కొత్త బంధంలోకి..

నిషితకు భర్త చనిపోయేటప్పటికి మూడేళ్ల కూతురుంది. రెండేళ్ల తర్వాత తన జీవితంలోకి భర్తగా అడుగుపెడుతున్న రమేశ్‌కు పాప దగ్గరవుతుందో లేదో అనే ఆలోచన నిషితకు మొదలైంది. ఇలా కొత్త బంధాన్ని పిల్లలు అంగీకరిస్తారా లేదా

Published : 25 Sep 2022 02:22 IST

నిషితకు భర్త చనిపోయేటప్పటికి మూడేళ్ల కూతురుంది. రెండేళ్ల తర్వాత తన జీవితంలోకి భర్తగా అడుగుపెడుతున్న రమేశ్‌కు పాప దగ్గరవుతుందో లేదో అనే ఆలోచన నిషితకు మొదలైంది. ఇలా కొత్త బంధాన్ని పిల్లలు అంగీకరిస్తారా లేదా గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందంటున్నారు నిపుణులు. 

ప్రేమ లేదా వైవాహిక బంధం దురదృష్టవశాత్తూ ఒక్కోసారి విఫలం అవుతుంటుంది. రెండోసారి బంధంలో ప్రవేశించే ముందు పిల్లల మానసిక స్థితిని గుర్తించాలి. వారి అభిప్రాయానికి విలువనివ్వాలి. కొత్తగా తల్లి లేదా తండ్రిగా వస్తున్న వారిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. కాబోయే జీవిత భాగస్వామికి పిల్లలను ప్రేమించేతత్వం ఉందో లేదో గుర్తించాలి. లేదంటే పిల్లలపై అవతలివారి వేధింపులు ఉండొచ్చు. వీటిని చిన్నారులు బయటికి చెప్పలేక, ఎవరితోనూ.. పంచుకోలేక తీవ్ర వేదనకు గురవుతారు. చదువులో వెనకబడతారు. జీవితంలో ఎవరిని ప్రేమించాలన్నా.. భయపడే స్థాయికి చేరుకుంటారు. 

మారడానికి..

ఒక బంధంలోంచి మరొక బంధంలోకి అడుగుపెట్టడానికి పిల్లలకు కొంత సమయం కావాల్సి ఉంటుంది. వారికి అనుమానాలెన్నో తలెత్తుతాయి. అవతలి వ్యక్తి తమను దగ్గరకు తీసుకుంటారో లేదో అనే సంశయం ఉంటుంది. చిన్నారుల మనసును తెలుసుకోవడానికి, వారి భయాలను పోగొట్టడానికి ప్రయత్నించాలి. కాబోయే భార్యాభర్తలిద్దరూ వారితో మాట్లాడి, తామున్నామనే భరోసా అందించాలి. అవతలి వ్యక్తి చేయి పట్టుకొని ధైర్యంగా అడుగు ముందుకేయొచ్చు అనే ఆలోచన వారికి వచ్చేలా ప్రేమను పంచగలిగితే పిల్లలకు నమ్మకం వస్తుంది. 

ద్వేషం..

చిన్నారుల మానసిక స్థితిని అంచనా వేయలేకపోతే, వారి మనసులోని ప్రేమ కూడా ద్వేషంగా మారే ప్రమాదం ఉంది. దీంతో తల్లి లేదా తండ్రీబిడ్డల బంధం బీటలువారుతుంది. మరో వ్యక్తిని అమ్మ లేదా నాన్న స్థానంలో ఊహించుకోవాలంటే కొంత సమయం అవసరం. ఆ పాత బంధం నుంచి దూరం కాలేరు. మరవలేక బాధపడుతుంటారు. ఆ పరిస్థితి ఉంటే మానసికంగా వారిని బయటకు తేవడానికి కృషి చేయాలి. పాత బంధం దూరమవడానికి కారణాన్ని చిన్నారులెదుట దాచకుండా ఉన్నదున్నట్లు అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే పిల్లలు సొంత అభిప్రాయానికొస్తారు. ఇలాంటి సమయంలో ఆచితూచి అడుగేయకపోతే, పిల్లల భవిష్యత్తుపై ఇవన్నీ తీవ్రప్రభావం చూపుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్