పోటీతత్వంతో సమర్థంగా...

పిల్లలన్నాక తినకపోవడం, చదవకపోవడం లాంటి పేచీలు మామూలే. వాటి సంగతలా ఉంచితే నిద్ర లేపడం దగ్గర్నుంచి ఆయా సమయాల్లో  చేయాల్సిన పనులకు మొరాయించారనుకోండి.. ఎంత చిరాగ్గా ఉంటుంది?! అలా కాకూడదంటే టైం మేనేజ్‌మెంట్‌ నేర్పమని, అందుకు కొన్ని సూత్రాలు పాటించమని చెబుతున్నారు నిపుణులు..

Published : 26 Oct 2022 00:21 IST

పిల్లలన్నాక తినకపోవడం, చదవకపోవడం లాంటి పేచీలు మామూలే. వాటి సంగతలా ఉంచితే నిద్ర లేపడం దగ్గర్నుంచి ఆయా సమయాల్లో  చేయాల్సిన పనులకు మొరాయించారనుకోండి.. ఎంత చిరాగ్గా ఉంటుంది?! అలా కాకూడదంటే టైం మేనేజ్‌మెంట్‌ నేర్పమని, అందుకు కొన్ని సూత్రాలు పాటించమని చెబుతున్నారు నిపుణులు..

పిల్లలకు ఏది నేర్పినా చిన్న వయసులోనే నేర్పాలి. లేత మనసులను కష్టపెట్టినట్టవుతుంది, తర్వాత చెప్పొచ్చులే అనుకుంటే ఇక మాట లక్ష్యపెట్టని మొండిఘటాల్లా తయారవుతారు లేదా ఎదురుచెప్పే పెంకి పిల్లల్లా మారతారు.  కనుక అలక్ష్యం కూడదు.

రోజూ చేయాల్సిన పనులకు ఒక కాలపట్టిక తయారుచేయండి. ఈ సమయంలో ఈ పని చేయాలి అంటూ నియంత్రణ ఉంటే ఆ ప్రకారం సాగిపోతుంది.

వాళ్లు చేయాల్సిన పనులను చిన్నచిన్నగా విడగొట్టండి. హోంవర్క్‌ చేసేటప్పుడు అదో బృహత్తర కార్యక్రమంలా అనిపించకుండా సబ్జెక్టుల ప్రకారం విడదీసి ఒకటి అయ్యాక ఇంకోటి చొప్పున చేయమనండి. అలాగే తక్కువ రాయాల్సినవి ముందు కానిస్తే ఇన్ని ఐపోయాయి, ఇంకొన్నే ఉన్నాయనే భావన కలుగుతుంది. మధ్యలో చిన్న విరామాలు తీసుకోమనండి. అప్పుడు భారమనిపించదు, తేలిగ్గా చేసేస్తారు.

ప్రతిదానికీ కొన్ని లక్ష్యాలు పెట్టుకోమనండి. ఇంత సమయంలో పూర్తిచేయాలి.. ఫలానా వాళ్ల కంటే ముందుగా అయిపోవాలి తరహాలో నిర్ణయించుకునేలా, నిర్దేశించుకునేలా చేస్తే.. ఆ పోటీతత్వం వల్ల అనుకున్నది వేగంగా, సమర్థంగా ముగుస్తుంది.

ఎప్పుడూ ఆశావహంగా ఆలోచించేలా ప్రోత్సహించండి. లేదంటే కష్టమైన వ్యవహారంగా, తాను చేయలేని పనిలా అనిపించి నిరాశకు లోనయ్యే అవకాశముంది.

పిల్లలు ఎలా ఉండాలని ఆశిస్తున్నారో ముందుగా మీరు చేసి చూపండి. అప్పుడే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మీ మాట చెలామణి అవుతుంది.

అనుకున్న పని సమయానికి పూర్తిచేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో, ఎంత అభ్యున్నతి సాధించే అవకాశం ఉందో, ఆ క్రమశిక్షణ కొరవడితే ఎంత వెనకబడతారో ఉదాహరణలతో వివరించి చెప్పండి. అప్పుడిక ఒత్తిడి లేకుండా తమంతట తాము వేళకు పనిచేసే క్రమశిక్షణ, బాధ్యత అలవడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్