాగస్వామి మరోలా చేసి ఉంటే తొందరపడి గొడవ చేయొద్దు. ముందు ఆ వ్యక్తి చెప్పేది వినండి, కారణమేంటో తెలుసుకోండి. సమభావంతో నడుచుకుంటే సంసారంలో సరిగమలు పలుకుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్