స్నేహంతో సంతోషం..

ఆశా జీవితంలో ఆర్థికంగా లోటు లేదు. నిత్యం బిజీబిజీగా గడిపే ఆమె కొన్నిసార్లు నైరాశ్యంలోకి వెళ్లిపోతుంది. మనసులోని మాటను పంచుకోవడానికి కనీసం స్నేహితులు కూడా లేరని బాధ పడుతుంటుంది.

Published : 06 Nov 2022 00:53 IST

ఆశా జీవితంలో ఆర్థికంగా లోటు లేదు. నిత్యం బిజీబిజీగా గడిపే ఆమె కొన్నిసార్లు నైరాశ్యంలోకి వెళ్లిపోతుంది. మనసులోని మాటను పంచుకోవడానికి కనీసం స్నేహితులు కూడా లేరని బాధ పడుతుంటుంది. ఇలా జీవితంలో స్నేహానికి చోటులేకుండా ఉన్నవారి కన్నా, మంచి స్నేహితులున్నవారు నిత్యం సంతోషంగా ఎక్కువ కాలం జీవిస్తారని నిపుణులు చెబుతున్నారు.

స్నేహంలో అన్ని సార్లూ అభిరుచులూ, అభిప్రాయాలు కలవాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఎదుటివారి ఆలోచనలకు విలువనిస్తే చాలు. ఆ స్నేహం కలకాలం నిలుస్తుంది. పరిచయమైనప్పుడు అభిప్రాయాలు కలవడం లేదని దూరంగా ఉంటే, ఎప్పటికీ స్నేహితులు దొరక్కపోవచ్చు. ఎవరి అభిరుచులు వాళ్లవి అనే ఉదార హృదయం ఉండాలి. వాటిని గౌరవించాలి. స్నేహంలో ముఖ్యంగా చూడాల్సింది సానుభూతి. ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు నిస్వార్థంగా సాయం చేయడానికి ముందుకొచ్చే వారిని మంచి స్నేహశీలిగా గుర్తించొచ్చు. ఎదుటివారి బాధను తమదిగా భావించే వాళ్లు నిజమైన స్నేహాన్ని పంచగలరు. వారిది స్వచ్ఛమైన స్నేహ మవుతుంది.

పారదర్శకత.. సహోద్యోగులతో లేదా పొరుగింటివారితో అవసరం కోసం మాట్లాడుకుంటే అది కలిసి పని చేయడం మాత్రమే అవుతుంది. దాన్ని స్నేహంగా భావించి, ముఖ్యమైన సందర్భాల్లో అవతలి వారి ప్రవర్తన బాధించినప్పుడు వారిని స్నేహితులుగా భావించి, మోస పోయామని వాపోవలసి వస్తుంది. స్నేహంలో పారదర్శకతకు పెద్దపీట వేయాలి. అప్పుడే ఆ బంధం ఎంతకాలమైనా చెక్కు చెదరదు. అవసరం కోసం వారిని గుర్తు చేసుకోవడంకన్నా, అవతలివారి అవసరానికి స్పందించి చేయూత నందించడమే అసలైన స్నేహం.

దూరంగా.. కొందరితో స్నేహం చేయడం కన్నా, స్నేహితుల్లేకుండా ఉండటమే మంచిది అని అంటున్నారు నిపుణులు. స్నేహితుల ఎంపికలో ఆచితూచి అడుగేయాలని సూచిస్తున్నారు. మన గురించి మూడోవ్యక్తి వద్ద తక్కువ చేసి మాట్లాడే వారితో స్నేహం సరైనది కాదు. నలుగురిలో ఉన్నప్పుడు పొగడకపోయినా, అవమానించకుండా విలువనిచ్చే వారిని స్నేహితులుగా స్వీకరించొచ్చు. వారి అవసరార్థం స్నేహాన్ని నటిస్తూ, మిగతా సమయాల్లో దూరాన్ని పాటించే వారికి మనమూ అంతే దూరంలో మెలిగితే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్