శిక్షిస్తున్నారా..

గాజు గ్లాసు పగలగొట్టినందుకు అమ్మ తనను గదిలో పెట్టి తలుపేస్తుందని రాశి భయంతో వణికి పోయింది. పిల్లలు పొరపాటు చేసినప్పుడు శిక్షిస్తేనే మరోసారి చేయరని పెద్దవాళ్లు భావిస్తారు. భయపెట్టి, బెదిరించి, దండించాలనుకుంటారు. ఇది సరైన విధానం కాదంటున్నారు నిపుణులు.

Published : 16 Nov 2022 00:32 IST

గాజు గ్లాసు పగలగొట్టినందుకు అమ్మ తనను గదిలో పెట్టి తలుపేస్తుందని రాశి భయంతో వణికి పోయింది. పిల్లలు పొరపాటు చేసినప్పుడు శిక్షిస్తేనే మరోసారి చేయరని పెద్దవాళ్లు భావిస్తారు. భయపెట్టి, బెదిరించి, దండించాలనుకుంటారు. ఇది సరైన విధానం కాదంటున్నారు నిపుణులు.

క్రమశిక్షణ పేరుతో పిల్లలను శిక్షిస్తే అది వారి మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. క్రమశిక్షణ, శిక్షించడానికి మధ్య తేడా ఉంది. క్రమశిక్షణపై అవగాహన కలిగించి పెంచడం వల్ల పిల్లల్లో సరైన లేదా కొత్త ప్రవర్తన నేర్చుకుంటారు. అదే శిక్షిస్తూ పెంచితే అప్పుడు కూడా కొత్త ప్రవర్తన వస్తుంది. అయితే భయం వారి వెన్నంటే ఉంటుంది. ఇది వారి మానసిక పరిపక్వతకు అడ్డు గోడ అవుతుంది. చిన్నారులకు మంచి లక్షణాలు, సరైన ఆలోచనా విధానం నేర్పడం తల్లిదండ్రులకు ఒక సవాల్‌. అలాగని శిక్షించడమే క్రమశిక్షణ అనుకోకూడదు.

చీకటి గదిలో వేయడం, ఒక రోజంతా ఆహారాన్ని అందించకపోవడం, హోంవర్క్‌ పూర్తిచేసే వరకు ఆటకు వెళ్లనివ్వక పోవడం వంటివన్నీ పిల్లల్లో మంచి ప్రవర్తన తేలేవు. అంతేకాదు, వీటివల్ల చీకటంటే భయం, అజీర్తి, జ్ఞాపకశక్తి తగ్గడం, ఎదుగుదల లోపం, చదువుపై అనాసక్తి, ఒంటరితనం వంటివన్నీ వస్తాయి. తల్లిదండ్రులతో ప్రేమగా గడపాల్సిన బాల్యమంతా అందరినీ అయిష్టంగా చూడటం మొదలుపెడతారు. ప్రేమరాహిత్యంతో మానసిక రుగ్మతలకు గురవుతారు.    

సవరణతో..

పిల్లల ప్రవర్తనను సవరించడానికి ప్రయత్నించాలి. వారి వ్యక్తిత్వం వికసించేలా చేయాలి. పొరపాట్లు చేసినా వాటిని విశదీకరించి చెప్పడంతోపాటు వారి మానసిక పరిస్థితిని గమనిస్తూ ఉండాలి. వారితో స్నేహం చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తల్లిదండ్రులంటే భరోసాగా అనిపించాలి తప్ప, ఎప్పుడు శిక్షిస్తారో అనే భయం, అభద్రతా భావం ఉండకూడదు. ‘బాగా చదవకపోతే హాస్టల్‌లో వేసేస్తాం, అక్కడ అమ్మానాన్న ఉండరు’ అని బెదిరించడం పిల్లల్లో కొత్త భయాలను సృష్టిస్తాయి. పరీక్ష ఫెయిల్‌ అయినా, ఇతరుల కన్నా మార్కులు తక్కువ వచ్చినా తల్లిదండ్రులతో చెప్పలేక మానసిక వేదనకు లోనవుతారు. ఎలాంటి శిక్ష ఎదురవుతుందో అని భయంతో కుంగుబాటుకు గురవుతారు. చదువులో వెనకబడతారు. ఇవన్నీ వారిలో ఎప్పటికీ తగ్గని మానసిక సమస్యలుగా మారతాయి. ఎవరితో చర్చించాలో తెలియక క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్