స్నేహితులైనా.. పంచుకోవద్దు

స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు. అందుకే ప్రతి చిన్న విషయాన్నీ పంచుకుంటుంటారు. అలాగని భార్యాభర్తల అనుబంధాన్నీ చేర్చ వద్దంటున్నారు నిపుణులు.

Published : 12 Oct 2022 00:33 IST

స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు. అందుకే ప్రతి చిన్న విషయాన్నీ పంచుకుంటుంటారు. అలాగని భార్యాభర్తల అనుబంధాన్నీ చేర్చ వద్దంటున్నారు నిపుణులు. వారి మధ్య విషయాల్ని చర్చించకపోవడమే మంచిదంటున్నారు ఎందుకంటే..

* ఆయనతో చిన్న గొడవ పెట్టుకుంటాం. లేదూ అనవసరంగా ఓ మాట పడ్డాం. బాధ పంచుకుందామనో బరువు దించుకుందామనో మనసులోదంతా చెప్పేసుకుంటాం. మీ బాధ విని అవతలివాళ్లూ మీ తరఫున మాట్లాడుతుంటారు. అప్పటికి మనకు బాగానే ఉంటుంది కానీ.. గమనించారా.. అది మీ స్నేహితుల్లో మీవారిపై నెగెటివ్‌ అభిప్రాయాన్ని ఏర్పరచగలదు. ఏదైనా సందర్భంలో వాళ్లు దాని ఆధారంగా మాట్లాడితే ఎంత ఇబ్బంది?

* లోపాలనేవి ఎవరికైనా ఉంటాయి. అందరూ అందరికీ నచ్చాలనేం లేదు.. అలవాట్లూ అంతే! బయట దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినా.. ఇంట్లోకి వచ్చేసరికి నచ్చినట్లుగా ఉంటారు. ఆ అలవాట్లు మీకు ఇబ్బందిగా ఉంటే తనతోనే చర్చించండి. తనకు హాని చేసేవైతే మాన్పించండి. లేదంటే సర్దుకుపోయే ప్రయత్నాలు చేయండి. అంతేకానీ అవి మీకెంత విసుగు కలిగిస్తున్నాయో చెబితే వాళ్ల ముందు తన పరువు పోదూ? అది తన స్వేచ్ఛకు భంగం కూడా.

* సన్నిహిత విషయాలు, సంభాషణలు మీకే ప్రత్యేకం. వాటిని ఎంతటి దగ్గరివారైనా పంచుకోవద్దు. మీ భాగస్వామికి అవమానంగా తోయడమే కాదు.. మీపై నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామితో ఏదైనా సమస్య ఉన్నా నేరుగా తనతోనే మాట్లాడండి. అనునయంగా మాట్లాడితే ఏ సమస్య అయినా సులువుగా పరిష్కారమవుతుంది. ప్రతిదానికీ బయటివారి సలహాలు కోరడం, ఇతరులను మధ్యలోకి తీసుకురావడం వంటివి చేస్తే ఒకరిపై ఒకరికి నమ్మకం పోవడమే కాదు.. ఇతరులకీ చులకన అవుతారు. మరిన్ని గొడవలకూ కారణమవొచ్చు. ఎవరికివారు ప్రత్యేకం. బంధాలకూ ఈ మాట వర్తిస్తుంది. ఎదుటివారిని చూపి వాళ్లని అనుసరించమనడం, అలా లేనందుకు నిందించడం వంటివీ చేయొద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్