సమన్వయం కావాలా.. సిద్ధమవండిలా!

చదువయ్యాక ఉద్యోగ జీవితంలోకి సులువుగానే వెళతాం. కానీ బంధంలోకి అడుగు పెట్టాకే సమస్యలు మొదలవుతాయి.

Updated : 29 Nov 2022 04:57 IST

చదువయ్యాక ఉద్యోగ జీవితంలోకి సులువుగానే వెళతాం. కానీ బంధంలోకి అడుగు పెట్టాకే సమస్యలు మొదలవుతాయి. అటు ఉద్యోగం.. ఇటు ఇల్లు సమన్వయం చేసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఫలితమే ఒత్తిడి, బంధంలో చికాకులు. అలా అవొద్దంటే.. నిపుణుల సూచనలివిగో!

కమ్యూనికేషన్‌.. చాలామంది సమస్య ఇక్కడే. భార్య ఉద్యోగం చేస్తున్నా.. ఇంటి బాధ్యతల్నీ సక్రమంగా నిర్వర్తించాలని ఆశించే మగవారే ఎక్కువ. సమయానికి చేరుకోకపోయినా.. ఏవైనా ముఖ్య విషయాలు మర్చిపోయినా కోపగించుకుంటుంటారు. ఇలాంటప్పుడు.. ‘ఇద్దరం ఉద్యోగులమే, పరిస్థితి ఆ మాత్రం అర్థం కాదా!’... అని కూర్చోకండి. మీ ఆఫీసు పరిస్థితి, పనులు, ఆలోచన తీరు అతనితో పోలిస్తే భిన్నం. కాబట్టి.. చెప్పకుండానే అర్థం చేసుకోవాలన్న ధోరణి వదిలిపెట్టండి. నా బాధ్యతలు ఇలా ఉంటాయి, ఈ రోజు ఫలానా పని నాకు వీలు కాదు... లేదా పార్టీకి రాలేను.. లాంటివి ముందే చెప్పండి. కావాల్సిన సాయాన్నీ చర్చించండి.

ఏం కావాలి.. 9-5 ఉద్యోగాలే కావందరివీ! రాత్రుళ్లు పనిచేయడం చాలామందికి తప్పనిసరి. ఉదయాన్నే లేవడం అసాధ్యమా.. రాత్రుళ్లు మీటింగ్‌తో ఆలస్యమవుతుందా.. చెప్పేయండి. మీకు అందుబాటులో ఉన్న సమయాన్నీ ‘ఫలానా సమయంలో నో ఫోన్‌, ఈరోజుల్లో ఇంటి వంటే.. కోపమొస్తే ఏం చేయాలి’ వంటి సూత్రాలు పెట్టుకుంటే గిల్లికజ్జాలు పెద్దవి అవవు.

నేను వదిలి.. ఎంతసేపు నా పని, నా కెరియర్‌ అన్నట్లుగా సాగితే బంధం బీటలు వారుతుంది. ఒకరికొకరుగా సాగాలి. అవతలి వారి మానసిక స్థితినీ, అవసరాలనీ పట్టించుకోవాలి. భాగస్వామి డీలాపడితే తోడ్పాటు అందించాలి. మీకవసరమైతే సాయం కోరాలి. ఇది ఒకరికొకరిని దగ్గర చేయడమే కాదు.. ఉమ్మడిగా సాగడాన్నీ అలవాటు చేస్తుంది.

ప్రేమకీ చోటు.. సర్దుకోవడం.. ఆలోచనలు పంచుకోవడం.. ఇలాగే కొనసాగితే జీవితం మరీ రొటీనై పోదూ! ప్రేమకీ చోటివ్వండి. వారంలో కొద్దిగంటలు మీకోసమే ప్రత్యేకంగా కేటాయించుకోండి. చిన్న అభినందన, చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లు.. ఇవన్నీ ప్రేమను పెంచేవే! దీన్ని మాత్రం పక్కన పడేయొద్దు. అప్పుడే.. రెండింటి ప్రయాణం తేలికవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్