Published : 17/01/2023 00:16 IST

ఇతనే అతగాడు...

నూరేళ్లు కలిసి కాపురం చేయాల్సిన వ్యక్తిని ఎంచుకొనేటప్పుడు తను సరైన భాగస్వామి అవునాకాదా అనే దాన్ని మీకన్నా ముందు మీ మనసే గుర్తిస్తుంది. అదెలాగో నిపుణులు చెబుతున్నారు.

వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే సందర్భం అత్యంత ముఖ్యమైంది. అతడి ప్రవర్తన, మాట్లాడే విధానం, అభిరుచులు వంటివి తెలుసుకొన్నప్పుడు అతను మీకు తగిన వాడా కాదా అన్నది మనసు ముందుగానే హెచ్చరిస్తుంది. దాన్ని గుర్తించగలగాలి. అలా మనసు చెప్పినట్లు నడుచుకుంటే ఆ బంధంలోకి అడుగుపెట్టకుండా ముందే ఆగిపోవచ్చు. అలాకాక మనసుకు వ్యతిరేకంగా అడుగులేసి, సర్దుబాట్లు చేసుకుని అతడిని జీవితంలోకి ఆహ్వానించినా మీ ఇరువురి మధ్య ప్రేమబంధం బలంగా ముడిపడదు. సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది.

సమాధానాల్లో..

అవతలి వ్యక్తి సమాధానాల్లో పొంతన లేకపోవడం... స్పష్టత కోసం మీరు మళ్లీ అడిగితే సంభాషణను వేరే దిశకు మళి ్లస్తుండటం వంటివి చేస్తోంటే అక్కడేదో సమస్య ఉన్నట్లే అని గుర్తించాలి. అస్పష్టంగా సాగుతున్న మీ ఇరువురి సంభాషణను మీ మనసు గుర్తించి, హెచ్చరిస్తూనే ఉంటుంది. ఆ వ్యక్తి మీకు సరైన సోల్‌మేట్‌ కాదని చెబుతుంది. ఇక సంభాషణను కొనసాగించకుండా సున్నితంగా అక్కడి నుంచి బయటకు రాగలిగితే మంచిది. ఎందుకంటే మనసును అరమరికల్లేకుండా మీ ముందు పరచాల్సిన సందర్భంలో వెనకాడుతున్నాడంటే జీవితకాలం అతడితో నడవడం కష్టం.

అసౌకర్యంగా..

అతని సమక్షంలో మీరున్నప్పుడు అసౌకర్యంగా భావిస్తున్నారంటే ..ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాకపోవడమే మంచిది. జీవిత భాగస్వామి వద్ద ఉన్నప్పుడు మనసంతా అతడిపై భరోసా నిండి ఉండాలి. ఎటువంటి భయం, ఆందోళన కలగకూడదు. వీటన్నింటినీ మీ మనసు అనుభూతి చెందుతుంది. అయితే అతడే అసౌకర్యంగా అనిపిస్తుంటే అతనితో ఏడడుగులు వేయకపోవడమే మంచిది. మహిళలపట్ల అవహేళనగా మాట్లాడి, సరదాగా అంటూ అవతలి వారిని మాటలతో కించపరిచే వారిని మనసు దరికి చేరనివ్వదు. అందుకే మనసును తోడుగా తీసుకొని జీవితాంతం కలిసుండే వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకోవడానికి ప్రయత్నించగలిగితే చాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని