ఆ వయసుకు ముందే నేర్పాలి..

సుకన్య కూతురికి నెలసరి మొదలైనప్పుడు పరిశుభ్రత గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే, ఇబ్బందిపడింది. అందుకే యుక్తవయసుకు రాక మునుపే వ్యక్తిగత పరిశుభ్రతపై పిల్లలకు అవగాహన కలిగిస్తే మంచిదంటున్నారు నిపుణులు.

Published : 14 Oct 2022 00:48 IST

సుకన్య కూతురికి నెలసరి మొదలైనప్పుడు పరిశుభ్రత గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే, ఇబ్బందిపడింది. అందుకే యుక్తవయసుకు రాక మునుపే వ్యక్తిగత పరిశుభ్రతపై పిల్లలకు అవగాహన కలిగిస్తే మంచిదంటున్నారు నిపుణులు.

పిల్లలకు చిన్నప్పటి నుంచి శుభ్రత అలవరచాలి. ఆడపిల్లలకు ముఖ్యంగా యుక్త వయసులోకి అడుగుపెట్టకముందు నుంచే మిగతా నైపుణ్యాలతోపాటు పరిశుభ్రతను పాటించడం కూడా నేర్పాలి. అది వారికి నెలసరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిసేలా చేస్తుంది. పెద్దవుతున్నకొద్దీ ఇటువంటి అంశాలు చర్చిస్తే, ఇబ్బందికరం, అసౌకర్యంగా భావించొచ్చు. చిన్నతనం నుంచే వీటి గురించి వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తే సరైన సమయం వచ్చేసరికి వారు ఈ అంశంపట్ల అవగాహన పొందుతారు. నెలసరిలో పరిశుభ్రత పాటించకపోతే కలిగే అనారోగ్యాల గురించి ముందుగానే పిల్లలకు చెప్పాలి. వాళ్లతో చిన్నప్పటి నుంచే ఈ విషయాలెందుకు మాట్లాడాలనుకోవడం సరి కాదు. సరైన సమయంలో కావాల్సిన విజ్ఞానాన్ని అందించకపోతే, పిల్లలు భవిష్యత్తులో ఇబ్బందులెదుర్కొంటారు.

స్ఫూర్తిగా.. ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకోవడమెలాగో అమ్మానాన్నలను చూసి పిల్లలు నేర్చుకుంటారు. వాళ్లనే అనుసరిస్తారు. పిల్లలెదుట తల్లిదండ్రులు స్ఫూర్తిదాయకంగా ఉంటూనే, శుభ్రత పాటించే విధానాలనూ.. నేర్పాలి. ఆడపిల్లలకు యుక్తవయసులో ప్రకృతి పరంగా వచ్చే నెలసరి, శారీరక మార్పుల గురించి ముందుగానే అవగాహన కలిగించాలి.

ఆ సమయంలో కలిగే అసౌకర్యం, ఆందోళన వంటి అంశాలపై చర్చించాలి. రోజూ కనీసం ఒకసారైనా పిల్లలెదుట ఈ చర్చ వస్తేనే, క్రమేపీ పిల్లలు వాటి గురించి తెలుసుకుంటారు. పరిశుభ్రంగా ఉండటం కోసం తానేం జాగ్రత్తలు తీసుకుంటానో తల్లి వివరించడం పిల్లలకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. వాటిని పాటించడానికి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉంటారు.

సందేహాలు.. ఇటువంటి అంశాలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలకెన్నో సందేహాలు తలెత్తుతాయి. వారికి ప్రశ్నించే స్వేచ్ఛనివ్వాలి. వాటన్నింటికీ సున్నితంగా సమాధానాలు చెప్పాలి. యుక్తవయసులోకి అడుగుపెట్టేటప్పుడు ఎదుర్కొన్న సమస్యలను, వాటినెలా పరిష్కరించుకున్నారో వివరంగా తల్లి చెప్పాలి. అప్పుడే వారికి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. సమయం వచ్చినప్పుడు వారికి చేయూతనిస్తే చాలు. ఒత్తిడి, ఆందోళన లేకుండా పిల్లలు ఆ దశను తేలికగా దాటగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్