బర్న్‌ అవుట్‌ అయితే...

అయిదేళ్ల చిన్మయి బొమ్మ కావాలంటూ గంట నుంచి ఏడుస్తుంటే ఆపడానికి రాగిణి చేయని ప్రయత్నం లేదు. అయినా లాభం లేక, ఒత్తిడికి గురై, చేయి చేసుకొనేసరికి చిన్మయి ఏడుపు తారస్థాయికి చేరుకొంది. ఏం చేయాలో తెలియని రాగిణి మరింత ఒత్తిడితో తలపట్టుక్కూర్చుంది.

Published : 24 Nov 2022 00:46 IST

అయిదేళ్ల చిన్మయి బొమ్మ కావాలంటూ గంట నుంచి ఏడుస్తుంటే ఆపడానికి రాగిణి చేయని ప్రయత్నం లేదు. అయినా లాభం లేక, ఒత్తిడికి గురై, చేయి చేసుకొనేసరికి చిన్మయి ఏడుపు తారస్థాయికి చేరుకొంది. ఏం చేయాలో తెలియని రాగిణి మరింత ఒత్తిడితో తలపట్టుక్కూర్చుంది. దీన్నే బర్న్‌అవుట్‌ అంటున్నారు నిపుణులు. దీన్నుంచి ఎలా బయటపడాలో చెబుతున్నారు.

ఉదయం నుంచి పిల్లలు రాత్రి వరకు అమ్మ కొంగుపట్టుకొనే తిరుగుతారు. ఓవైపు ఇంటి పని, మరోవైపు అందరికీ ఆహారాన్ని సిద్ధం చేసే హడావిడిలో ఆ ఇల్లాలు మునిగిపోతుంది. సమయంలోపు పని పూర్తవుతుందో లేదో అనే ఒత్తిడి.. తాను తీసుకోవాల్సిన ఆహారాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది. తీరా పనయ్యేసరికి నీరసం ఆవహిస్తుంది. అంతలోనే చంటి పిల్లలు మారాం చేస్తుంటారు. ఆ సమయంలో సరైన ఆహారం, విశ్రాంతి లేక ఒత్తిడి మొదలై, దాడి చేయనున్న బర్న్‌ అవుట్‌ను గుర్తించలేరు. ఇది తెలియకుండానే కోపంగా మారుతుంది. ఆ తర్వాత అది దుఃఖంగానూ మారొచ్చు. అకస్మాత్తుగా అమ్మ ఎందుకిలా ప్రవర్తిస్తోందో తెలియక పిల్లలూ అయోమయానికి గురవుతారు.

గుర్తించాలి..

ఇంటి పని, పిల్లల పెంపకం, సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి వంటి అంశాలు మహిళలకు విశ్రాంతిని దూరం చేస్తాయి. దీంతో శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతారు. శరీరానికి తగిన పోషకాలు అందవు. అనారోగ్యం మొదలవుతుంది. ఇందుకోసం వాడే మందుల ప్రభావం వీటన్నింటికీ తోడవుతుంది. ఇవన్నీ ఒత్తిడి, ఆందోళనను దరిచేస్తాయి. ఏ పనిపైనా ఆసక్తి లేకపోవడం, కారణం లేకుండానే కోపం రావడం, ఏదీ గుర్తు ఉండకపోవడం వంటివన్నీ బర్న్‌అవుట్‌కు సంకేతాలని ప్రారంభదశలోనే గుర్తించగలగాలి. ముందస్తు చర్యలు తీసుకొని దీన్ని నిరోధించకపోతే ఆత్మన్యూనతకు దారి తీసే ప్రమాదం ఉంది.

హద్దులు..

ప్రతి పనికీ హద్దులు గీసుకోవాలి. ఒకేసారి పనంతా పూర్తిచేయాలన్న హైరానా వద్దు. మధ్య మధ్య కాస్త విశ్రాంతి తీసుకొంటూ పని చేస్తే అలసట త్వరగా రాదు. ఉదయం అందరికన్నా అరగంట ముందే నిద్రలేచి మీ కోసం ఆ సమయాన్ని వినియోగించుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామం, మనసుకు నచ్చినట్లుగా వేడివేడి కాఫీ లేదా టీ తాగుతూ ప్రకృతిని చూస్తూ గడపడం నేర్చుకోవాలి. ఇది శరీరానికీ, మనసుకీ రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది. పిల్లలతో కలిసిపోయి సరదాగా ఆటపాటలతో గడపాలి. పనిలో కొంత ఇంట్లో మిగతా వారికీ వాటా వేయాలి. ఇవన్నీ ఒత్తిడి, ఆందోళనను దరిచేరకుండా చేస్తాయి. అప్పుడు బర్న్‌అవుట్‌కు ఆస్కారం ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్