బొద్దుగా ఉంటే.. బుర్రకు సమస్య!

పిల్లలు ముద్దుగా బొద్దుగా ఉంటే చూడటానికి బాగుంటుంది! నిజానికి అలా ఉంటేనే ఆరోగ్యమని చాలామంది తల్లులు భావిస్తుంటారు.

Updated : 20 Dec 2022 03:26 IST

పిల్లలు ముద్దుగా బొద్దుగా ఉంటే చూడటానికి బాగుంటుంది! నిజానికి అలా ఉంటేనే ఆరోగ్యమని చాలామంది తల్లులు భావిస్తుంటారు. కానీ పిల్లల్లోనూ ఊబకాయం ఉంటుంది. అది వాళ్లని శారీరకంగానే కాదు.. మానసికంగానూ దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు.

యేల్‌ విశ్వవిద్యాలయం తాజా అధ్యయనం ప్రకారం బాగా బరువున్న పిల్లల్లో మెదడు ఆకృతి భిన్నంగా ఉంటోంది. దాని పై పొర కూడా పలుచగా తయారవుతోంది. ఇవి మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఆలోచనా విధానంలో లోపాలు, భావోద్వేగాలపై పట్టులేకపోవడం వంటి ఎన్నో దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయట. 9, 10 ఏళ్ల వయసున్న పిల్లలు 12 వేలమందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయాలను కనుగొన్నారు. అంతకు మించిన వయసు ఉన్నవారిపై చేసిన పరిశోధనలోనూ ఇవే ఫలితాలు కనిపించాయి. కాబట్టి.. పిల్లల బరువు విషయంలో చిన్నతనం నుంచే జాగ్రత్త తప్పనిసరని హెచ్చరిస్తున్నారు.

* తాజా కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలకు ఆహారంలో ప్రాధాన్యమివ్వండి. తక్కువ కొవ్వున్న పాలు, పెరుగు, చీజ్‌ వంటివీ మంచిదే! చిరుధాన్యాలు, గుడ్లు, చేప వంటివీ తరచూ ఇవ్వొచ్చు. చక్కెర, తీపి పదార్థాలకు దూరంగా ఉంచాలి.

* కార్బొనేటెడ్‌ పానీయాలు, జంక్‌ఫుడ్‌, ఉప్పు అధికంగా ఉండే చిరుతిళ్లు దరిచేరనీయొద్దు. పిల్లలను వీటికి దూరంగా ఉంచడం కాస్త కష్టమైన పనే! కాబట్టి, వాటికి వారానికొక్కసారే అనో, ఏదైనా ప్రత్యేక సందర్భంలోనే అని పరిధులు విధించండి.

* రోజూ కనీసం ఓ గంట ఆటలు ఆడేలా, వ్యాయామం చేసేలా చూడండి. దాంతో ఎముకలు దృఢంగా అవడమే కాదు.. మెదడూ చురుగ్గా మారుతుంది. చదువుతోపాటు పజిల్స్‌, సృజనాత్మకతకు వీలుండే అంశాలకు ప్రాధాన్యమిస్తే మేలు. ఫోన్‌, టీవీ సమయాన్ని గంటకు మించనీయొద్దు. ఇదీ మెదడుపై ప్రభావం చూపేదే!

* మనకంటే పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం. కనీసం 8-9 గంటల నిద్ర కచ్చితంగా ఉండేలా చూసుకోండి. అప్పుడే ఆరోగ్యంగా ఎదుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్