ఆ పిల్లల్నీ.. బడి బాట పట్టిస్తోంది!

శారీరక, మానసిక వైకల్యం ఉన్న పిల్లల్ని చేర్చుకోవడానికి చాలా పాఠశాలలు సందేహిస్తాయి. అందరూ ఇలాగే ఆలోచిస్తే.. మరి వాళ్ల భవిష్యత్‌ ఎలా? ఈ ప్రశ్న దీపమాలను వెంటాడింది. సమాధానంగా ఆ పిల్లలను తను తీర్చిదిద్దడమే కాదు...

Published : 02 Oct 2022 00:12 IST

శారీరక, మానసిక వైకల్యం ఉన్న పిల్లల్ని చేర్చుకోవడానికి చాలా పాఠశాలలు సందేహిస్తాయి. అందరూ ఇలాగే ఆలోచిస్తే.. మరి వాళ్ల భవిష్యత్‌ ఎలా? ఈ ప్రశ్న దీపమాలను వెంటాడింది. సమాధానంగా ఆ పిల్లలను తను తీర్చిదిద్దడమే కాదు... ఒకదీపం వేల దీపాల్ని వెలిగించగలదన్నట్టు... ఆ క్రతువులో వందల ఉపాధ్యాయుల్ని భాగస్వాముల్ని చేసింది.

దీపమాల పాండేకి చిన్నప్పటి నుంచీ ఉపాధ్యాయురాలు అవ్వాలని కోరిక. ఎక్కువ సమయం పిల్లలతో గడపొచ్చు, వాళ్లని తీర్చిదిద్దితే సమాజానికీ మేలని ఆమె భావన. అందుకే కష్టపడి 2009లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలైంది. ఈమెది ఉత్తర్‌ప్రదేశ్‌. తనకు పోస్టింగ్‌ కూడా వెనుకబడిన ప్రాంతాల్లోనే పడేది. వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపడమూ సమాజ సేవే అని భావించేది. ఈమె ప్రైమరీ టీచర్‌. పై తరగతుల్లో సులువుగా ముందుకు సాగాలంటే చిన్న తరగతుల్లో పునాది బాగా ఉండాలని ఓపిగ్గా బోధించేది. అదే ఆమెకు 2015లో బరేలీ ప్రైమరీ స్కూల్‌ ప్రిన్సిపల్‌ హోదాను తెచ్చిపెట్టింది. 2018లో తన జీవితం కొత్త మలుపు తిరిగింది.

‘ప్రిన్సిపల్‌గా అప్పటికే మూడేళ్లు చేశా. మా స్కూల్లో అన్‌మోల్‌ అని ఒక బాబు చేరాడు. వాడికి కాస్త బుద్ధిమాంద్యం. ఇతరులతో కలిసే వాడు కాదు, త్వరగా నేర్చుకోలేక పోయేవాడు. వాడు బోధనపై నా దృక్పథాన్ని సమూలంగా మార్చాడు. పిల్లలకు అవసరమైన రీతిలో నేర్పుతూ వెళ్లాలని వాడి ద్వారానే తెలుసుకున్నా. తన కోసం ప్రత్యేకంగా పాఠాలు బోధించేదాన్ని. కొన్నిరోజులు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. నెమ్మదిగా ఇతర పిల్లలతో అలవాటయ్యేలా చేశా. మొదట్లో కష్టంగా ఉండేది. కమ్యూనికేషన్‌ కూడా ఇబ్బందయ్యేది. త్వరగానే తనలో మార్పు వచ్చింది. ఇప్పుడు తనకేం కావాలో చెప్పగలడు, మొబైల్‌ కూడా వాడగలడు. ప్రభుత్వ ఉపకారవేతనాన్నీ అందుకున్నాడు. నాలుగేళ్లలో మా విజయమిది. ఇలాంటి పిల్లలెందరో ఇప్పుడు మా విద్యార్థులు. అన్‌మోల్‌ను చూశాక ఇలాంటి పిల్లల్ని చేర్చుకోవడానికి ఇష్టపడని పాఠశాలలే ఎక్కువని అర్థమైంది. అందుకే కొందరు టీచర్లతో వాట్సాప్‌ గ్రూపుని తయారుచేశా. వీళ్లనీ స్కూళ్లలో చేర్చేలా చేయడంతోపాటు బోధనా పద్ధతుల గురించీ దానిలో పంచుకునేదాన్ని. మిగతా వాళ్లూ సలహాలిచ్చేవారు. మేమంతా కలిసి ఇతర పాఠశాలల ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేవాళ్లం. ఇప్పుడు మా గ్రూపు సభ్యుల సంఖ్య 400కి చేరింది. 800కుపైగా వికలాంగ పిల్లల్ని బడి బాట పట్టించగలిగాం’ అని ఆనందంగా చెబుతుంది 35 ఏళ్ల దీపమాల. కొవిడ్‌లోనూ బోధనను కొనసాగించింది. ప్రతి పిల్లాడికీ చదువుకునే హక్కు ఉంది. వాళ్లకు తగ్గట్టుగా నేర్పాల్సిన బాధ్యత టీచర్లదే. అందరూ ఇది అర్థం చేసుకుంటే ఏ ఒక్కరూ బడికి దూరమవరు అంటోంది దీపమాల. అభినందించాల్సిందే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్