కొంచెం ప్రేమ.. కొంచెం సహనం..

సంసారమంటే మూడు డ్యూయెట్లు, ఆరు హాస్య సన్నివేశాలే కాదండోయ్‌.. మనసును బాధించే విసుగులూ, అసహనాలూ కూడా ఎదురవుతాయి.

Published : 30 Nov 2022 00:43 IST

సంసారమంటే మూడు డ్యూయెట్లు, ఆరు హాస్య సన్నివేశాలే కాదండోయ్‌.. మనసును బాధించే విసుగులూ, అసహనాలూ కూడా ఎదురవుతాయి. ఎందుకంటే అది మూడు గంటల సినిమా కాదు. ముప్పయ్యేళ్లకు పైగా సాగే ఇద్దరి జీవన పయనం..

భార్యాభర్తల్లో సుగుణాలతో బాటు బలహీనతలూ ఉంటాయి. వాటిని సర్దుకుపోతే ఒకరికొకరుగా అండగా, ఆలంబనగా నిలుస్తారు. లేదంటే ఎవరికి వారై ఒంటరితనాన్ని అనుభవిస్తారు. మరి సరిపెట్టుకోవడమే మేలు కదా! భాగస్వామిలో సోమరితనమే ఉందనుకోండి.. అది అవలక్షణమే. కానీ ఆ సాకుతో గొడవపడే బదులు ప్రయత్నించి మార్పు తేవచ్చు అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. ఎలాగో చూడండి...

* పెళ్లికి ముందు వస్తానన్న చోటుకు రాకున్నా, సమయం పాటించకున్నా చెప్పే సాకులన్నీ నిజమే కాబోలనిపిస్తుంది. తీరా ఒకింట్లో చేరాక, సోమరితనమే అడ్డంకని తెలిశాక కోపం వచ్చేసే మాట నిజమే. కానీ కాస్తంత నిగ్రహం చూపితే ఆ నైజంలో మార్పొస్తుంది. ఏ భర్తయినా తానొక హీరోననుకుంటాడు. అదే ఆయుధం. పనులన్నీ ఒంటరిగా చక్కబెట్టగలనంటూ సామర్థ్యాలు ప్రదర్శిస్తే ఇక తానే చేసుకుంటుందని నిమ్మకు నీరెత్తినట్టుంటాడు. అందువల్ల సాయం చేస్తేనే పనవుతుందని తెలియజెప్పాలి. అప్పుడిక స్పోర్ట్స్‌ ఛానల్‌ చూసుకుంటూ చిప్స్‌ తినడాన్ని పక్కనపెట్టేసి చేయూత అందించడం ఖాయం.

* లోపాన్ని వేలెత్తిచూపడం, వాదించడం, నిందించడం ఒద్దు. ఇలాంటివి ఇంకాస్త చేటుచేస్తాయి. మొండివైఖరి వచ్చేస్తుంది. ఆఫీసుకు పికప్‌ చేసుకునేందుకు రాకపోతే బస్‌ కిక్కిరిసి ఉండటం, పోకిరీ విసిగించడం లాంటి ఇబ్బందులు చెబితే సరి ఆలోచన మొదలౌతుంది.

* నాలుగుసార్లు ఆలస్యం చేసిన సంగతి మర్చిపోయి ఒకసారి వేళకు పూర్తిచేసిన అంశాన్ని ప్రశంసించండి. అది మాటవరసకు కాదు, మనసారా మెచ్చుకోండి. మీ కళ్లల్లో కనిపించే నిజాయతీ, మాటల్లో సంతోషం మార్పునకు దారితీస్తాయి.

* నాలుగైదు పనులను వాయిదా వేస్తుంటే అందులో మీ భర్తకు ఇష్టమైన పనిని ముందు చేసేలా చూడండి. అది పూర్తయ్యాక ఎంత మేలు జరిగిందీ చెబితే ఉత్సాహం కలుగుతుంది. బద్ధకాన్ని పోగొట్టడం పెన్సిల్‌ గీతల్ని చెరిపినంత సులభం కాకున్నా కొండను కదిలించడమంత అసాధ్యమూ కాదు. కొంచెం ఓర్పు, ఇంకొంచెం ప్రేమల్ని రంగరిస్తే మార్పు తప్పకుండా వస్తుంది.

* మార్పు కనిపిస్తోంది కదాని మీ ఆశలను మరీ అందలాలు ఎక్కించొద్దు. మంచి ఎప్పుడూ నెమ్మదిగానే వస్తుంది. ఒకేసారి అద్భుతం జరిగిందంటే అది క్షణికావేశమే తప్ప అసలైన మార్పు కాదు. కనుక వేగంగా పెనుమార్పు కోరుకోవద్దు. అలాగే కొన్నిసార్లు రాజీ తప్పదని కూడా గుర్తుంచుకోవాలి. ఇలా లక్ష్యాలను పట్టాలెక్కిస్తే గమ్యాలను చేరుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్