వారెదుట వాదనలొద్దు..

పిల్లలకు మార్కులు తక్కువ వచ్చినప్పుడు కారణం నువ్వే అంటూ సుధీర్‌ తన భార్య సుకన్యను నిందిస్తాడు. తండ్రిగా వారికి భయం చెప్పడంలేదంటూ ఆమె విరుచుకు పడుతుంది. ఇలా అమ్మానాన్నల మధ్య గొడవతో చిన్నారులు తీవ్రంగా ప్రభావితులవుతారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published : 28 Oct 2022 00:34 IST

పిల్లలకు మార్కులు తక్కువ వచ్చినప్పుడు కారణం నువ్వే అంటూ సుధీర్‌ తన భార్య సుకన్యను నిందిస్తాడు. తండ్రిగా వారికి భయం చెప్పడంలేదంటూ ఆమె విరుచుకు పడుతుంది. ఇలా అమ్మానాన్నల మధ్య గొడవతో చిన్నారులు తీవ్రంగా ప్రభావితులవుతారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతి చిన్న విషయానికీ వాదించుకునే దంపతుల పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉండలేరు. స్కూల్‌, చదువు వంటి విషయాలే ఆ చిన్నారుల మెదడుపై ఒత్తిడి కలిగిస్తుంటాయి. దానికితోడు తల్లిదండ్రులు నిత్యం అరుచుకుంటూ, తీవ్రంగా వాదించుకోవడం పిల్లల మనసు గాయపడుతుంది. వారి ఆలోచనలు, అనుభవాలను అమ్మానాన్నలతో పంచు కోవడానికి వెనుకడుగు వేస్తారు. ఇది పిల్లల్లో ఒంటరితనాన్ని నింపుతుంది. క్రమేపీ ఆత్మన్యూనతకు దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు.

తామే ఎక్కువంటూ..

తల్లిదండ్రుల్లో తామే ఎక్కువ, తమకే అన్నీ తెలుసని ఒకరనుకుంటే, తాము చెప్పిందే సరైందంటూ మరొకరు భావించడం... ఈ రెండు పద్ధతుల్లో ఏదీ సరి కాదంటున్నారు నిపుణులు. ఏ ఒక్కరూ సంపూర్ణ వ్యక్తులుగా ఉండటం కుదరదు. చిన్నారులను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత దంపతులిద్దరిదీ అనే విషయాన్ని మరవకుండా, ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోవాలి. ఎదుటివారి లోపాలవల్ల సమస్యలెదురవుతుంటే, దానికి చర్చావేదిక పిల్లలెదుట కాదు. వాళ్లు లేనప్పుడు మాట్లాడుకోవాలి. లేదంటే ఈ ప్రభావంతో చిన్నారుల మనసులో తల్లిదండ్రులపై గౌరవం తగ్గుతుంది. లేదా ఎవరో ఒకరికే తమ మద్దతు ఇవ్వడానికి పిల్లలు అలవడతారు. పెద్దవాళ్ల మాటకు మర్యాదనివ్వడం మానేస్తారు.

అనుబంధం..

రోజూ తల్లిదండ్రులు ఏదో ఒక విషయంపై వాదించుకుంటూ, నిందలు వేసుకుంటుంటే ఈ ప్రభావం పెద్దవాళ్లు, పిల్లల అనుబంధంపైనా పడుతుంది. ఇరువురి నడుమ దూరం పెరుగుతుంది. తమ గురించి కన్నా, వారి భావోద్వేగాలకే విలువనిస్తున్న అమ్మానాన్న అంటే చిన్నారుల హృదయాల్లో కోపం మొదలవుతుంది. ప్రేమరాహిత్యానికి గురై, బయటి వారి అభిమానం కోసం ఎదురుచూస్తారు. అది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండాలి. చిన్నారులు ఏ విషయంలోనైనా వెనుక బడినప్పుడు పెద్ద వాళ్లు దాన్ని ఎదుటివారి తప్పుగా నిందించడం మానేయాలి. సమస్య గుర్తించి పరిష్కరించడానికి కృషి చేయాలి. వీలైనంత ఎక్కువ సమయం వారితో గడపాలి. అప్పుడే వాళ్లకు పెద్దవాళ్లపై ప్రేమ, గౌరవం పెరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్