Published : 24/01/2023 00:55 IST

అనుబంధాల తీగకు ఆత్మీయ కుసుమాలు

పెళ్లికి ముందు ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేయడానికైనా సిద్ధం అనుకున్న ప్రేమజంటలు పెళ్లయిన కొన్నాళ్లకే కోపతాపాలు పెంచుకుని  ఒకరి నీడని మరొకరు సహించలేకపోవడం చూస్తుంటాం. ఈ అసహనాలకు కారణాలేంటో, అలాంటి స్థితి రాకూడదంటే ఎలా మెలగాలో సూచిస్తున్నారు మానసిక నిపుణులు. అవేమిటంటే...


అపనమ్మకం.. ఆలుమగల అనుబంధానికి మొదటి సూత్రం నమ్మకం. ఆఫీసు నుంచి కాస్త ఆలస్యంగా వస్తే ఎక్కడికి వెళ్లిపోయారో, తనకు తెలియకుండా ఏం చేస్తున్నారో లాంటి అనుమానం రాకుండానే ఉండాలి. వచ్చిందంటే అది పురుగులా తొలుస్తూ అశాంతికి గురిచేస్తుంది. అవతలివారిని మాటలూ చేతలతో ఇబ్బందిపెట్టడానికి కారణమౌతుంది.


బాధ్యత లేకపోవడం.. ఆరోగ్యం సహకరించక లేదా పని ఒత్తిడి కారణంగా చక్కబెట్టాల్సిన పనులు ఆలస్యమైనా లేదా అసలే చేయకున్నా అర్థం చేసుకుంటారు. కానీ బాధ్యత లేక విస్మరించడం మాత్రం అవతలి వ్యక్తికి దుర్భరమనిపిస్తుంది. కనుక చేయాల్సిన పనుల్లో ఏవైనా అడ్డంకులు వస్తే.. ఆ సంగతి తప్పకుండా తెలియజేయాలి. అలాగే ఆ అవాంతరాలను అధిగమించి పూర్తిచేయాలి. అప్పుడే అభిమానం, ఆదరణ పెరుగుతాయి.


అలవాట్లు.. ఈజీ మనీ ఎక్కువై లేదా నైతిక విలువల పట్ల అవగాహన లేక మద్యం లాంటివి అలవాటవుతాయి. వాటిని మొగ్గలోనే తుంచేయకపోతే వ్యసనంగా మారి కుటుంబాన్ని ఛిద్రం చేయడం తథ్యం.


ఆకర్షణలూ ప్రలోభాలూ.. ఆఫీసులో అందమైన, హోదాలో ఉన్న సహోద్యోగులు ఎదురవుతారు. అంత మాత్రాన ఆకర్షణకు లోనైతే.. ఇక సంసారంలో బీటలు మొదలైనట్టే. అది తాత్కాలికంగా మురిపించవచ్చు. కానీ ఆ ప్రలోభాల వల్ల భాగస్వామి దూరమైతే.. ఇక జీవనపర్యంతం ఒంటరితనం తప్పదు.


ఈ నాలుగు సూత్రాలు గుర్తుంచుకుని అనుసరిస్తే చాలు అనుబంధాల తీగ ఆత్మీయ కుసుమాలతో చూడముచ్చటగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని