Published : 12/12/2022 00:01 IST

భాగస్వామిలోఆ తీరు ప్రమాదం!

దంపతుల్లో ఒకరిపై మరొకరు పూర్తి విశ్వాసం, నమ్మకంతో అడుగులేస్తేనే ఆ సంసారం జీవితాంతం సంతోషంగా సాగుతుంది. ఇరువురిలో ఏ ఒక్కరైనా అభద్రతాభావంతో ఉన్నారంటే క్రమేపీ ఆ బంధం బీటలువారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్ర పరిణామాలు చోటు చేసుకోకముందే ఎదుటి వారిలో దాన్ని గుర్తించ గలిగి, పోగొట్టే ప్రయత్నం చేయాలంటున్నారు.

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగరీత్యా బిజీగా ఉంటూ ఒకరితో ఒకరు మాట్లాడటానికి సమయం లేనప్పుడు ఈ సమస్య వస్తుంది. స్నేహితులు, సహోద్యోగులతో పరిచయాలు పెంచుకోకుండా ఒంటరిగా ఉండేవారికి ఈ భావన ఎక్కువగా ఉంటుంది. తమలాగే అవతలి వారికీ.. అలా అనిపించక పోవడంతో అది అభద్రతగా మారుతుంది. తమ పని తాము చేసుకొంటూ బిజీగా ఉండే పార్టనర్‌పై ఈర్ష్య, అసూయ కలుగుతాయి. తనపై వారికి ప్రేమలేదనుకుంటారు. తనకు కలిగే ఒంటరితనం ఎదుటి వారికెందుకు రావడంలేదనే ఆలోచన వారిపై అనుమానాన్ని పెంచుతాయి. భాగస్వామి మనసులో ఇంత మధనం జరుగుతుండటం అవతలి వారు గుర్తించాలి. 

సమయాన్ని.. ఉద్యోగం, కుటుంబమంటూ ఎంత బిజీగా ఉన్నా భార్యా భర్తలు తమ కోసమంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. అదే వారి అనుబంధాన్ని పెంచే వారధి అవుతుంది. ఎదుటి వారిలో కనిపించే భావోద్వేగాలను గుర్తించగలగాలి. వారు ఒంటరితనాన్ని దూరం చేయాలి. పని ఒత్తిడి వల్ల ఎక్కువ సమయం గడపలేకపోతున్నప్పుడు అవగాహన కలిగించాలి. అలానే ఇల్లాలు కూడా పిల్లల పెంపకం, ఇంటి బాధ్యతల్లోపడి భర్తకు సమయాన్నివ్వకుండా ఉండకూడదు. ఇరువురూ ఆలోచనలను పంచుకోవాలి. సమస్యలను చర్చించుకోవాలి. అది ఒకరిపై మరొకరికి అనుబంధాన్ని పెంచుతుంది. అభద్రత అనే ఆలోచనను దరి చేరనివ్వదు.

విమర్శలొద్దు.. దంపతుల్లో ఏ ఒకరైనా అభద్రతగా ఉన్నప్పుడు వారి పట్ల విమర్శనాత్మకంగా ప్రవర్తించకూడదు. అది అవతలివారి మనసును మరింత వేదనకు గురిచేస్తుంది. జీవిత భాగస్వామితో మాట్లాడి, మృదువుగా కారణాన్ని తెలుసుకొని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఎదుటివారికి తమ ఇబ్బందులపై అవగాహన కలిగించాలి. ప్రశాంతంగా మాట్లాడుకోవాలే తప్ప కోపంతో అరవకూడదు. తమవల్ల ఏదైనా పొరపాటు జరిగితే నిస్సందేహంగా అడిగే క్షమార్పణ అవతలివారి మనసును తేలికపరుస్తుంది. ఎటువంటి విషయమైనా సమస్యగా అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చర్చించుకోవాలి. అప్పుడే అది అరమరికల్లేని దాంపత్యం అవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని