మర్యాద తెలియాలి..

నిత్య కూతురు పది, కొడుకు 9వ తరగతి చదువుతున్నారు. చదువుల్లో బానే ఉంటారు. కానీ ఇంటికెవరొచ్చినా.. నిత్య అమర్యాదగా ప్రవర్తిస్తుంది. ఇక కొడుకు రాహుల్‌ ఎదుటి వారిని ఎప్పుడూ విమర్శించడానికే ప్రయత్నిస్తుంటాడు.

Published : 02 Oct 2022 00:12 IST

నిత్య కూతురు పది, కొడుకు 9వ తరగతి చదువుతున్నారు. చదువుల్లో బానే ఉంటారు. కానీ ఇంటికెవరొచ్చినా.. నిత్య అమర్యాదగా ప్రవర్తిస్తుంది. ఇక కొడుకు రాహుల్‌ ఎదుటి వారిని ఎప్పుడూ విమర్శించడానికే ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి అలవాట్లు పిల్లల వ్యక్తిత్వాన్ని పాడు చేసి, వారి భవిష్యత్తును దెబ్బ తీస్తాయి. అందుకే చిన్నప్పటి నుంచి మంచీ మర్యాదా నేర్పాలంటున్నారు నిపుణులు.

పిల్లలకు మొదటి పాఠశాల ఇల్లు. అమ్మానాన్నలే తొలి ఉపాధ్యాయులు. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు ఎదుటివారికి గౌరవ మర్యాదలివ్వడం, క్రమశిక్షణగా ప్రవర్తించడం వంటి జీవన నైపుణ్యాలనూ పిల్లలకు నేర్పించాలి. లేదంటే అమ్మానాన్నలనే కాదు, బయటి వారిని కూడా గౌరవించడమెలాగో తెలుసుకోలేరు. దీంతో కొన్ని సందర్భాల్లో మానవసంబంధాలనూ గౌరవించని స్థాయికి చేరుకుంటారు. ఇవన్నీ వారిని మంచి వ్యక్తులుగా ఎదగనివ్వవు. తల్లిదండ్రులను గౌరవించని వ్యక్తి వారి జీవితంలోకి వచ్చే భాగస్వామికి కూడా విలువనివ్వరు. దాంతో కుటుంబ జీవితం సమస్యాత్మకంగా మారుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే బాల్యంలోనే ఇతరులను గౌరవించడం, సమాన భావంతో చూడటం వంటి విషయాలను నేర్పిస్తేనే, గౌరవించడం తెలుస్తుంది.

బంధంలోనే..
తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమనిస్తూనే, మర్యాదనూ నేర్పించాలి. బంధంలోనే మర్యాద ఇమిడి ఉంటుందని తెలియజేసేలా చేయాలి. అమ్మానాన్న, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు... ఇలా ప్రతి బంధానికీ విలువ ఉంటుందని పెద్ద వాళ్లు తమ ప్రవర్తన ద్వారా చూపాలి. అదీ ప్రయోగాత్మకంగా పిల్లల మనసుకు హత్తుకునేలా చేయాలి. తల్లిదండ్రులు ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవాన్ని చిన్నారులు పాఠంగా తీసుకుంటారు. ఇంటికి వచ్చిన వారిపట్ల గౌరవభావంతో ఉండే అమ్మానాన్నలను చూసి పిల్లలూ అదే మార్గాన్ని అనుసరిస్తారు. అలాకాక అమ్మానాన్నలెప్పుడూ ఒకరినొకరు అవమానించుకుంటూ, వాళ్ల పెద్దలను చెడుగా మాట్లాడటం, అతిథులకు గౌరవం ఇవ్వకుండా ఉంటే పిల్లలూ అవే నేర్చుకుంటారు. తల్లిదండ్రులను గౌరవించడం చిన్నారులకు తెలియాలంటే వాళ్లెదుట పెద్దవాళ్ల ప్రవర్తన బాగుండాలి. అప్పుడే వారికి ఏది తప్పు, ఏది సరైనదో తెలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్