కొట్టి.. చెబుతున్నారా

తోటి పిల్లల్ని కొడుతున్నాడని కొడుకు రవిపై టీచర్‌ రోజూ ఫిర్యాదు చేస్తోంటే రవళికి భయమేస్తూ ఉంటుంది. కావాల్సింది కొనివ్వకపోతే చేతిలోని వస్తువుతో తనను గాయపరిచే కూతుర్ని ఎలా మార్చాలో తెలియడంలేదు రమ్యకి.

Published : 31 Oct 2022 00:15 IST

తోటి పిల్లల్ని కొడుతున్నాడని కొడుకు రవిపై టీచర్‌ రోజూ ఫిర్యాదు చేస్తోంటే రవళికి భయమేస్తూ ఉంటుంది. కావాల్సింది కొనివ్వకపోతే చేతిలోని వస్తువుతో తనను గాయపరిచే కూతుర్ని ఎలా మార్చాలో తెలియడంలేదు రమ్యకి. పిల్లల్లో ఇలా హింసాత్మక ధోరణి కనిపిస్తే, చిన్నప్పుడే దాన్ని దూరం చేయాలంటున్నారు నిపుణులు.

చిన్నారులకు కోపం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎదుటివారిని గాయపరుస్తుంటారు. వారెదుట పెద్దవాళ్లు లేదా తోటివాళ్లు ఇలా ప్రవర్తించడం చూసినా.. దాన్ని పిల్లలు నేర్చుకుంటారు. సహ విద్యార్థులు లేదా స్నేహితులపై పిల్లలు చేయి చేసుకున్నప్పుడు అందరెదుట తనపై తీవ్ర కోపాన్ని ప్రదర్శించకూడదు. అలాగని వాళ్లెదుట తల్లిదండ్రులు తమను తాము నిందించుకో కూడదు. మా పెంపకం సరిగ్గా లేదేమో అని... ఆత్మనూన్యతగా ప్రవర్తించ కూడదు. ఇలాచేస్తే పిల్లలపై అది మరింత చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. తన ప్రవర్తన సరైనది కాదని సున్నితంగా నచ్చజెప్పి, ఎదుటి వారికి సారీ చెప్పించాలి. వారితో స్నేహం చేయడానికి ప్రయత్నించమని చెప్పాలి.

ఆలోచించి..

పిల్లల ప్రవర్తన గురించి ఆవేశంతో కాకుండా, ప్రశాంతంగా ఆలోచించాలి. వారి మనసులో ఎన్నో ఒత్తిళ్లుంటాయి. దాంతో అనాలోచితంగా అప్పటికప్పుడు అలా ప్రవర్తించే అవకాశం కూడా ఉండొచ్చు. అది శాశ్వతమైన హింసాత్మక ధోరణి కాకపోవచ్చు. ముందుగా ఆ ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని గుర్తించి పరిష్కరించగలగాలి. ఆ తర్వాత కూడా అలానే చేస్తోంటే మాత్రం వారిని ఖండించి, తప్పు అని చెప్పాలి. లేదంటే ఇది అలవాటుగా మారి, కొనసాగించే ప్రమాదం ఉంది.

నైపుణ్యాలు..

భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయినప్పుడు చిన్నారుల్లో ఈ రకమైన ప్రవర్తన కనిపిస్తుంది. తనకు కావాల్సింది దక్కడం లేదనే కోపంతో కూడా హింసాత్మక ధోరణితో సాధించాలనుకుంటారు. వారిని భయపెట్టి ఆ అలవాటును మాన్పించడానికి ప్రయత్నించడం లేదా దండించడం వంటివి చేస్తే ఈ లక్షణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. వాళ్లతో ప్రశాంతంగా మాట్లాడాలి. కోపోద్రేకాలను నియంత్రించుకొనే నైపుణ్యాలను అలవరచాలి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, సహ విద్యార్థులను గౌరవించడం నేర్పాలి. పిల్లలెదుట పెద్దవాళ్లు కూడా ఈ రకమైన ప్రవర్తన ప్రదర్శించకూడదు. ఇంటి సమస్యలను సానుకూల ధోరణిలో పరిష్కరిస్తూ, నిత్యం ప్రశాంతంగా వ్యవహరించే తల్లిదండ్రులే పిల్లలకు గురువులు. వారినే స్ఫూర్తిగా తీసుకొంటారు... అనుసరిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్