పిల్లల్లో ఫ్రస్టేషన్‌..

సుకన్య ఎనిమిదేళ్ల కొడుకు కోరిన బొమ్మను వెంటనే కళ్లెదుట ఉంచకపోతే చాలు. ఆవేశంతో ఇల్లు పీకి పందిరేస్తాడు. కోపంగా తన బొమ్మలను తానే విసిరేస్తాడు. ఇంత రాద్ధాంతానికి కారణమయ్యే అసహనాన్ని తగ్గించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలంటున్నారు నిపుణులు.

Updated : 01 Nov 2022 01:08 IST

సుకన్య ఎనిమిదేళ్ల కొడుకు కోరిన బొమ్మను వెంటనే కళ్లెదుట ఉంచకపోతే చాలు. ఆవేశంతో ఇల్లు పీకి పందిరేస్తాడు. కోపంగా తన బొమ్మలను తానే విసిరేస్తాడు. ఇంత రాద్ధాంతానికి కారణమయ్యే అసహనాన్ని తగ్గించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలంటున్నారు నిపుణులు.

చిన్నారులకు కోరింది వెంటనే చేతికి రావాలనే మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఇచ్చేవరకు పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లు అసహనాన్ని ప్రదర్శిస్తారు. అనుకున్నది దొరకనప్పుడు కోపమెక్కువై దాన్ని ఎదుటి వారిపై చూపించే ప్రమాదం ఉంది. లేదంటే నిరాశలోకి జారిపోతారు. కొన్నిసార్లు కోరింది చేతికందనప్పుడు వారి కోపం దుఃఖంగా మారుతుంది. స్వీయనియంత్రణ కోల్పోతారు. ఎవరేం చెప్పినా వినరు. చిన్నప్పుడే ఈ లక్షణాల్ని నియంత్రించగలగాలి. లేదంటే అది వారితో పాటు పెరిగి పెద్దదవుతుంది.

క్రీడలు.. పిల్లలను క్రీడల్లో ప్రవేశపెడితే ఓటమి, తిరిగి గెలవడానికి ప్రయత్నించడం, ఏకాగ్రత, పట్టుదల వంటివి అలవడతాయి. ఈ నైపుణ్యాలన్నీ వారిలో కావాల్సింది వెంటనే దొరకనప్పుడు అసహనాన్ని తెచ్చుకోకుండా శాంతంగా ఆలోచించడాన్ని నేర్పుతాయి. అందరిలో తామూ ఒకరమనే భావన అలవాటవుతుంది. బృందంతో కలిసి ఆడటం, తన ఆలోచనను ఎదుటివారితో పంచుకోవడం నేర్చుకుంటారు. ఏది సరైనదో తెలుసుకొనే అవగాహన పెరుగుతుంది.

పుస్తక పఠనం.. కథల పుస్తకాలు చదివి వినిపించడం అలవాటు చేస్తే, క్రమేపీ వారికిష్టమైన రచనలను ఎంచుకుంటారు. చదవడం ద్వారా పిల్లల్లో తమని తాము అర్థం చేసుకోవడం మొదలవుతుంది. వారి లోపాలు వారికే తెలుస్తుంటాయి. అసహనం, కోపం, ఎదుటి వారిపై విసుగు ప్రదర్శించడం, అరవడం వంటి పనులన్నీ నెమ్మదిగా మానేస్తారు. పుస్తక పఠనం చిన్నారుల్లో ఎన్నోరకాల జీవన నైపుణ్యాలను అందిస్తుంది.

ప్రోత్సహించొద్దు.. పిల్లల ప్రవర్తనకు భయపడి వారడిగిన ప్రతిదాన్నీ అందిస్తే అక్కడితో వారి డిమాండ్స్‌ ఆగవు. ప్రతి చిన్న విషయానికీ అసహనం పెరుగుతూనే ఉంటుంది. లేదా దాన్ని మరిపించడానికి మరొక అలవాటును అలవరచకూడదు. ఒంటరిగా పెరిగే పిల్లల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. క్రమేపీ వారి మార్గాన్ని మళ్లిస్తూ ఇతరులతో కలిసేలా చేయగలిగితే చాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్