మర్యాద నేర్పాలి..

బిందు పిల్లలను తీసుకొని స్నేహితులు, బంధువులింటికి వెళ్లాలంటే భయపడుతుంది. అక్కడ చిన్నాపెద్దా తేడా లేకుండా వేళాకోళం చేసే తన పిల్లలనెలా ఆపాలో తెలియక సతమతమవుతుంది. ఈ అలవాటు మాన్పకపోతే పెద్దయ్యాక వారి దగ్గరకు ఎవరూ రారని హెచ్చరిస్తున్నారు నిపుణులు...

Updated : 06 Aug 2022 07:27 IST

బిందు పిల్లలను తీసుకొని స్నేహితులు, బంధువులింటికి వెళ్లాలంటే భయపడుతుంది. అక్కడ చిన్నాపెద్దా తేడా లేకుండా వేళాకోళం చేసే తన పిల్లలనెలా ఆపాలో తెలియక సతమతమవుతుంది. ఈ అలవాటు మాన్పకపోతే పెద్దయ్యాక వారి దగ్గరకు ఎవరూ రారని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఇంటి నుంచే పిల్లలు తెలుసుకోవాల్సిన అంశమేంటంటే ఇతరులతో మర్యాదగా ప్రవర్తించడం. పెద్దవాళ్లు పక్కింటి వారిని లేదా బంధువులపట్ల వ్యవహరించే పద్ధతినే పిల్లలు కూడా అనుసరిస్తారు. వారెదుటే ఇతరులను తక్కువగా మాట్లాడటం, అందరినీ విమర్శించడం వంటివి చేస్తే వాటినే చిన్నారులు నేర్చుకుంటారు. అలాగే ప్రవర్తిస్తారు. అవతలి వారు తమకన్నా తక్కువ అనే భావాన్ని మనసులో నింపుకొంటారు. దీంతో అవతలి వారిని మాటలతో అవమానించడం, మర్యాద ఇవ్వకపోవడం వంటివి చేస్తారు. ఇరుగుపొరుగుకి తల్లిదండ్రులు విలువనివ్వడం, అందరిపట్ల మర్యాదగా నడుచుకోవడం చేస్తే పిల్లలూ దాన్ని అనుసరిస్తారు.

విమర్శించకుండా..

బంధువులెవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్లు వారిపట్ల మర్యాదగా ఉండి, తర్వాత వారి వెనుక తక్కువగా మాట్లాడకూడదు. ఈ ధోరణిని పిల్లలూ నేర్చుకునే ప్రమాదం ఉంది. ఎదుట ఉన్నా, లేకపోయినా తల్లిదండ్రులు వారి గురించి మర్యాదగా మాట్లాడితే దాన్నే పిల్లలు అనుసరిస్తారు. అలాగే ఇంట్లో వృద్ధులకు అమ్మానాన్నలెలా మర్యాద, ప్రేమను పంచుతారో చిన్నారులు గమనిస్తుంటారు. పెద్దవాళ్ల ప్రవర్తన ఎలా ఉంటే దాన్నే వాళ్లు సరైనదని భావిస్తారు. అలా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యకు గౌరవ, మర్యాదలివ్వడం నేర్చుకుంటారు. బయటివారితో కూడా అలాగే ప్రవర్తిస్తారు.

కృతజ్ఞతలు..

ఇంట్లో లేదా బయట ఎవరినుంచైనా చిన్న సాయాన్ని పొందినా కూడా.. కృతజ్ఞతలు చెప్పాలని పిల్లలకు అలవాటు చేయాలి. ఇతరులకు చెప్పే కృతజ్ఞత వారికిచ్చే మర్యాద అని తెలియజెప్పాలి. అలాగే తనవల్ల ఏదైనా చిన్న పొరపాటు జరిగినా వెంటనే క్షమించమని అడగడం మర్యాదపూర్వకమైందని నేర్పించాలి. పిల్లలకు చెప్పడమే కాదు, వీటన్నింటినీ పెద్దవాళ్లూ పాటించాల్సిందే. అప్పుడే ఏది సరైనదో చూసి చిన్నారులు నేర్చుకుంటారు. అంతే కాదు, నలుగురి మధ్య ఏదైనా సంభాషణ జరుగుతున్నప్పుడు వారిని పూర్తిగా మాట్లాడనిచ్చిన తర్వాతే తమ అభిప్రాయం చెప్పాలనే నియమం పిల్లలకు బాల్యం నుంచే అలవరచాలి. అది కూడా ఇతరులకిచ్చే మర్యాద అని తెలియజేస్తే చాలు. భవిష్యత్తులో వారు ప్రతి ఒక్కరిపట్ల మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులుగా రూపుదిద్దుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్