నిర్ణయంపై నిలబడి..

మాట ఇస్తే దానిపై నిలబడి ఉండేలా పిల్లలకు అలవాటు చేయాలి. తనవల్ల పొరపాటు జరిగితే దాన్ని ఒప్పుకొని, దిద్దుకోవడానికి సిద్ధపడేలా వాళ్లను పెంచాలంటున్నారు నిపుణులు. పిల్లలు తమ నిర్ణయంపై తాము నిలబడటం కూడా జీవన నైపుణ్యమే అంటున్నారు.

Updated : 12 Nov 2022 04:40 IST

మాట ఇస్తే దానిపై నిలబడి ఉండేలా పిల్లలకు అలవాటు చేయాలి. తనవల్ల పొరపాటు జరిగితే దాన్ని ఒప్పుకొని, దిద్దుకోవడానికి సిద్ధపడేలా వాళ్లను పెంచాలంటున్నారు నిపుణులు. పిల్లలు తమ నిర్ణయంపై తాము నిలబడటం కూడా జీవన నైపుణ్యమే అంటున్నారు.

ఆటలో పొరపాట్లు, ఇచ్చిన మాటను మరిచి తమకు నచ్చినట్లు ప్రవర్తించడం వంటివెన్నో పిల్లల్లో గమనిస్తుంటాం. చిన్న వయసు కదా.. నెమ్మదిగా వాళ్లే నేర్చుకుంటారని నిర్లక్ష్యం చేయకూడదు. కొందరు పిల్లలు తాము అనుకున్నట్లుగా ప్రవర్తించాలనుకున్నా.. ఇతరుల ప్రభావానికి లోనై, ఒత్తిడికి గురై తమ మార్గాన్ని మళ్లించుకుంటారు. అలా కాక తమ మనసు ఏం చెబుతోందో గుర్తించగలిగే నైపుణ్యం వారికి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే అందించాలి. ఆహారం, దుస్తులు, బొమ్మలు, స్నేహితులు... ఇలా ఏ విషయంలో అయినా వారికిష్టమైంది ఏంటో వారు తెలుసుకోగలగాలి. ఇది వారిని వారికి అర్థమయ్యేలా చేస్తుంది. ఎదిగేకొద్దీ తమ వ్యక్తిత్వంపై ఒక అవగాహన తెచ్చుకొనేలా చేయగలుగుతుంది. ఎప్పుడైతే తమ మనోభావాలు, అభిరుచులను గుర్తించగలుగుతారో, ఇతరులను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. తమకు, ఇతరులకు తేడా గుర్తిస్తారు. తమకు సంబంధించిన అంశాలపై నిర్దిష్టమైన అభిప్రాయానికి రావడమే కాకుండా, ఏ సమయంలోనైనా దానికి కట్టుబడి ఉండటం నేర్చుకుంటారు.

కథల ద్వారా.. చిన్నారులకు కథలు వినిపించినప్పుడు వాటిలోని పాత్రలు, ఆయా వ్యక్తిత్వాల గురించి విడమర్చి చెబుతుండాలి. మంచి, చెడుతోపాటు మాటపై నిలబడితే వచ్చే సత్ఫలితాలూ వివరించాలి. తమని తాము సమర్థించు కోవడం, కాపాడుకోవడం కోసం అబద్ధాలు చెప్పి ఆ పరిస్థితి నుంచి పిల్లలు తప్పించు కోవచ్చనుకుంటారు. ఆ తర్వాత దానివల్ల కలిగే తీవ్ర పరిణామాలేంటో కథలోని పాత్రల ద్వారా చెప్పడంతో ఆ అభిప్రాయాన్ని మనసులోకి రానివ్వరు. ఆ పాత్రలను అర్థం చేసుకోవడంతో ఎటువంటి ప్రవర్తన భవిష్యత్తులో మేలు చేస్తుందో అవగాహన తెచ్చుకుంటారు. సంతోషం, బాధ, భయం, విచారం, ఒంటరితనం గురించి తెలుసుకోవడమే కాదు, అవి ఎదురైనప్పుడు, ఎదుటి వారి వల్ల ప్రభావితం కాకుండా.. పరిస్థితికి తగ్గట్లుగా సమన్వయం చేసుకోవడం నేర్చుకుంటారు. తమ ఆలోచనకు తాము కట్టుబడి ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్