ప్రేమలో ప్రశ్నలుండాలి..

ఇరువురిమధ్య ప్రేమ చిగురించడమే కాదు, అది శాశ్వత బంధంగా మారాలంటే వారిమధ్య ప్రశ్నలు కూడా ఉండాలంటున్నారు నిపుణులు.

Published : 31 Jan 2023 00:37 IST

ఇరువురిమధ్య ప్రేమ చిగురించడమే కాదు, అది శాశ్వత బంధంగా మారాలంటే వారిమధ్య ప్రశ్నలు కూడా ఉండాలంటున్నారు నిపుణులు. అప్పుడే ఒకరి మనసు మరొకరికి బాగా తెలిసే వీలుంటుంది అంటున్నారు.

* రోజులో ఏ సమయమంటే ఇష్టం.. తమ మనసుకు నచ్చిన పనిని ఎప్పుడు చేయాలనిపిస్తుంది అని భాగస్వామిని అడగాలట. అప్పుడే వారి మనసుకు నచ్చినట్లుగా నడుచుకోవడానికి లేదా వారికిష్టమైనది చేయడానికి ఆ సమయాన్ని వినియోగించుకొనేలా చేయడానికి వీలుంటుందట. అలా చేస్తే అవతలివారి మనసులో సుస్థిరస్థానాన్ని సంపాదించుకోవచ్చట.

* ఎప్పటికప్పుడు వారి లక్ష్యాలేంటో అడిగి తెలుసుకోవడం మరవకూడదు. వారికంటూ కొన్ని సాధించాల్సిన కలలు ఉండొచ్చు. అవేంటో తెలుసుకుంటేనే కదా.. కావాల్సినంత చేయూతనివ్వొచ్చు. వారి ఆశయానికి తోడుగానూ నిలవొచ్చు.

* భాగస్వామికి మీలో మార్చుకోవాల్సినవి ఏవైనా ఉన్నాయేమో అడగడం మంచిదంటున్నారు నిపుణులు. కోపం, కంగారు, ఆందోళనపడటం లేదా సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడంలో వెనుకబడటం వంటివి ఏవైనా మీ లోపాలు కావొచ్చు. వాటిని మీరు గుర్తించలేకపోయినా అవతలివారికి అర్థమవుతుంది. అదేంటో ప్రశ్నిస్తే వారే చెబుతారు. వాటిని మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటేనే ఇరువురి మధ్య బంధం బలపడుతుంది.

* ఇష్టమైన ఆహారం, పర్యాటకం, ఆహార్యం వంటివన్నీ భాగస్వామిని ప్రశ్నిస్తేనే తెలుసుకోగలరు. మనసుకు నచ్చిన వారికిష్టమైన వంటకం మీరు చేసివ్వడానికి వీలుంటుంది. తనకిష్టమైన ప్రాంతానికి తీసుకెళ్లి సర్‌ప్రైజ్‌ ఇచ్చి చూడండి. వారి ముఖంలో కనిపించే ఆనందం, అనుభూతిని జీవితాంతం మరవలేరు.

* బకెట్‌ లిస్ట్‌ గురించి ప్రశ్నంచడంలో తప్పులేదు. ప్రతి ఒక్కరికీ ఎప్పటికైనా చేసి తీరాలనే లిస్ట్‌ తప్పనిసరిగా ఉంటుంది. అవి తెలిస్తే వాటిని నెరవేర్చుకోవడంలో మీ వంతు కృషి చేయొచ్చు. ఆ విషయంలో మీది చిన్న సాయమే అయినా... వారు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో మీ చేయూత భాగస్వామికి కొండంత బలాన్నిస్తుంది.

* కెరియర్‌ను మార్చుకోవాలి అనుకున్నారనుకోండి. కారణాన్ని ప్రశ్నించాలి. దానిపై మీ అభిప్రాయాన్ని చెప్పడానికి అప్పుడే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రయోజనాలున్నాయో లేదో మీకు తెలిసుండొచ్చు. వాటిని మీరు చెప్పాలంటే ఎదుటివారి కారణం తెలుసుండాలి. దాన్ని బట్టి వారు ఎంచుకున్న మార్గానికి మీ చేయూతనిస్తే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్