బంధం బలపడాలంటే

రేవతికి దేనికి కోపం వచ్చినా.. దాన్ని భర్త రాఘవపైనే చూపిస్తుంది. రాఘవ కూడా అంతే. దీంతో ఇరువురి మధ్యా దూరం ఏర్పడుతోంది.

Published : 27 Oct 2022 00:19 IST

రేవతికి దేనికి కోపం వచ్చినా.. దాన్ని భర్త రాఘవపైనే చూపిస్తుంది. రాఘవ కూడా అంతే. దీంతో ఇరువురి మధ్యా దూరం ఏర్పడుతోంది. తెలిసో తెలియకో ఎదుటివారి మనసు గాయపడటానికి తాము కారణమైతే, తమ మధ్య ఆ బంధాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం కూడా ఆ ఆలూమగలదే అంటున్నారు నిపుణులు.

దంపతుల మధ్య చికాకులు, కోపాలు, అలకలు వంటివి సహజమే. అయితే ప్రతిసారీ అప్పటికప్పుడు క్షమాపణలు అడిగి పరిస్థితిని చక్కదిద్దుకోవడం అలవాటైతే ఇది శాశ్వత పరిష్కారం కాదు. నాలుగైదుసార్లు ఇలా సారీ చెప్పినా.. అయిదోసారి భాగస్వామికి నమ్మకం కలగకపోవచ్చు. మంచి అభిప్రాయం దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రతిసారీ ఎందుకిలా జరుగుతోంది. దీనికి కారణమేంటి అని ఆలోచించి, అలా మరోసారి జరగకుండా జాగ్రత్తపడటానికి ప్రయత్నిస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఇరువురూ కాసేపు కూర్చుని ఎందుకిలా చిన్నచిన్న విషయాలకు గొడవపడాల్సిన అవసరమేంటి అని మృదువుగా చర్చించుకోవాలి. దానివల్ల కలిగే చికాకుతో ఎంతో కొంత సంతోషం దూరమవుతుందనే నిజాన్ని ఇరువురూ గుర్తించగలిగితే చాలు. ఒకరిపై మరొకరు అనవసరపు కోపాన్ని ప్రదర్శించాల్సిన సందర్భం రాదు.

మాట్లాడితే..
కారణమేదైనా అవతలివారిపై మనసులోని కోపాన్ని ప్రదర్శించడం కన్నా, వెంటనే దానిగురించి మాట్లాడితే చాలు. కొందరు చిన్నచిన్న విషయాలకే రోజులతరబడి మాట్లాడకుండా భాగస్వామిని బాధిస్తుంటారు. సమస్య ఏంటో అవతలివారికి చెబితేనే పరిష్కారం దొరుకుతుంది. ఇరువురూ మనసువిప్పి మాట్లాడుకుంటే అసలు జరిగిందేంటో తెలుస్తుంది. ఊహలకు తావు లేకుండా నిజాన్ని గుర్తించొచ్చు. అప్పుడు కోపం దూదిపింజలా ఎగిరిపోతుంది. లేదంటే ఎన్ని రోజులైనా ఇరువురి మధ్య నిశ్శబ్దం ఏర్పడి ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతుంది.

నమ్మకం..
ప్రతి అంశంలో అవతలివారికి భాగస్వామిపై కోపం రావడానికి కారణం సరైన నమ్మకం లేకపోవడం కూడా కావొచ్చు. భార్యాభర్తలు ఎదుటివారికి తమపై నమ్మకాన్ని కలిగించడమే కాదు, పూర్తిగా ప్రేమించడం మొదలుపెడితే చాలు. ఇరువురి నడుమ బంధం ఎప్పటికీ బలంగా ఉంటుంది. ఒకరికొకరు ఎక్కువ సమయాన్ని కేటాయించడం, కలిసి సం తోషంగా ఆ రోజు విశేషాలను చెప్పుకోవడం, ఇరువురూ ఎదుటివారిపై బాధ్యతవహించడం, వారి బాధ్యతలను పంచుకోవడం వంటివన్నీ కోపతాపాలను దరికి రానివ్వవు. ఆ సంసారం సంతోషంగా సాగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్