మురిపెం సరే... మీరెలా ఉంటున్నారు?

‘బాబోయ్‌.. ఈ తరం పిల్లలు’ ఈమాట ఎన్నిసార్లు వినుంటాం! మూడేళ్లు నిండకుండానే ఫోన్‌ను వాడుతుండటం.. ఆరిందల్లా బోలెడు విషయాల్ని చెప్పేస్తుండటం.. ఎన్ని చూస్తున్నాం. ‘న్యూ జెనరేషన్‌ కిడ్స్‌’ అంటూ ఆశ్చర్యపోతుంటాం కూడా!

Published : 26 Nov 2022 00:14 IST

‘బాబోయ్‌.. ఈ తరం పిల్లలు’ ఈమాట ఎన్నిసార్లు వినుంటాం! మూడేళ్లు నిండకుండానే ఫోన్‌ను వాడుతుండటం.. ఆరిందల్లా బోలెడు విషయాల్ని చెప్పేస్తుండటం.. ఎన్ని చూస్తున్నాం. ‘న్యూ జెనరేషన్‌ కిడ్స్‌’ అంటూ ఆశ్చర్యపోతుంటాం కూడా! మరి.. వాళ్లకు తగ్గట్టుగా మన పెంపకమూ ఉందా?

* ఒకప్పుడు తరాల మధ్య అంతరం పదేళ్లుగా ఉండేది. ఇప్పుడది అయిదేళ్లకు దిగిందట. అంటే మనకు మన పిల్లలకు మధ్య ఆలోచనల్లో వ్యత్యాసం ఎంత ఉండాలి? మనం పెరిగిన వాతావరణం వాళ్లకు సరిపడదు. కాబట్టి.. ‘మేం పెరగలేదా, పెద్దోడిని పెంచలేదా’ అన్న ధీమా పక్కన పెట్టేయండి. అలవాట్లు, అభిప్రాయాలు ఎటువైపు సాగుతున్నాయో గమనించడం మొదలుపెట్టండి.

* ఆలోచనల్లో, నేర్చుకోవడంలో ఎంత వేగం పెరిగినా.. వాళ్లు ముందు గమనించేది మనల్నే! అందరికీ అన్నీ తెలియాలనేం లేదు. ఈ సూత్రం మనకీ, పిల్లలకీ ఇద్దరికీ వర్తిస్తుంది. కాబట్టి, మీ పిల్లలు అన్నింటా ముందుండాలని ఆశించకండి. తప్పు చేస్తే.. ఎలా దండిద్దామని కాక.. ఎలా సరిచేయొచ్చో ఆలోచించండి. మార్చుకోవడానికి మీరేం చేయాలో వాళ్లనీ కనుక్కోండి.

* చూడటానికి చిన్నగానే కనిపిస్తారు. నోరు తెరిస్తే కానీ అర్థమవదు.. వాళ్ల ఊహాశక్తి స్థాయేంటో! మురిసిపోవడానికే పరిమితమవొద్దు.. ‘చాల్లే బడాయ’ని కొట్టిపారేయొద్దు. ప్రోత్సహించండి. ఆసక్తి కొనసాగేలా అవసరమైన పుస్తకాలు, పరికరాలు కొనిపెడితే.. అభిరుచికి మెరుగులు పెట్టుకుంటారు. మీరూ తోడైతే.. ఇంకా ఉత్సాహంగా ప్రయత్నిస్తారు. చివరి వరకూ ఇదే ఇష్టం కొనసాగాలని లేదు. కొద్దిరోజులకు మనసు మరో విషయంపైకి మళ్లొచ్చు. అంతమాత్రాన ‘ఇవన్నీ కొని దండగ’ంటూ నిరాశ పరచొద్దు. ఇదీ నేర్చుకునే క్రమమే.. అవసరమైతే దాయండి. లేదూ ఎవరికైనా ఇవ్వండి. వాళ్ల ఆలోచనలను మాత్రం బంధించొద్దు.

* ‘అందరూ మన పిల్లల్ని మెచ్చుకోవాలి’.. ఇలా కోరుకోని తల్లుండదు. ఎవరైనా మెరుగైన ప్రదర్శన చేస్తే.. ఉదాహరణగా చూపిస్తుంటాం కూడా. కానీ అది మీ పిల్లలకు ఒత్తిడిగా మారొచ్చు. ‘పిల్లల్లో ఒత్తిడేంట’ని కొట్టిపారేయొద్దు. మనం అయిష్టంగా చేయించేవీ, అన్నింటా తొందర పెట్టడం వంటివి నేర్చుకోవడంపై విరక్తిని, అయిష్టాన్నీ కలిగిస్తాయి. చివరికి అన్నింటిపైనా విముఖత కలగొచ్చు. సరదాగా, ఆసక్తి పెంచే విధానాలేంటో ఆలోచించండి. ప్రతి తల్లి, ప్రతి పిల్లాడూ ప్రత్యేకమే! కాబట్టి, ఎవరినీ అనుసరించొద్దు. మీ అన్యోన్యతే ఆధారంగా.. కలిసి తెలుసుకుంటూ, సర్దుకుపోతూ సాగండి.. బెస్ట్‌ అమ్మ అవ్వడం ఖాయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్