మీరే పాటించనంటే ఎలా?

అన్నయ్య, తను ఒకే తప్పు చేసినా.. శిక్ష మాత్రం తనకే. అమ్మ ప్రవర్తన ఏడేళ్ల రమ్యకు అర్థంకాదు. దీన్నే అస్థిరమైన, పొసగని పెంపకం అంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే పిల్లలు అయోమయానికి, ఆందోళనకు గురవుతారు అంటున్నారు.

Published : 08 Jan 2023 00:08 IST

అన్నయ్య, తను ఒకే తప్పు చేసినా.. శిక్ష మాత్రం తనకే. అమ్మ ప్రవర్తన ఏడేళ్ల రమ్యకు అర్థంకాదు. దీన్నే అస్థిరమైన, పొసగని పెంపకం అంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే పిల్లలు అయోమయానికి, ఆందోళనకు గురవుతారు అంటున్నారు.

వ్యక్తిని బట్టి నియమాలను మార్చేస్తుంటే పిల్లలు తికమకకు గురవుతారు. వాళ్లకి ఒకటి చెప్పి, మనం ఒకలా ప్రవర్తిస్తున్నా వాళ్లకి ఏం చేయాలో అర్థమవదు. ఉదాహరణకి భోజనం చేసేటప్పుడు ఈ కూర తప్పక తినాలి. ఆరోగ్యానికి మంచిది అని చెబుతాం. బలవంతంగానూ తినిపిస్తుంటాం. ఒక్కోసారి చాక్లెట్‌, స్వీటు ఇస్తామని ఆశ పెడతాం. తీరా వాళ్లు దాన్ని ఎలాగోలా అనుసరిస్తోంటే.. మరొక సందర్భం లేదా సమయంలో పెద్దవాళ్లే దాన్ని పాటించకపోవడమో.. ఇంకొకరి విషయంలో ఈ ఒక్కసారికీ ఏమవుదులే అనడమో చేస్తుంటారు. అమ్మానాన్నలో కనిపించే ఈ ద్వంద్వ ప్రవర్తన పిల్లల్లో నియమాలను అన్నిసార్లూ పాటించక్కర్లేదన్న మెసేజ్‌ని పంపగలదు.

తోబుట్టువుల మధ్య..

ఇద్దరు పిల్లలుండే ఇంట్లో కొన్నిచోట్ల ఇరువురికీ వేరువేరుగా నియమ నిబంధనలు కనిపిస్తాయి. పెద్దోడిని స్నేహితులతో కలిసి వెళ్లడానికి అనుమతించి, చిన్నవాడిని ఈ వయసులో ఫ్రెండ్స్‌ ఏంటంటూ ప్రశ్నిస్తారు. వయసులో పెద్దగా తేడాలేని చోట ఇటువంటి రెండురకాల నిబంధనలు ఆ సహోదరుల మధ్య దూరాన్ని పెంచుతాయి. గతంలో ఏదైనా ఒక విషయాన్ని తేలికగా తీసుకొనే తల్లిదండ్రులు, అదే సందర్భం మరోసారి వచ్చినప్పుడు అప్పటి వారి మానసిక ఒత్తిడిని బట్టి ఒక్కోసారి కఠినంగా ప్రవర్తిస్తారు. ఈసారి అమ్మానాన్న ఎందుకిలా శిక్షిస్తున్నారనే ఆలోచన పిల్లల మనసును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆందోళనకు గురిచేసి ప్రవర్తనా సమస్యలకు లోనయ్యేలా చేస్తుంది.

వ్యతిరేకత..

కొందరు తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకు ఎటువంటి నియమ నిబంధనలు అలవాటు చేయరు. దాంతో ఆ చిన్నారులు తమకిష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇంటికి బంధువులొచ్చినప్పుడు లేదా స్నేహితుల ఇళ్లకు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు మాత్రం తమ పిల్లల ప్రవర్తనను అవతలివాళ్లు విమర్శిస్తారేమోనని భయపడుతుంటారు. దాంతో అలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదంటూ అక్కడే కోప్పడటం, దండించడానికీ వెనుకాడరు. ఆ సమయంలో అమ్మానాన్నలెందుకు కొడుతున్నారో చిన్నారులకు అర్థంకాదు. పైగా పెద్దవాళ్ల పట్ల కోపం పెంచుకుంటారు. కాబట్టి, విషయంపై అవగాహన కలిగించి ఇష్టంగా పాటించేలా పిల్లలకు నేర్పాలి. అలాగే పెద్దవాళ్లు కూడా అనుసరించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్