సానుభూతి అవసరమే..

విడదీయరాని అనుబంధం అంటే భార్యా భర్తలదే. జీవనపర్యంతం కలిసుండేది వాళ్లిద్దరే మరి.

Updated : 06 Dec 2022 05:56 IST

విడదీయరాని అనుబంధం అంటే భార్యా భర్తలదే. జీవనపర్యంతం కలిసుండేది వాళ్లిద్దరే మరి. అయితే ‘నువ్వంటే అంతిష్టం, ఇంతిష్టం’ అంటూ కబుర్లూ, కవిత్వాలూ చెప్పుకోవడం కంటే అవసరంలో సానుభూతి చూపుతూ సాయమందించడం మిన్న అంటున్నారు మనోవైజ్ఞానికులు. ఒకర్నొకరు కనిపెట్టుకుని ఉంటూ రెండోవారి కష్టాన్ని తమదిగా భావించి ఓదార్చడం, అండగా నిలబడటమే అసలైన ఆత్మీయత అంటూ చెబుతున్నారు చూడండి...

* పని భారంతో విసిగిపోయిన భాగస్వామికి ‘మిగిలిన పనిని తర్వాత చేసుకోవచ్చు, కాసేపు సేద తీరు’ అంటూ కాఫీనో, స్నాక్సో అందిస్తే అలసటంతా మర్చిపోతారు. ఆ సానుభూతి టానిక్‌లా పని చేసి ఉత్సాహం పొంగుకొస్తుంది.

* చేతనైతే, చేయగలిగిందైతే రెండోవారి పనిని తాను అందుకుంటే అవే ఆనంద క్షణాలు. ఇలాంటి చిన్నచిన్నవే అనురాగాన్ని పెంచి అనుభూతులను మిగులుస్తాయి. ఒకరి మీద ఒకరు ఆధారపడేలా, ఒకరికోసం ఒకరు జీవించేలా చేస్తాయి.

* కార్యాలయంలో ఎదురయ్యే కష్టనష్టాలను సహోద్యోగులతో చర్చించడం వల్ల మేలు కంటే హానే జరుగుతుంది. వాటిని భాగస్వామితో పంచుకోవడమే మంచిది. సహానుభూతితో పరిష్కార మార్గాన్ని సూచించడమే కాదు వీలైతే అండదండలూ అందిస్తారు.

* అనారోగ్య సమస్య తలెత్తితే డాక్టరుకు చూపించి చికిత్స చేయిస్తే సరిపోతుంది అనుకుంటారు చాలామంది. నిజానికి అంతకంటే ముందు సానుభూతి లేపనం పూయాలి. శక్తిమంతమైన ఆ ఔషధం కరవైతే వైద్యులిచ్చేవి కూడా ప్రభావం చూపలేవు.

* ఏ కారణంగానో భాగస్వామికి కోపం వస్తే రెండో వ్యక్తి కూడా ఆగ్రహం చూపితే గొడవైపోతుంది. బదులుగా కాస్తంత నిగ్రహం చూపి, వారి కోపాన్ని సహానుభూతితో అర్థం చేసుకుంటే కోపం కాస్తా క్షణంలో చల్లారిపోతుంది. వాతావరణం ప్రశాంతమౌతుంది.

* స్త్రీ పురుషులనే తేడా లేకుండా ఎవరికైనా ఒక్కోసారి మూడ్‌ బాగుండదు. అందుకు పెద్ద కారణాలు కూడా ఏమీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ‘నిష్కారణంగా ముభావాలు ఎందుకట?!’ అని కోపగించుకోవడం, వ్యంగ్యాస్త్రాలు విసరడం వద్దు. ‘పలకరిస్తే బదులివ్వలేదు అంతే కదా’ అని.. సహానుభూతితో అర్థం చేసుకుంటే కాసేపట్లో భాగస్వామి యథాస్థితికి వచ్చేయడం తథ్యం. ఇద్దరూ కలిసి ఏ సినిమాకో షికారుకో వెళ్తే ఇక ఆనందాలు ఒడిసిపట్టుకోవడమే తరువాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్