నలుగురిలో చులకన చేయొద్దు!

పిల్లలంతా ఒకేలా ఉండరు. కొందరు చదువుల్లో వెనకబడితే, మరికొందరు... ఇతర విషయాల్లో మందకొడిగా ఉంటారు. అయినంత మాత్రాన ఇతరుల కంటే తీసిపోయినట్లు కాదు.

Updated : 02 Nov 2022 05:13 IST

పిల్లలంతా ఒకేలా ఉండరు. కొందరు చదువుల్లో వెనకబడితే, మరికొందరు... ఇతర విషయాల్లో మందకొడిగా ఉంటారు. అయినంత మాత్రాన ఇతరుల కంటే తీసిపోయినట్లు కాదు. అది ఆత్మన్యూనతకు దారి తీయకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అందుకేం చేయాలంటే..

* తల్లిదండ్రులుగా పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం మంచిదే. కానీ... మీ ఆలోచనల్నీ, ఆశయాల్నీ వారి మీద రుద్దకండి. మీ అంచనాలకు తగ్గట్లు వారు లేకపోతే... అందుకు విమర్శించడం, అందరిలోనూ చులకన చేయడం సరికాదు.  ఇది వాళ్లని ఆత్మన్యూనతకి గురిచేస్తుంది. అలాకాకుండా ముందు పిల్లల ఇష్టాలనూ, వారిని ఇబ్బంది పెట్టే అంశాలనూ తెలుసుకోండి. వారిలో లోపాలకు అవి ఎంత వరకూ కారణమో గమనించండి. వాటిని పరిహరించడానికి కృషి చేయండి. అప్పుడు వారు లక్ష్యాన్ని చేరుకోగలరు.

* ఎప్పుడూ ఇతర పిల్లలతో పోల్చవద్దు. ముఖ్యంగా తోబుట్టువులతో అసలు పోల్చకండి. పోలిక ఆత్మన్యూనతకి దారితీసి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఎవరి వ్యక్తిత్వాలు వారివి, ఎవరి ప్రత్యేకతలు వారివి అన్నది గుర్తుంచుకోండి. వారి వారి తత్వాల ఆధారంగా వారికి లక్ష్యాలు నిర్దేశించండి. 

* మీ భయాల్ని, అనుమానాల్ని పిల్లల ముందు బయటపెట్టకండి. ధైర్యాన్ని నూరి పోస్తూ, సానుకూల అంశాల్ని ప్రస్తావించండి. మీ జీవితంలో జరిగిన సంక్లిష్ట సంఘటనల్ని చెబుతూ వాటినుంచి మీరెలా బయటపడ్డారో.. ఎలా పరిస్థితుల్ని అధిగమించారో వాళ్లకి చెప్పాల్సిందే. అలాగని... అదే పనిగా నీకోసం అది చేశా... ఇది చేశా అనడం వల్ల మీపై ప్రతికూల భావం ఏర్పడే ప్రమాదం ఉంది.

* పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే ప్రశంసించండి. వాళ్లేం సాధించినా మెచ్చుకోండి. చిన్నారులు గెలిచిన బహుమతులను నలుగురికి చూపించి వాళ్ల ముందు గొప్పగా చెప్పండి. ఒక ప్రశంస వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అలానే ఏదైనా ప్రయత్నించి ఓడిపోతే నీకేమీ రాదని తిట్టకండి. ఓటమిని కూడా గెలుపుతో సమానంగా అంగీకరించాలని చెబుతూ వెన్ను తట్టి ప్రోత్సహించండి. ఓటమిని సానుకూల దృక్పథంతో విశ్లేషించుకుని, గెలుపు దిశగా సాగడం ఎలానో నేర్పించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్